పిల్లల్ని సముదాయించేద్దామిలా!

పొత్తిళ్లలోని పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఎదిగే సమయంలోనే మనల్ని క్షణం ఊపిరి తీసుకోనివ్వరు. ఏదైనా ఇవ్వకపోయినా.. వద్దని వారించినా ఏడుపూ, అలకలు. మనకేమో విసుగొచ్చేస్తుంది.

Published : 02 Dec 2023 01:38 IST

పొత్తిళ్లలోని పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఎదిగే సమయంలోనే మనల్ని క్షణం ఊపిరి తీసుకోనివ్వరు. ఏదైనా ఇవ్వకపోయినా.. వద్దని వారించినా ఏడుపూ, అలకలు. మనకేమో విసుగొచ్చేస్తుంది. అలాగని కఠినంగా ప్రవర్తిస్తే వారిపై చెడు ప్రభావం పడగలదు. కాబట్టి..

పిల్లలు ఎదిగే సమయంలో పడిపోవటం, ఏడవటం, చేతికందినవి దొర్లించటం.. వాళ్లు చేసే అల్లరి మామూలుగా ఉండదు. అంతమాత్రాన మనం కోపం, చిరాకు ప్రదర్శించకూడదు. ఎందుకంటే ఇదంతా వాళ్లు కొత్త విషయాల్ని నేర్చుకునే క్రమమే. ఆ సమయంలో మన స్పందనను బట్టే పిల్లల ప్రవర్తన కూడా మారుతుంది. గట్టిగా అరిచి చెప్పినా, కొట్టినా మొండిగా తయారవుతారు. అందుకే వీలైనంత నెమ్మదిగా, ప్రశాంతంగా ఉండాలి, మాట్లాడాలి. అప్పుడే వాళ్లూ మన మాట వింటారు. మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారు.

భావోద్వేగాలను గమనించండి..

అప్పుడప్పుడే అన్నీ నేర్చుకునే దశలో ఉన్న పిల్లలు.. వాళ్ల భావాలను సరిగా వ్యక్తీకరించలేరు. అడిగినది ఇవ్వలేదనో, నచ్చినట్టు చేయనివ్వట్లేదనో ఏడవటం, మాట వినకపోవడం మామూలే. అలాగని వారి భావోద్వేగాలను కొట్టి పారేయకూడదు. వారి చిట్టి మనసుల్లో ప్రతికూల భావాలు ఏర్పడి, మరింత మొండిగా మారే ప్రమాదం ఉంది. ఎంత అసహనమైనా రానీ.. మనం మాత్రం సానుకూలంగానే మాట్లాడాలి. అప్పుడు వాళ్లూ చెప్పింది అర్థం చేసుకుంటారు. క్రమంగా వారిలో ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ పెరుగుతుంది.

దృష్టి మరల్చండి..

ప్రతిదీ వద్దు అని చెబితే పిల్లలు చిన్నబుచ్చుకుంటారు. ఒకటి వద్దూ అన్నప్పుడు వాళ్ల దృష్టిని మరల్చడానికి ఇంకేదైనా ఇవ్వాలి. అప్పుడు నెమ్మదిస్తారు. అలాగే నిర్ణయాధికారం కూడా చిన్నప్పటి నుంచీ పెంపొందించాలి. రెండు వాళ్ల ముందుంచి ఏదో ఒకటి ఎంచుకోనిస్తే వాళ్లకీ సంతృప్తి. ఈ తీరుతో వాళ్లని వాళ్లు నియంత్రించుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఒక్కోసారి మనం అశ్రద్ధ చేసినప్పుడు వాళ్ల అసంతృప్తిని ప్రదర్శించడానికి కూడా ఇలా మొండిగా ప్రవర్తిస్తుంటారు. కోపం పెంచుకోక మనల్ని మనం పరిశీలించుకుంటే ఆ తీరునీ మార్చొచ్చు. పిల్లలు చెప్పేది వినడం, ఏదైనా ప్రయత్నిస్తే మెచ్చుకోవడం, బహుమతులివ్వడం వంటివి చేస్తే వారి ప్రవర్తనలో మొండితనానికి తావుండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్