చెడ్డ అమ్మ ఉండదు

అమ్మవ్వడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. కానీ, మాతృత్వ సెలవులు పూర్తయ్యి తిరిగి ఆఫీసుకొచ్చాక అమ్మ బాధ్యత సరిగ్గానే నిర్వర్తిస్తున్నానా అన్న సందేహం మొదలైంది.

Published : 15 Feb 2024 01:33 IST

మ్మవ్వడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. కానీ, మాతృత్వ సెలవులు పూర్తయ్యి తిరిగి ఆఫీసుకొచ్చాక అమ్మ బాధ్యత సరిగ్గానే నిర్వర్తిస్తున్నానా అన్న సందేహం మొదలైంది. కెరియర్‌ పక్కన పెట్టి పిల్లాడిని చూసుకోవాలా? కొనసాగించాలా అని చాలా ఆలోచించా. నేనసలే 39 ఏళ్ల వయసులో అమ్మనయ్యా. ఇప్పటికీ కెరియరే ముఖ్యమే అని ఆలోచిస్తున్నానా అన్న అనుమానం. అంతెందుకు బాబు పుట్టాక ఏదైనా కార్యక్రమానికి వాడు లేకుండా హాజరైతే ‘బాబుని ఎవరు చూసుకుంటారు’ అన్న ప్రశ్న ఎదురవుతుంది. చూపుల్లోనూ తేడా. అమ్మయిన సీఈఓలు ఎలా సమన్వయం చేసుకుంటున్నారా అని గూగుల్‌లో తెగ వెదికా. అప్పుడే యాహూ సీఈఓ మారిస్సా మేయర్‌ గురించి తెలిసింది. ఆమె చేయగలిగినప్పుడు నేనెందుకు చేయలేనని అనిపించాక ఇక ధైర్యంగా కొనసాగా. నిజానికి నా కెరియర్‌ తొలిరోజుల్లో గర్భస్రావం అయితే బాస్‌కి చెప్పలేదు. ఏమనుకుంటారో అని భయం. అందుకే మరుసటి రోజే ఆఫీసుకి వెళ్లా. నొప్పిని పంటి బిగువనే ఎలా భరించానో నాకు మాత్రమే తెలుసు. గర్భస్రావం, అమ్మయ్యాక కెరియర్‌, పిల్లల మధ్య సమన్వయం తేలేక మనం పడే సంఘర్షణ లాంటివి చిన్న విషయాలేం కాదు. వాటిని లోలోపలే దాచుకోకుండా ఆఫీసులో, తోటివాళ్లతో పంచుకోండి. అప్పుడే పరిష్కారం దొరుకుతుంది. ‘పేద, ధనిక, చదువుకున్న, ఉద్యోగం చేసే అమ్మలుంటారు. కానీ చెడ్డ అమ్మలు ఉండరు. జన్మనివ్వడం పునర్జన్మ ఎత్తడంతో సమానమే. అంత కష్టపడి మరో జీవికి ఊపిరి పోసిన ఏ తల్లైనా బిడ్డ చెడు కోరుకుంటుందా? ముందు నీకు నువ్వు చెడ్డ అమ్మ అనుకోవడం మానేయ్‌’ మా అమ్మ ఇచ్చిన సలహా ఇది. నేనూ అదే చెబుతున్నా... మిమ్మల్ని మీరు నిందించుకుంటూ కలల్ని పక్కన పెట్టొద్దు. ప్రత్యామ్నాయాల కోసం వెదకండి. నేను బాబుని ఆఫీసుకు తీసుకెళుతున్నా. నేను మీటింగ్‌లో ఉంటే, వాడు ఆడుకుంటూ ఉంటాడు. మీరూ అలాంటి వీలుందేమో చూసుకోవచ్చు. కాస్త ప్లానింగ్‌, మరికాస్త ఓపిక కావాలంతే!

రాధికా గుప్తా, సీఈఓ, ఎడెల్‌వీస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్