పిల్లలతో ఇలా ఉండొద్దు..

జ్యోతి తన స్నేహితురాలి పిల్లలను చూసి ఆశ్చర్యపోతుంది. తల్లిదండ్రులతో ఆ చిన్నారుల ప్రవర్తన చూడముచ్చటగా ఉంటుంది.

Published : 04 Mar 2023 00:17 IST

జ్యోతి తన స్నేహితురాలి పిల్లలను చూసి ఆశ్చర్యపోతుంది. తల్లిదండ్రులతో ఆ చిన్నారుల ప్రవర్తన చూడముచ్చటగా ఉంటుంది. తన ఇద్దరు పిల్లలు ఇందుకు భిన్నంగా ఉండటానికి కారణం తెలియక బాధపడుతుంది. చిన్నారులతో పెద్దవాళ్లు మెలిగే తీరుని బట్టే వారి ప్రవర్తన ఉంటుందంటున్నారు నిపుణులు. వారితో ఎలా ఉండకూడదో చెబుతున్నారు. 

కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల బొమ్మలు కాస్త పాడైతే చాలు, వెంటనే కొత్తది కొనుక్కుందామని చెబుతారు. దీంతో ఆ చిన్నారులు తమ బొమ్మ కొంచెం విరిగినా చాలు.. వెంటనే చెత్తబుట్టలోకి విసిరేసి, అమ్మానాన్న మరొకటి కొనిస్తారు కదా అనుకుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. పిల్లలకు బొమ్మలిచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత వారికే అప్పజెప్పాలి. ఆ బొమ్మ విలువ తెలియజెప్పాలి. ఆటల్లో కొంచెం విరిగినా దాన్ని తిరిగి సరిచేసుకోవడం నేర్పాలి. పాడైన వెంటనే కొత్తది లేదా నాలుగురోజులకే బోర్‌ కొట్టి కొత్త బొమ్మ అడిగే అలవాటును పిల్లలకు త్వరగా రానివ్వకూడదు.

బాధ్యత వారిదే..

స్కూల్‌లో హోంవర్క్‌ మితిమీరి ఉందంటూ తల్లిదండ్రులు వాటిని పూర్తిచేయకూడదు. వీలైతే పక్కనే ఉండి పిల్లలను ప్రోత్సహిస్తూ వారి సందేహాలు తీర్చాలి. లేదంటే కష్టం నుంచి పొందే సత్ఫలితాల విలువ వారికి తెలియదు. అలాగే ఇంట్లో అందరూ కూర్చుని టీవీ చూస్తూ అక్కడే పిల్లలను హోంవర్క్‌ చేయడానికి అనుమతించకూడదు. ఏకాగ్రతగా చదివే అలవాటును వారు ఎప్పటికీ అలవరచుకోలేరు. దీంతోపాటు వారు ఇంట్లో ఏదోమూల నిర్లక్ష్యంగా విసిరేసిన స్కూల్‌ బెల్ట్‌, ఐడీ కార్డు, పెన్సిల్‌ వంటి వస్తువులను తల్లిదండ్రులు వెతక్కూడదు. వారినే కనిపెట్టమనాలి. అప్పుడే తీసిన వస్తువు తీసిన చోట పెట్టే క్రమశిక్షణ వారికొస్తుంది.

పోలికొద్దు..

తోటిపిల్లల బొమ్మలు, వస్తువులు, దుస్తులు వంటివి తమకూ కావాలని కొందరు మారాం చేస్తుంటారు. దాన్ని ప్రోత్సహించకూడదు. ఇతరులతో పోల్చి జీవించడం సరైనది కాదని చిన్నప్పటి నుంచి అవగాహన కలిగించాలి. ఎవరి స్థాయి వారిదనే ఆలోచన వారిలో ఉండాలి. నగదు వృథా చేయడంకన్నా, కనీస అవసరాలకు ప్రాముఖ్యతనిచ్చి, ఆ తర్వాత చేసే పొదుపు అత్యవసరానికి ఎలా ఉపయోగపడుతుందో చెప్పాలి. లేదంటే పిల్లల్లో పొదుపు గురించి అవగాహన పెరగదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్