Published : 05/02/2023 00:05 IST

పిల్లలకూ కొన్ని నైపుణ్యాలు

చిన్నతనం నుంచే పిల్లలకు కొన్ని నైపుణ్యాలు అవసరమవుతాయట. వాటిని పెద్దవాళ్లే నేర్పించాలంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏంటవి?

మయపాలన.. జీవితంలో అమ్యూలమైన వాటిల్లో సమయమొకటి. సకాలంలో పనులు పూర్తిచేయడం అలవాటుగా మార్చండి. అప్పుడే క్రమశిక్షణ అలవడుతుంది. హోంవర్క్‌, అప్పగించిన బాధ్యతలను పూర్తిచేయడం పనేదైనా సకాలంలో పూర్తిచేయాలన్న విషయం తెలిస్తే చాలు.. జీవితంలో ప్రతి నిమిషాన్ని వినియోగించుకోవడం తెలుసుకుంటారు.

ఆరోగ్యమే..  ఏది సాధించాలన్నా

ఆరోగ్యమే ప్రధానం. ఇదీ చిన్నతనంలోనే చెప్పాలి. వ్యాయామం, నృత్యం, క్రీడలు వాళ్లకి నచ్చిందేదైనా సరే ప్రయత్నించేలా చూడండి. అవి శరీరానికి, మనసుకు ఎలా మేలు చేస్తాయో వివరించాలి. మీరూ వారితో కలిసి. మైదానానికి వెళ్లడం, సరదాగా డ్యాన్స్‌ చేయడం, కలిసి ఇండోర్‌, అవుట్‌డోర్‌ గేమ్స్‌ ఆడండి. ఉత్సాహంగా కొనసాగిస్తారు. పిల్లల తిండి విషయంలోనూ మనకు బెంగే! చిన్న చిన్న వంటలు వాళ్లే ప్రయత్నించేలా చూడండి. కష్టం తెలియడమే కాదు.. ఇష్టంగానూ తింటారు.

గౌరవ మర్యాదలు.. మంచి నడవడిక, ఎదుటి వారిపట్ల మృదువైన ప్రవర్తన అలవడాలంటే నేర్పాల్సింది మనమే. అవతలివారి వయసు, స్థాయిని బట్టి ఎలా మాట్లాడాలో చెబుతూ ఉండాలి. పెద్దవాళ్లే కాదు.. తోబుట్టువులు, స్నేహితులకీ గౌరవం ఇవ్వమనాలి. అవతలివ్యక్తిని ఎలా సంబోధించాలో, వాళ్లతో ఎలా సంభాషించాలన్న విషయంలో చాలావరకు పిల్లలు పెద్దవాళ్లనే అనుకరిస్తారు. కాబట్టి, గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకోవడం ముందు మనం పాటిస్తే, వాళ్లూ నేర్చుకుంటారు.

ప్రతికూలతలోనూ...  తరగతిలో ర్యాంకు తెచ్చుకుంటా అనుకుంటే మార్కులు తక్కువగా రావొచ్చు. ఒక్కోసారి వైఫల్యమూ ఎదురవొచ్చు. అన్నీ అనుకున్నట్లుగా జరగకపోవడమే జీవితం. ఇది మనకు అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. మరి పిల్లలకు? అనుకున్నది జరగకపోతే డీలా పడిపోతారు. అప్పుడు కోప్పడొద్దు. ఆందోళన చెందకుండా మరోసారి ప్రయత్నించమని ప్రోత్సహించండి. అప్పుడే విజయం సాధ్యమనే సానుకూలతను పిల్లలకు నేర్పించాలి. అప్పుడే ఒత్తిడి లేకుండా పెరుగుతారు. మరోసారి ప్రయత్నిద్దామనే పట్టుదల వస్తుంది. ఎలాంటి వ్యతిరేకతనైనా ఎదుర్కోగలిగే సామర్థ్యాలూ పెరుగుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని