ప్రతిక్షణాన్ని ఆస్వాదించండి..

ఉరుకుల పరుగుల జీవితం. భాగస్వామి ఆరోగ్యం, అవసరాలు తెలుసుకునేంత సమయం కూడా ఉండటం లేదు చాలామందికి! ఫలితమే ప్రత్యేక రోజులనూ మరిచిపోవడం లాంటివి. చిన్నవే అనుకునే ఇలాంటి పొరపాట్లే ఎక్కువమంది విడిపోవడానికి కారణమవుతున్నాయట.

Published : 05 Feb 2023 00:06 IST

ఉరుకుల పరుగుల జీవితం. భాగస్వామి ఆరోగ్యం, అవసరాలు తెలుసుకునేంత సమయం కూడా ఉండటం లేదు చాలామందికి! ఫలితమే ప్రత్యేక రోజులనూ మరిచిపోవడం లాంటివి. చిన్నవే అనుకునే ఇలాంటి పొరపాట్లే ఎక్కువమంది విడిపోవడానికి కారణమవుతున్నాయట. అలా కాకుండా దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగిపోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి అంటున్నారు నిపుణులు.

సాన్నిహిత్యం.. భార్యాభర్తలుగా జీవించాలంటే ముందు స్నేహితులుగా మెలగాలి. ఇద్దరూ ఒకరికొకరి ఇష్టాలు, అభిరుచులు తెలుసుకోవాలి. ఏ విషయాన్నైనా పంచుకునే చనువు ఉండాలి. అభద్రతా భావం లేకుండా ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉండాలి. ఒకరి నమ్మకాలను మరొకరు గౌరవించాలి. అలాగని ఏదైనా నచ్చకపోతే మౌనంగా భరించొద్దు. ఎదుటివారితోనూ బలవంతంగా ఏదీ చేయించొద్దు. అప్పుడు గొడవలకు తావుండదు. రోజులన్నీ సాఫీగా సాగుతాయి.

డేట్‌తో.. ఇల్లు, ఆఫీసు పని, పిల్లలు అంటూ ఇద్దరి మధ్యా అనుబంధాన్ని కాస్త పక్కన పెట్టేస్తాం. ప్రేమ తరిగేదిలాగే. కాబట్టి, చిన్న చిన్న డేట్‌లు, లాంగ్‌ డ్రైవ్‌లు ప్లాన్‌ చేస్తుండండి. నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్తే మరీ సంతోషిస్తారు. అది మీలోనూ మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. కలిసి గడిపే కొద్ది సమయం చాలు.. బంధం బలపడటానికి!

బహుమతులు.. పెళ్లిరోజు, పుట్టినరోజులకు సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌ చేయండి. బహుమతులు మెచ్చని వారుండరు. చిన్నదైనా ఫర్లేదు.. వారిపై మీకున్న ప్రేమను తెలియజేస్తూ చిన్న సందేశంతో ఇవ్వండి. అవతలి వాళ్ల మనసు గెలుచుకున్నట్టే. వీటికోసం ప్రత్యేక సందర్భాల కోసమే వేచి చూడొద్దు. వీలు కల్పించుకోండి.

తెలియజేయండి.. ప్రేమ.. మనసులో, వారి కోసం చేసే పనుల్లో ఉంటే సరిపోదు. అందరికీ అర్థం చేసుకునేంత సమయం, ప్రతిభ ఉండదు. ఒక మాట, చిన్న మెసేజ్‌ల్లో.. అప్పుడప్పుడూ వ్యక్తపరచండి. అప్పుడే మీ ప్రేమ వారికీ అర్థమవుతుంది. ఈ చిన్న పనే.. కలకాలం తోడుగా ఉండే వ్యక్తి మనసులో మీ చోటును సుస్థిరం చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్