నో చెప్పండిలా!

స్నేహితురాలు ఫోన్‌ చేసి అసైన్‌మెంట్స్‌ రాస్తావా అని అడిగితే బోలెడు పని ఉన్నా.. ఓకే అనేస్తాం. ఆఫీస్‌లో చేయాల్సిన దాని కంటే అదనపు పని ఇస్తే.. నా వల్ల కాదు అని చెప్పలేం. వీకెండేగా షికారుకెళదాం అని రూమ్మేట్‌ అడిగితే.. ఇష్టం లేకపోయినా కాదు అనలేం.. కదూ!

Published : 27 Mar 2024 01:14 IST

స్నేహితురాలు ఫోన్‌ చేసి అసైన్‌మెంట్స్‌ రాస్తావా అని అడిగితే బోలెడు పని ఉన్నా.. ఓకే అనేస్తాం. ఆఫీస్‌లో చేయాల్సిన దాని కంటే అదనపు పని ఇస్తే.. నా వల్ల కాదు అని చెప్పలేం. వీకెండేగా షికారుకెళదాం అని రూమ్మేట్‌ అడిగితే.. ఇష్టం లేకపోయినా కాదు అనలేం.. కదూ!

సహాయం చేయడం మంచి లక్షణమే. కానీ అది మితిమీరితే..! ఎదుటివారిని నొప్పించడం ఇష్టం లేకనో.. ఏమనుకుంటారో అనే భయం వల్లనో, ఎలా రియాక్ట్‌ అవుతారనో.. ఇలా వందల ప్రశ్నలు మొదలవుతాయి. చేసేదేమీలేక అన్నింటికీ ఓకే అనేస్తుంటాం. ఆఖరికి ఎందుకు ఒప్పుకొన్నానా అని మన మీదే నిందేసుకుంటాం. కొన్నిసార్లు అయితే పర్లేదు. మరీ ఎక్కువైతేనే మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు..

మరేం చేయాలి..

  • నో చెప్పాల్సి వచ్చిన ప్రతిసారీ ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఏం మాట్లాడాలి.. ఎలా చేయలేనని చెప్పాలి అని విపరీతంగా ఆలోచనలు మొదలవుతాయి. దానివల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండండి. మీరు చేయలేను అని చెప్పినంత మాత్రాన వారి దృష్టిలో చెడ్డవారేమీ అయిపోరు.
  • మీకు మీరు మొదటి ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. ఎదుటివారు అడిగింది చేయలేను అనుకున్నప్పుడు నా వల్ల కాదు అని చెప్పేయండి. మీ కోసం మీరు కేటాయించుకునే సమయమే చాలా ముఖ్యం.
  • మీరు ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారో క్లుప్తంగా చెప్పండి. ఏదో తప్పు చేసేస్తున్నా అనే భావనతో వారికి వివరణలు ఇవ్వాల్సిన పని లేదు. ఏదైనా చెప్పేటప్పుడు కచ్చితంగా చెప్పండి.. మీ అభిప్రాయాలు, ఆలోచనలు, భావాలను వ్యక్తపరిచేటప్పుడు తడబడొద్దు.
  • కొన్ని పరిమితులు పెట్టుకుని దానికి కట్టుబడి ఉండండి. వాళ్లు నొచ్చుకుంటారు అని మనల్ని మనం త్యాగం చేసుకోవద్దు. మీ అసౌకర్యాన్ని వారికి స్పష్టంగా చెప్పండి. కచ్చితంగా అర్థం చేసుకుంటారు. సామరస్యంగా మాట్లాడటం వల్ల మీకూ, మీ బంధానికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
  • ఆ పని మీ విలువలని దెబ్బతీసేదిగా ఉంటే అస్సలే ఒప్పుకోవద్దు. నిర్మొహమాటంగా కుదరదు అని చెప్పండి. తరవాత వాళ్లు ఏమనుకున్నారో అన్న ఆందోళన కచ్చితంగా ఉంటుంది.. దానికోసం కాసేపు పుస్తకాలు చదవడం, తోట పని, ప్రకృతిలో సేద తీరడం వంటివి చేయండి.. ఆ ఆందోళనా దూరం అవుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్