చిన్నవే... పెద్దవి కావొద్దంటే...

పిల్లల చదువులో సాయం చేయలేదని, విడిచిన దుస్తులను ఎక్కడపడితే అక్కడ పడేశారని... సుధ భర్తపై అరుస్తుంటుంది. ఆమె భర్త రమేష్‌ కూడా సుధపై చిన్న విషయాలకే కేకలేస్తాడు.

Published : 24 Feb 2024 02:23 IST

పిల్లల చదువులో సాయం చేయలేదని, విడిచిన దుస్తులను ఎక్కడపడితే అక్కడ పడేశారని... సుధ భర్తపై అరుస్తుంటుంది. ఆమె భర్త రమేష్‌ కూడా సుధపై చిన్న విషయాలకే కేకలేస్తాడు. పోనీ అక్కడితో ఆపేస్తారా అంటే అదీ ఉండదు. తిరిగి గుర్తొచ్చినప్పుడల్లా ఘర్షణ పడతారు. చిన్న కలహాలనూ భూతద్దంలో చూసే ఇలాంటి దంపతులకు నిపుణులు ఏం చెబుతున్నారంటే...

కొందరు భార్యాభర్తలు ఎదుటివారి లోపాలపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. పదే పదే వాటిని ఎత్తి చూపిస్తుంటారు. ‘నిట్‌పికింగ్‌’గా పిలిచే ఈ ధోరణి ఇద్దరి మధ్యా దూరాన్ని పెంచుతుంది. కొందరు విమర్శించడానికే పరిమితం కారు. నలుగురిలో భర్త లేదా భార్య లోపాల గురించి చెబుతూ.. అందరినీ నవ్విస్తున్నాం అనుకుంటారు. కానీ ఎదుటివారికి అది అవమానమనీ, వారిని అపహాస్యం చేస్తున్నామనీ గుర్తించరు. ఇది ఇరువురికీ అవమానమనే సత్యాన్ని గ్రహించేలోగా ఆలస్యమవుతుంది. క్రమేపీ ఒకరిపై మరొకరికి గౌరవం తగ్గుతుంది. లోపాలు ఎవరిలోనైనా సహజమే. ఎత్తిచూపడం వల్ల ప్రయోజనం ఉండదు. బదులుగా ఇలా ఉంటే బాగుంటుందన్న సూచనలు ఇవ్వండి. వారూ తీరు మార్చుకోగలుగుతారు. కలహాలూ తప్పుతాయి.

విభజించి..

ఏ కాపురంలో కలహాలు ఉండవు చెప్పండి? అలాగని భాగస్వామితో ప్రతి చిన్న విషయానికీ వాదనకు దిగితే ఇంట్లో ప్రశాంత వాతావరణం కనుమరుగవుతుంది కదా! పదే పదే వివాదాలు వస్తున్నాయి అనిపిస్తే మాట్లాడే ముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అదెంత వరకూ సమంజసం, నిజంగా పట్టించుకోవాల్సిన విషయమేనా అని ఒక్కసారి ఆలోచిస్తే చాలు. తగవులకు ఆస్కారం ఉండదు. ఎంత ప్రయత్నించినా అడపాదడపా ఏదోక సమస్య వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు ఎవరిది పొరపాటు అని చర్చించడం మాని, పరిష్కారమార్గం కోసం ప్రయత్నించండి. మనస్పర్థలన్నీ దూదిపింజల్లా దూరమవుతాయంటే నమ్మండి. అంతేకాదు, ఇరువురి మధ్యా అనుబంధం కూడా పెరుగుతుంది.

నియంత్రణ..

చాలాసార్లు సమస్య చిన్నదే! కోపంలో అన్న మాటలే ఎక్కువ ప్రభావం చూపుతాయి. కాబట్టి, భావోద్వేగాలపై నియంత్రణ సాధించండి. సంసారంలో సగం సమస్యలకు చెక్‌ చెప్పొచ్చు. కోపం రాగానే దించేసుకోవాలన్న తొందరొద్దు. కాసేపు ఆలోచించండి. నిజంగానే పొరపాటా? మనసులో పేరుకున్న నిరాశ, నిస్పృహలు ఇలా కోపంగా బయటికొస్తున్నాయా అన్నది ఆలోచించుకుంటే చాలు. పరిష్కారం అదే దొరుకుతుంది. లేదూ అలా ఆలోచించడం సాధ్యం కావట్లేదా... కోపం వచ్చినప్పుడు అక్కడి నుంచి కాసేపు దూరంగా వెళ్లండి. సమస్య పలుచనవుతుంది. దాన్ని చూసే కోణం కూడా మారుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్