చిన్ని మనసులు జాగ్రత్త!

పిల్లలు తిరిగి చదువుల్లో పడుతున్నారు. వాళ్లకేం ఒత్తిడి అనుకుంటాం కానీ.. కొత్తవారి మధ్య ఇమడటం నుంచి కొత్త విషయాలు తెలుసుకోవడం వరకు ప్రతిదీ చిన్న బుర్రలపై భారం మోపేదే!

Published : 11 Jun 2023 00:08 IST

పిల్లలు తిరిగి చదువుల్లో పడుతున్నారు. వాళ్లకేం ఒత్తిడి అనుకుంటాం కానీ.. కొత్తవారి మధ్య ఇమడటం నుంచి కొత్త విషయాలు తెలుసుకోవడం వరకు ప్రతిదీ చిన్న బుర్రలపై భారం మోపేదే! అడ్డుకట్ట వేయాలంటే ఈ అలవాట్లు చేయండి.

* నచ్చిన మొక్కను ఎంచుకోమని కొనివ్వండి. దాని సంరక్షణ బాధ్యత వారికే అప్పగించండి. రోజూ నీరందించడం, దాని చుట్టూ శుభ్రం చేయడం, చీడ పీడల గురించి పట్టించుకోవడం సహా వాళ్లనే చూసుకోమనండి. ఆ చిట్టినేస్తం వారి ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తుంది.

* స్కూళ్లు మొదలయ్యాయంటే చాలు. చదువు తప్ప ప్రతిదీ అనవసరంగానే తోస్తుంది మనకు. ఏమాత్రం సమయం దొరికినా చదవొచ్చుగా, రాయొచ్చుగా అనేస్తాం. నిరంతరం మెదడుని చదువుతో నింపేస్తూ పోతే మానసికంగా అలసిపోతారు. ఓ గంట పెయింటింగ్‌, డ్యాన్స్‌.. ఇలా నచ్చినవి చేయనీయండి.

* నచ్చిన విషయం, స్నేహితులతో గొడవ.. ఏదైనా మనతో పంచుకోవడానికి వెనకెనకే తిరుగుతుంటారు. ఈసారి నుంచి కాగితంపై పెట్టమనండి. ఇదో థెరపీ లాంటిదే. ఆలోచించి అక్షరరూపం ఇస్తారు కదా.. ఒత్తిడి దూరమవుతుంది. భావోద్వేగాల పైనా, భావవ్యక్తీకరణపైనా పట్టు వస్తుంది.

* కొత్త పాఠమో, పద్యమో నేర్చుకోమంటే ‘అబ్బా.. అమ్మా’ అనేస్తారు కానీ.. భాష నేర్చుకోమనండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేర్చుకున్నది ప్రయత్నించే క్రమంలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కూడా పెరుగుతాయి.

* ఉదయాన్నే మన అరుపులు, కేకలే వాళ్లకి సుప్రభాతాలు. లేవమనో, ఆలస్యమవుతోందనో.. వాళ్ల కోసమే అరుస్తుంటాం. కానీ, ఆ అరుపులు చిట్టి మెదళ్లపై ప్రతికూల ప్రభావం పడేలా చేస్తాయట. శ్లోకాలు, వాద్య సంగీతం.. వంటివి పెట్టి లేపే ప్రయత్నం చేయండి. మనసు ఆహ్లాదంగా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్