సరికొత్తగా మళ్లీ ప్రారంభించండి

పెళ్లయిన తొలి ఏడాది... సినిమాలు, షికార్లు, ఊసులు పంచుకోవడం అంటూ చాలా ఉంటాయి. తర్వాత? పెరిగిన బాధ్యతలతో పెద్దరికం, ‘ఈ సరదాలన్నీ మనకు కాదులే’ అన్న భావన వచ్చేస్తాయి.

Published : 29 Feb 2024 01:57 IST

పెళ్లయిన తొలి ఏడాది... సినిమాలు, షికార్లు, ఊసులు పంచుకోవడం అంటూ చాలా ఉంటాయి. తర్వాత? పెరిగిన బాధ్యతలతో పెద్దరికం, ‘ఈ సరదాలన్నీ మనకు కాదులే’ అన్న భావన వచ్చేస్తాయి. అందుకే జీవితం స్తబ్దుగా తోస్తుంది. అలాకాకుండా కొన్ని తీర్మానాలను చేసుకోండి. సరికొత్త ప్రయాణం ప్రారంభించండి.

  • ‘సినిమాకు వెళదామా?... పిల్లలకు పరీక్షలు’, ‘సరదాగా ఇద్దరం టూరుకి వెళదామా... ఎలాగూ యానివర్సరీ దగ్గర్లోనే ఉంది. అప్పుడు అందరం వెళ్లొచ్చు. ఖర్చూ కలిసొస్తుంది’... పిల్లలు జీవితంలోకి వచ్చాక ‘ఇద్దరి సమయం’ అన్నదానికి ప్రాముఖ్యం ఇవ్వడమే మర్చిపోతాం కదూ! అది అలవాటుగా మారి ఒకరిపై మరొకరికి ప్రేమే లేదన్న అభిప్రాయానికి వచ్చేస్తారు. పనులన్నీ ఎప్పుడూ ఉండేవే! అడపాదడపా చిన్న ‘డేటింగ్‌’ ప్లాన్‌ చేయండి. బంధంలోనే కాదు మనసుకీ కొత్త ఉత్సాహం వస్తుంది.
  • తొలిరోజులను గుర్తు చేసుకోండి. ఎన్ని మరపురాని జ్ఞాపకాలు జ్ఞప్తికొస్తాయో! తొలిసారి చూసిన క్షణం, చిలిపి తగాదాలు, పంచుకున్న ఊసులూ తిరిగి మననం చేసుకోండి. అప్పటి ఆకర్షణ గుర్తుకు రావడమే కాదు, ఇప్పుడేం మిస్‌ అవుతున్నామో అర్థం అవుతుంది.
  • ‘పిల్లలున్నారు’ అంటూ కలిసి కూర్చోవడానికీ ఆలోచిస్తారు. పిల్లలు నేర్చుకునేది మనల్ని చూసే! మనం యాంత్రికంగా సాగితే వాళ్లూ అలాగే తయారవుతారు. కలిసి కబుర్లు చెప్పుకోవడం, చేతులు పట్టుకోవడం, అడపాదడపా హగ్‌... ఇంట్లో ప్రేమ వాతావరణాన్ని సృష్టిస్తాయి. అన్నీ పంచుకోవడం, బాధలో ఓదార్పు కోరుకోవడం వంటివి వారికి అలవాటు చేసినట్లూ అవుతుంది.
  • ‘పెళ్లైన కొత్తలో మావారు ఓ చీర తెచ్చారు, ఫలానాది వండిపెట్టారు... ఇది మా ఆవిడ నాకిచ్చిన తొలి గిఫ్ట్‌’ అంటూ ఏళ్లు గడిచినా ఎంత మురిపెంగా చెప్పుకొంటాం? ఖరీదైన బహుమతులే ప్రేమను చాటవు. చిన్న ప్రయత్నం కూడా చాలు. ఉదయాన్నే ‘టీ టైమ్‌’ అనో, రోజూ ఒకపూటైనా కలిసి తినేలా ‘డిన్నర్‌ టైమ్‌’ లాంటివి ప్లాన్‌ చేసుకోవచ్చు. వంట, ఇంటి పనులను అడపాదడపా పంచుకోవడం వంటివీ ప్రేమను చూపే మార్గాలే. ఏళ్లు గడిచేకొద్దీ బాధ్యతలు పెరుగుతాయంతే! ప్రేమను కోరుకోవడానికీ, ఆస్వాదించడానికీ వయసు అడ్డంకి కాదు. కాబట్టి, మీదైన ప్రేమ ప్రయాణాన్ని సరికొత్తగా ఆస్వాదించండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్