పిల్లల్ని విహారయాత్రకు పంపుతున్నారా?

డిసెంబరు నెల వచ్చిందంటే చాలు... పాఠశాల చిన్నారులకు విహార, విజ్ఞానయాత్రలు మొదలవుతాయి. వీటికి వెళ్తామని పిల్లలు మారాం చేస్తారు.

Updated : 06 Dec 2023 12:42 IST

డిసెంబరు నెల వచ్చిందంటే చాలు... పాఠశాల చిన్నారులకు విహార, విజ్ఞానయాత్రలు మొదలవుతాయి. వీటికి వెళ్తామని పిల్లలు మారాం చేస్తారు. తల్లిదండ్రులేమో అక్కడెలా ఉంటారో, అనుకోని ప్రమాదాలేమైనా చుట్టుముడతాయేమో అన్న సందేహాలతో కాదనేస్తారు. దీంతో నొచ్చుకోవడమే కాదు... భవిష్యత్తులో సొంత నిర్ణయాలు తీసుకోవడానికీ వెనకాడతారు. అలా కాకూడదంటే ఈ జాగ్రత్తలు చెప్పి పంపించండి. భద్రంగా తిరిగి వస్తారు.

  • పిల్లల్ని ఏ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారో? అక్కడ సౌకర్యాలు ఎలా ఉంటాయో అన్నీ ముందే తెలుసుకోండి. వారు వెళ్లే చోట ఉండే అత్యవసర నంబర్లూ, దగ్గర్లో ఉండే మీ సన్నిహితుల వివరాలూ వంటివి అందుబాటులో ఉంచుకోండి. ఇవన్నీ మిమ్మల్ని కుదుట పరుస్తాయి.
  • ఇక, చిన్నారుల విషయానికి వస్తే...వారికి కొత్త ప్రదేశంలో ఎలా ఉండాలి? నలుగురితో ఎలా వ్యవహరించాలి? ఆపత్కాలంలో ఎలా స్పందించాలి వంటివన్నీ ముందే తెలియజేయండి. ఇలా చేస్తే అక్కడికెళ్లాక ఇబ్బందిపడకుండా ఉంటారు.
  • సాధారణంగా పిల్లలు చిన్న చిన్న బహుమతులకూ, తినుబండారాలకూ ఆకర్షితులవుతారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాటిని తీసుకోవద్దనీ, ఇతరులు చెప్పే మాటల్ని నమ్మొద్దనీ...ఏమున్నా ఉపాధ్యాయులతో పంచుకోవాలనీ చెప్పండి. ఇలాంటి పరిస్థితులు తలెత్తితే అప్రమత్తంగా ఉంటారు.
  • కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు...ఎక్కడో ఒకచోట సరదాగా సమయం గడుపుతుంటారు. అలా అక్కడే ఉండిపోవద్దనీ, ఒంటరిగా ఎక్కడికీ వెళ్లొద్దనీ చెప్పండి. వారు ఏం చేసినా సమూహంలోనే చేయాలనే విషయాన్నీ, లేదంటే ముంచుకొచ్చే ప్రమాదాలనూ వివరించండి. అర్థం చేసుకుంటారు.
  • బయటకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం, పరిసరాలు శుభ్రంగా ఉండకపోవచ్చు. ప్రాథమిక ఆరోగ్య సూత్రాలను చెప్పి వాటిని పాటించమనండి. ఈ రోజుల్లో పిల్లలు ఫోనుల్లో నంబర్లు సేవ్‌ చేసుకుంటారు తప్ప అడిగితే చెప్పలేరు. వీలైతే వారికి అత్యవసరంగా చేయాల్సిన నాలుగు నంబర్లను చిన్న పుస్తకంలో రాసివ్వండి. రెండింటిని గుర్తుండిపోయేలా బట్టీపట్టించండి. అత్యవసర సమయంలో ఉపయోగపడతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్