పోరాడే శక్తినివ్వండి...

ఇరుగుపొరుగు పిల్లలంతా ఉత్సాహంగా కనిపిస్తుంటే, తన పిల్లలు మాత్రం నిత్యం అనారోగ్యంగా ఉండటం రమణికి అర్థంకాదు. పోషకాహారాన్నిస్తున్నా ఎందుకిలా అవుతున్నారో తెలియడంలేదామెకు.

Published : 14 Mar 2023 00:16 IST

ఇరుగుపొరుగు పిల్లలంతా ఉత్సాహంగా కనిపిస్తుంటే, తన పిల్లలు మాత్రం నిత్యం అనారోగ్యంగా ఉండటం రమణికి అర్థంకాదు. పోషకాహారాన్నిస్తున్నా ఎందుకిలా అవుతున్నారో తెలియడంలేదామెకు. తరచూ అనారోగ్యానికి పిల్లలు గురికావడానికి కారణాలెన్నో అంటున్నారు నిపుణులు. వాతావరణం మారినప్పుడల్లా రకరకాల ఇన్‌ఫెక్షన్లు సోకుతుంటాయి. వీటిని తట్టుకొనేలా పిల్లల్లో బాల్యం నుంచి పోషకాహారం అందించడం, పరిశుభ్రత అలవరచడంతో వ్యాధినిరోధక శక్తిని పెంచొచ్చు. జలుబు, దగ్గు, జ్వరం వంటివి పిల్లలకు తేలికగా ఇతరుల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని కూడా చిన్నారుల దరిదాపులకు రాకుండా చేయాలంటే వారిలో వ్యాధితో పోరాడే శక్తిని నింపాలి. ఇందుకోసం ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకోవాలి. లేదంటే తరచూ పిల్లలు అనారోగ్యాలకు గురవుతూనే ఉంటారు.

పాటించాలి..

పిల్లల్లో ఈ అనారోగ్యాలకు జీవనశైలి ప్రధానకారణమంటున్నారు నిపుణులు. ఆహారపుటలవాట్లు, నిద్రావేళలు వంటివన్నీ వారి ఆరోగ్యానికి అనుసంధానమై ఉంటాయి. బయటి ఆహారంపై ఆసక్తి, ఎక్కువగా గ్యాడ్జెట్ల వినియోగం, టీవీ ముందు గంటలతరబడి సమయం వెచ్చించడం, క్రీడలకు ప్రాధాన్యతనివ్వక శారీరక శ్రమ లేకపోవడం, నిద్రలేమివంటివన్నీ చిన్నారులను బలహీనులుగా మారుస్తాయి. ఇలాకాకుండా ఉండాలంటే ఆహారం, నిద్రవేళల్లో సమయపాలన పాటించేలా చేయాలి. అప్పుడే వారిలో జీవక్రియలు సవ్యంగా సాగుతాయి. అవయవాలన్నీ ఆయా సమయానికి తగినట్లు పనితీరును మెరుగుపరుచుకుంటాయి. దీంతో వ్యాధినిరోధక శక్తి పెంపొంది, తరచూ అనారోగ్యాలు వారిపై దాడి చేయలేవు.

అలవాటుగా..

తోటివారితో ఆడుకోవడానికి పిల్లలను ప్రోత్సహించాలి. దగ్గర్లోని ఈతకొలనులో శిక్షణ, లేదా బ్యాట్‌మెంటన్‌, క్రికెట్‌ క్లబ్స్‌లో చేర్చడం మంచిది. సైక్లింగ్‌ అలవాటుగా మార్చాలి. ఒకేచోట కూర్చొని ఉండటం అనారోగ్యమని చెప్పాలి. అప్పుడే కండరాల కదలికతో జీర్ణాశయం పనితీరు మెరుగుపడి, చిన్నారులకు ఆకలి వేస్తుంది. దీంతో ఆహారం తీసుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. పోషకవిలువలున్న కూరగాయలపై అవగాహన పెంచడం, వాటినెలా వండుతారో దగ్గరుండి చూపించడం వంటివి చేస్తే వాటిని తీసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. వ్యవసాయమెలా చేస్తారు, కూరగాయలు, ఆకుకూరల పెంపకాన్ని వీలున్నప్పుడు తీసుకెళ్లి చూపించగలిగితే మరీ మంచిది. అలాగే కంటినిండా నిద్రపోవడాన్ని ప్రోత్సహిస్తూ, కథలు చెప్పడంతో పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్