అమ్మో.. పిల్లలు!

‘పుస్తకాల సంచుల్లో కండోమ్స్‌’, ‘గర్భందాల్చిన చిన్నారి’, ‘నీలిచిత్రాలు చూస్తున్న టీనేజర్లు’.. రోజు రోజూ ఇలాంటి వార్తలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ!

Published : 02 Mar 2023 00:10 IST

‘పుస్తకాల సంచుల్లో కండోమ్స్‌’, ‘గర్భందాల్చిన చిన్నారి’, ‘నీలిచిత్రాలు చూస్తున్న టీనేజర్లు’.. రోజు రోజూ ఇలాంటి వార్తలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ! గుండె దద్దరిల్లినా, మెదడు మొద్దుబారినా.. తేరుకుని హమ్మయ్య మన పిల్లలు కాదని ఊపిరి పీల్చుకుంటాం. మనమేం చేయగలం లెమ్మని ఆలోచనల్ని అక్కడితో తెంపేసి మరో పనిలో మునిగిపోతాం. కానీ ఇది కాల్లో ముల్లు గుచ్చుకోవడం లాంటి చిన్న విషయం కాదు. కాలిబాటే తెగిపోయి జీవనం స్తంభించేంత భయానక పరిస్థితి. ఆ చీడ, పీడలు మరింత పెచ్చరిల్లి మరెందరో రక్కసులుగా మారకుండా, అభంశుభం తెలీని ప్రసూనాలు బలైపోకుండా చూడాల్సిన బాధ్యత అమ్మలుగా మనందరి మీదా ఉంది. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా మానసిక వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. మరి పాటించి మన చిన్నారుల్ని కాపాడుకుందామా..

* కథలనేవి కాలక్షేపానికే అనుకుంటారు చాలామంది. నిజానికవి కౌన్సెలింగ్‌ మాత్రలు. అందుకే పిల్లలకి చక్కటి నీతికథలు చెప్పండి. అలాగే ప్రపంచ ప్రముఖుల గాథలు లేదా వాళ్ల జీవితాల్లో స్ఫూర్తిదాయక సన్నివేశాలు చెప్పండి. అవెంతో ప్రభావం చూపుతాయి. అద్భుతాలు జరిగి పిల్లలు మహోన్నత స్థాయికి చేరినా చేరకున్నా అధమ స్థితి మాత్రం వాటిల్లదు. ఈ పని మొగ్గదశలోనే చేయాలి.

* ఒకసారి తప్పుదారి పట్టారంటే అది ఎంత దూరమైనా తీసుకెళ్లొచ్చు, ఘోర పతనావస్థలోకి నెట్టేయొచ్చు. కనుక గాడి తప్పకుండానే, చెడు రుచి చూడకుండానే జాగ్రత్తపడండి. లేదంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమౌతుంది.

* మన పిల్లలు బోల్డన్ని విషయాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌లు ఇచ్చేయడం సాధారణమైంది. కానీ సాంకేతిక నిపుణుల సాయం తీసుకుని అశ్లీల వెబ్‌సైట్లు ఓపెన్‌ కాకుండా చూడండి. అలాగే వాళ్లు ఎలాంటి అంశాలను చూస్తున్నారో బ్రౌజింగ్‌ డేటా గమనిస్తుండండి.

* మీ చిన్నారుల చూపులు, చేష్టలు, ప్రవర్తనా శైలిని కనిపెడుతూ ఉండండి. ఏదైనా తేడా కనిపిస్తే చూసీచూడనట్టు వదిలేయొద్దు. ‘ఫలానా వ్యక్తి చెడు పని చేయడం వల్ల జైల్లో మగ్గిపోతున్నారు’ లాంటి సంఘటనలు గుర్తుచేయండి. పరిణామాలు ఎంత తీవ్రమో చెప్పండి. అవి భయాన్ని కలిగిస్తాయి. పశ్చాత్తాపమూ మొదలవుతుంది.

* వాళ్ల ప్రవర్తన వికృతంగా ఉందని అనుమానం వచ్చినా, స్పష్టంగా తెలిసినా నిర్లక్ష్యం చేయొద్దు. క్లినికల్‌ సైకాలజిస్టును సంప్రదించి మార్పుకు యత్నించండి. లేదంటే భారీ మూల్యం చెల్లించాల్సివస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్