కొంచెం గౌరవం.. ఇంకొంచెం ప్రేమ!

ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం ఉన్నప్పుడు ‘నువ్వు లేనిదే నేను లేను.. ఇద్దరం జీవితాంతం కలిసుండా’లని ప్రమాణాలు చేసుకుంటారు. తీరా బంధంలోకి అడుగుపెట్టిన కొన్నిరోజులకే కొన్ని జంటలు ‘నీ నీడను కూడా భరించలేను’ అనే స్థాయికి చేరతారు.

Published : 27 Nov 2023 01:28 IST

ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం ఉన్నప్పుడు ‘నువ్వు లేనిదే నేను లేను.. ఇద్దరం జీవితాంతం కలిసుండా’లని ప్రమాణాలు చేసుకుంటారు. తీరా బంధంలోకి అడుగుపెట్టిన కొన్నిరోజులకే కొన్ని జంటలు ‘నీ నీడను కూడా భరించలేను’ అనే స్థాయికి చేరతారు. అలాకాకుండా వారి మధ్య ప్రేమ కలకాలం నిలవాలంటే..

  • పెళ్లైన కొత్తలో పరస్పర ఆకర్షణ, సానుభూతి ఉంటాయి. ఒకరి ముందు మరొకరు ఉన్నతంగా నిలవాలన్న కోరికా ఉంటుంది. దీంతో ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సహకరించుకోవడం సహజంగా జరిగిపోతాయి. కొన్నాళ్లయ్యే సరికి ప్రేమ లోపిస్తుంది. దీంతో చిటపటలు మొదలవుతాయి. అవికాస్తా చినికి చినికి గాలివానలా మారితే ఒకరి ఉనికే మరొకరు భరించలేని స్థితికి చేరుకుంటారు. ఇలా కాకూడదంటే మొదటి నుంచే నిజాయతీగా ఉండాలి. లేనిపోని అబద్ధాలు, మంచి మార్కులు కొట్టేయాలని మీకు నచ్చని పనులు చేయొద్దు. కొన్నిరోజులకు బలవంతంగా చేయలేక విసుగొస్తుంది. ఇద్దరి మధ్యా విభేదాలొస్తాయి. కాబట్టి.. మీ అభిరుచులు చెబుతూనే అవతలి వాళ్లవీ తెలుసుకోండి. ఇద్దరూ ఒకరి ఆసక్తులకు మరొకరు గౌరవం ఇచ్చుకుంటూ సాగితే..ఏ పొరపొచ్చాలకు తావుండదు.
  • పెళ్లి అంటే ఒక బంధంలోకి ఇద్దరూ ఉమ్మడిగా ప్రవేశించడం. అంతేకానీ ఎవరూ మరొకరి ఆస్తి కాదు. నేను చెప్పిందే వినాలి, అనుమతి తీసుకోవాలి లాంటివి అవతలి వ్యక్తిపై ఒత్తిడిని పెంచుతాయి. ఈ తీరూ బంధంలో విభేదాలను తెచ్చిపెడుతుంది. సంతోషమైనా, దుఃఖమైనా ఇద్దరమూ సమానమే అన్న భావన ఉండాలి. ఒకరిపై మరొకరికి నమ్మకం, బాధ్యత ఉండాలి. ఈ సుగుణాలుంటే వివాహ బంధం మరింత బలపడుతుంది.
  • జీవితం సినిమా కాదు. తెర మీద జీవితాలు, తోటివారిని చూసుకొని అలా ఉండాలన్న ప్రయత్నమూ మంచిది కాదు. వాస్తవానికి దగ్గరగా జీవించాలి. ప్రతి విషయాన్ని డబ్బుతో ముడిపెట్టడమూ మంచిది కాదు. ఉన్నంతలో ఎలా సంతోషంగా ఉండాలన్నది గమనించుకుంటే అసంతృప్తులకు తావుండదు. ఇక  గొడవలకు ఆస్కారమేది?
  • కుటుంబ నేపథ్యం, పెరిగిన వాతావరణం,  కూడా పెళ్లిపై ప్రభావం చూపుతాయి. అయితే ఒంటరిగా వేరు.. కలిసి జీవించడం వేరు. ఒకరి అవసరాలు, ఇష్టాయిష్టాలను గమనించుకుంటూ సర్దుకోవడం అలవాటు చేసుకుంటే అదీ పెద్ద భారంగా తోచదు. ఎదుటివారి మాటకు విలువనిస్తూ ఆచితూచి అడుగేస్తే.. బంధం కలకాలం నిలవడం ఖాయమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్