నిలదీయొద్దు.. నేర్పించండి!

చిన్నారుల్ని పెంచలేక అవస్థ పడుతున్నప్పుడల్లా.. పూర్వం డజనుమంది పిల్లల్ని  కూడా ఎలా పెంచేవాళ్లో అని- ఆశ్చర్యపోతుంటాం కదూ! అప్పట్లో ఈ అంతర్జాల మాయాజాలం లేదు కాబట్టి అవలీలగా పెంచేశారు. కానీ, కాలం మారుతూనే ఉంటుందిగా. అందుకు తగ్గట్టే పిల్లలు ఎంత గడుసుతనాలు చూపినా తెలివిగా దారికి తెచ్చుకోవాలి.

Published : 27 Feb 2023 00:22 IST

చిన్నారుల్ని పెంచలేక అవస్థ పడుతున్నప్పుడల్లా.. పూర్వం డజనుమంది పిల్లల్ని  కూడా ఎలా పెంచేవాళ్లో అని- ఆశ్చర్యపోతుంటాం కదూ! అప్పట్లో ఈ అంతర్జాల మాయాజాలం లేదు కాబట్టి అవలీలగా పెంచేశారు. కానీ, కాలం మారుతూనే ఉంటుందిగా. అందుకు తగ్గట్టే పిల్లలు ఎంత గడుసుతనాలు చూపినా తెలివిగా దారికి తెచ్చుకోవాలి. అందుకు నిపుణులు సూచిస్తున్న సలహాలు పాటించండి.

పిల్లలకు ప్రపంచ పరిజ్ఞానం ఎక్కువైంది. దాంతో అమ్మానాన్నలు చెప్పిందల్లా బుద్ధిగా వినడం కంటే మారాం చేయడాలూ, మొండికేయడాలూ ఎక్కువయ్యాయి. అలాంటప్పుడు వెంటనే కోపతాపాలు చూపించొద్దు. కొన్ని నిమిషాలపాటు మౌనంగా ఉండండి. శ్వాసను గమనించండి. కమ్ముకొచ్చిన ఆవేశం తగ్గి ప్రశాంతత వస్తుంది. అప్పుడు కంఠం హెచ్చించకుండా వీలైనంత సౌమ్యంగా మాట్లాడండి. కోప్పడుతున్నట్లో, నిలదీస్తున్నట్లో కాకుండా చేసిన తప్పు గ్రహించేలా చెప్పండి. రాబోయే అనర్థాలను వివరించండి.

మీ స్వరం శాంతంగా ఉన్నప్పటికీ ఆలోచనలు స్థిరమని చిన్నారికి అర్థం కావాలి. మీరు చెప్పిన నియమాలేంటో, వాటిని అమలుపరచకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో స్పష్టంగా చెప్పండి. మరోసారి తప్పు జరిగితే ఉపేక్షించనని నెమ్మదిగానే అయినా గట్టిగానే చెప్పండి.

చిన్నతనంలో చెప్పింది వినకపోతే పెద్దయ్యాక ఎన్ని అగచాట్లు ఉంటాయో ఉదాహరణలతో చెప్పండి. పిల్లలు వినయంగా ఉంటే ఎంత ముచ్చటేస్తుందో, ఎదురుచెబితే ఎంత అసహనం కలుగుతుందో కథల ద్వారా అర్థమయ్యేలా చెప్పండి. ఇలాంటి కథలూ, ఉదంతాలూ చక్కటి వ్యక్తిత్వానికి దారి చూపిస్తాయి.

చిన్న మంచి పని చేసినా తప్పకుండా మెచ్చుకోండి. ప్రశంసలు ప్రోత్సాహాన్నిచ్చి మరిన్ని మంచి పనులకు కారణమవుతాయి. అలాగే ఏదైనా తప్పు చేస్తే ఇష్టమైంది ఇవ్వకుండా శిక్షించండి. ఇంకోసారి జాగ్రత్తగా ఉంటారు.

పిల్లలు ఎంత కోపం తెప్పించినా తల్లీ తండ్రీ ఒకేసారి దండించొద్దు. ఒకరు కోప్పడినప్పుడు ఆ ఆవేశం నిజమేనని సమర్థిస్తూనే ఇంకోసారి చేయొద్దంటూ రెండోవారు ఊరడించాలి. అప్పుడు చిన్నారికి తన తప్పూ తెలిసొస్తుంది, ఒంటరితనపు దుఃఖమూ ఆవరించదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్