చిన్ని కోపాలు.. తగ్గించేద్దామిలా!

నచ్చింది కొనివ్వకపోతే అలక. ఓడిపోతే కోపం. చిన్న ఆలస్యాలకే అసహనం.. ఈతరం చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తున్న లక్షణాలు. దాన్ని చూసి ‘వేలెడంత లేవు.. ఇప్పుడే కోపాలా..’ అంటూ మనమూ అరవడం, చేయి చేసుకోవడం కాదు.. దాన్ని మార్చే ప్రయత్నం చేయమంటున్నారు నిపుణులు.

Updated : 10 May 2023 05:38 IST

నచ్చింది కొనివ్వకపోతే అలక. ఓడిపోతే కోపం. చిన్న ఆలస్యాలకే అసహనం.. ఈతరం చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తున్న లక్షణాలు. దాన్ని చూసి ‘వేలెడంత లేవు.. ఇప్పుడే కోపాలా..’ అంటూ మనమూ అరవడం, చేయి చేసుకోవడం కాదు.. దాన్ని మార్చే ప్రయత్నం చేయమంటున్నారు నిపుణులు.

ఈ కోపం, పంతాలను చిన్నతనం అని వెనకేసుకు రావొద్దు. బలహీనతగానే లెక్కేయాలి. అప్పటికి ఊరుకోబెడదాం అని వాళ్లని వెనకేసుకొస్తే.. తమ తీరే సరైనది అనుకుంటారు. అలాగని బెదిరించడమూ సరికాదు. కోపమో, బాధో.. ముందు బయట పెట్టనివ్వండి. అసహనానికి లోనవక పూర్తిగా విని, వాళ్ల వైపే ఉన్నట్టుగా మృదువుగా మాట్లాడుతూ సమస్య తనదో, అవతలి వారిదో తెలుసుకునేలా చేయండి. పరిస్థితిని అంచనా వేయడం నేర్పినవారు అవుతారు.

పిల్లలు అమ్మానాన్నల ప్రతిరూపాలు.. ఈ మాట ప్రవర్తనకీ వర్తిస్తుంది. ముందు మీ ప్రవర్తన ఎలా ఉంది? రెండు మూడుసార్లకే అసహనం.. మాట నెగ్గడానికి గట్టిగా చెప్పడం లాంటివి చేస్తున్నారా? చిన్నారులూ అదే సరైన తీరనుకొని అలవాటు పడతారు. చిరాకు, పని మధ్యలోనే ఆపేయడం, వస్తువులు విసిరేయడం, తిట్లు.. వంటివేవైనా వాళ్లు చూసి నేర్చుకోవడం ద్వారానే అలవడతాయి. వాళ్లు అలా ప్రవర్తించొద్దంటే ముందు ఎక్కడ, ఎవరి నుంచి నేర్చుకుంటున్నారో కనిపెట్టి, వాళ్లని కట్టడి చేయండి. చిన్నారుల్లోనూ మార్పు ప్రారంభమవుతుంది. దీనికి చాలా ఓపిక కావాలి.

కోపంతో చిన్నారులు అరిచేస్తోంటే.. చాలాసార్లు మనమూ అదే రీతిలో ఆవేశపడతాం. లేదూ చేయి చేసుకుంటాం. అది ఆ చిన్ని బుర్రలపై నెగెటివ్‌ ప్రభావం చూపుతుంది. ఎంత కోపమొచ్చినా ఆ సమయంలో సంయమనం కోల్పోవద్దు. మౌనంగా ఉండండి. తగ్గించుకోవడానికి ఊపిరి పీల్చి వదలడం, పక్కకి వెళ్లడం లాంటివి చేయండి. అప్పటికి మీరు శాంతించడమే కాదు.. అదే తీరు పిల్లలూ అనుసరించేలా చేసినవారవుతారు.

‘మా చిన్నప్పుడు ఇలా కాదు’ అంటే అర్థం చేసుకునే తరం కాదిది. దండనే సరైన పద్ధతి అనీ అనుకోవద్దు. అప్పటికప్పుడు వాళ్లని శాంతింపజేయడం, నోరు మూయించడం మీ లక్ష్యం కావొద్దు. పెరిగేకొద్దీ ఆ ప్రవర్తన కొనసాగకుండా చూడటంపైనే దృష్టి ఉండాలన్నది గుర్తుపెట్టుకోండి. వాళ్లలో మార్పు సాధ్యమే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్