కోపం సరే.. తర్వాతేంటి?

ఎంత అన్యోన్యంగా ఉండే జంటైనా గిల్లికజ్జాలు సాధారణమే! కాస్త పరిధి దాటితే కోపాలు, అవతలి వ్యక్తిపై అరవడాల వరకూ వెళ్లే పరిస్థితులూ వస్తుంటాయి. ఇవన్నీ ఏ ఇంట్లో అయినా ఉండేవే! ఆ తర్వాతేంటి? కోపమొచ్చింది.. సరే! మూతి ముడుచుకుని కూర్చోవడం వల్ల ప్రయోజనం ఉండదు కదా? ఎందుకొచ్చిందో ఆలోచించండి.

Published : 27 Feb 2023 00:12 IST

ఎంత అన్యోన్యంగా ఉండే జంటైనా గిల్లికజ్జాలు సాధారణమే! కాస్త పరిధి దాటితే కోపాలు, అవతలి వ్యక్తిపై అరవడాల వరకూ వెళ్లే పరిస్థితులూ వస్తుంటాయి. ఇవన్నీ ఏ ఇంట్లో అయినా ఉండేవే! ఆ తర్వాతేంటి?

కోపమొచ్చింది.. సరే! మూతి ముడుచుకుని కూర్చోవడం వల్ల ప్రయోజనం ఉండదు కదా? ఎందుకొచ్చిందో ఆలోచించండి. తన అలవాటేదైనా నచ్చలేదా.. అసలు మీ మనసే బాలేక ప్రతిదానిపై కోపమొస్తోందా.. గమనించుకోండి. కారణం తెలిశాక దాన్ని భాగస్వామితో పంచుకుంటే సరి. భవిష్యత్తులో గమనించుకుంటారు.

తగాదా ఒకదాని వల్ల వస్తుంది. మాటా మాటా పెరిగేకొద్దీ గతంలో జరిగినవన్నీ బయటికొచ్చేస్తుంటాయి. మీరూ అలా చేయడం లేదు కదా! కోపంలో అనే మాటలు లోతైన గాయం చేస్తాయి. దేని మీద విభేదం వచ్చిందో దాని గురించే మాట్లాడాలి.

కోపం మహా చెడ్డది. మనపై మనం పట్టు కోల్పోయేలా చేయగలదు. కాబట్టి, అరిచి పంతం నెగ్గించుకోవాలి అనుకోవద్దు. ఇరువురి మధ్యా దూరానికి కారణం కాగలదు. సామరస్యంగా మాట్లాడుకోండి. తప్పులు ఎంచొద్దు.. వాటికి పరిష్కారాలు కనుక్కునేలా సంభాషణ సాగాలి. ఫలానా విభేదం రావొద్దంటే ఇద్దరూ ఏం చేయాలో సూచనలు ఇచ్చి పుచ్చుకోండి. ఇద్దరూ పాటించడానికి ప్రయత్నిస్తే.. కలతల్లేని దాంపత్యం మీ సొంతం.

శిక్షించాలి... అవతలి వ్యక్తి బాధపడేలా చేయాలి అనుకున్నప్పుడే సమస్య పెద్దది అవుతుంది. ముందు భాగస్వామిని ప్రత్యర్థిగా చూడటం మానేయండి. సమస్య- దాన్ని దూరం చేసుకోవడంపైనే ఆలోచన ఉండాలి. ఏమీ తట్టలేదా.. కొంచెం సమయం తీసుకోండి. కోపం పోయేవరకూ ఇతర వ్యాపకాలపై దృష్టిపెట్టండి. మనసు తేలిక పడిందని అనిపించాక బాధ పడ్డ విషయాన్ని చెప్పండి. దానికి అవతలి వ్యక్తి కోణం వింటే ఒక్కోసారి అంతసేపు బాధ పడటమూ సమయం వృథాగానే తోయొచ్చు. కాబట్టి.. కోప మొచ్చినపుడు ప్రదర్శించడం కాదు.. సంయమనం పాటించడంపై దృష్టిపెట్టండి. గొడవలూ సంసారంలో అనుభవాలై పాఠాలు నేర్పుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్