మీరొకటైనా.. అవి వేరుగానే!

ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే పెళ్లి. ఈ బంధంలో ఇద్దరూ సమానమే! అయితే ఇరువురూ ఉద్యోగస్థులే అయినా ఆర్థిక విషయాలు మాత్రం మగవాళ్లకే వదిలేస్తుంటారు చాలామంది. అలా వద్దంటున్నారు నిపుణులు.

Published : 26 Feb 2023 00:16 IST

ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే పెళ్లి. ఈ బంధంలో ఇద్దరూ సమానమే! అయితే ఇరువురూ ఉద్యోగస్థులే అయినా ఆర్థిక విషయాలు మాత్రం మగవాళ్లకే వదిలేస్తుంటారు చాలామంది. అలా వద్దంటున్నారు నిపుణులు. వాటినీ పంచుకోమంటున్నారు.

* ప్రతి విషయాన్నీ మనసు విప్పి మాట్లాడుకోవడమే ఆరోగ్యకరమైన సంసారానికి చిహ్నం. ఇది ఆర్థిక విషయాలకీ వర్తిస్తుంది అంటారు నిపుణులు. అమ్మాయికి కలల ఇల్లు, బ్రాండెడ్‌ బ్యాగు.. అబ్బాయికి ఖరీదైన కారు, విదేశీ ప్రయాణం.. డబ్బుతో ముడిపడిన ఇలాంటి కోరికలెన్నో! ఇద్దరిదీ ఒక్కో కోరిక. వీటి విషయంలో అవతలివాళ్ల అభిప్రాయం తెలుసుకోకుండా నిర్ణయం తీసుకుంటేనే విభేదాలు తలెత్తేది. కాబట్టి, ‘కొంటున్నా.. టికెట్లు బుక్‌ చేశా’ అంటూ విషయం చెప్పడం కాదు.. ‘ఏం చేద్దాం, ఎలా చేద్దాం’ అని చర్చించండి. అవతలి వాళ్ల కోణాన్నీ తెలుసుకొని ఆపై నిర్ణయానికి రండి.. గొడవలకు, అసంతృప్తికి తావుండదు.

* పంచుకోమన్నారు కదా అని ప్రతిదానిలో వంతులు వేసుకొమ్మని కాదు. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన జీతాలూ ఒకేలా ఉండాలనేం లేదు. ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ ఉండొచ్చు. ఒకరు పెట్టుబడి చూసుకుంటే ఇంకొకరు ఇంటి ఖర్చులు చూసుకోవడం అలాగుండాలి. నా జీతం నాదే.. భర్తవి కాబట్టి, నువ్వే ఖర్చు భరించాలన్న తీరూ మంచిది కాదు. అలాగే ఆడ, మగ.. ఇద్దరికీ వ్యక్తిగత ఖర్చులు కొన్ని ఉంటాయి. అనవసరం కానంతవరకూ వాటిల్లో కలగజేసుకోకుండా ఉండటమే మేలు.

* ఎంతసేపూ ఖర్చులేనా.. భవిష్యత్‌ గురించీ ముందుగానే ఆలోచించాలి. ఓ జాయింట్‌ అకౌంట్‌ తీసుకోండి. ఇద్దరి ఆదాయాలను బట్టి ఖర్చులు, సేవింగ్స్‌ అంటూ విభజించండి. ఖర్చుల మొత్తాన్ని ఎవరి అకౌంట్లలో వాళ్లు ఉంచుకొని, దాయాల్సినదాన్ని జాయింట్‌ అకౌంట్‌లోకి తరలించేయండి. అప్పుడు నీది, నాది అన్న తేడాలుండవు. సంసారంలో సగం విభేదాలు ఆర్థిక విషయాల్లోనే తలెత్తుతాయి. ఆదాయం, ఖర్చులు ఇద్దరికీ తెలిసినప్పుడే దేనికెంత కేటాయించాలో, ఎంత దాయాలో తెలుస్తుంది. అనవసర ఖర్చులు, అసంతృప్తులకీ తావుండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్