దాంపత్యానికి నాలుగు స్తంభాలు..!

ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగులు పెడుతుంటాం. ఈ ప్రేమ దీర్ఘకాలం కొనసాగాలంటే దంపతులు ఇరువురూ పదేపదే ప్రేమలో పడాలంటున్నాయి అధ్యయనాలు.

Published : 30 Mar 2024 01:37 IST

ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగులు పెడుతుంటాం. ఈ ప్రేమ దీర్ఘకాలం కొనసాగాలంటే దంపతులు ఇరువురూ పదేపదే ప్రేమలో పడాలంటున్నాయి అధ్యయనాలు. ప్రేమ ఉంది కదా అందుకే కదా కలిసి ఉంటున్నాం అనుకుంటున్నారా? కానీ బంధం బలపడాలంటే ఇద్దరి మధ్యా ప్రేమ మూలస్తంభంగా ఉండాలంటున్నారు నిపుణులు.

కమ్యూనికేషన్‌.. భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్‌ ప్రాణవాయువు లాంటిది. ఇది లేకుండా జీవించడం ఎంత కష్టమో, దాంపత్యంలో భావవ్యక్తీకరణ లేకపోతే బంధం బీటలు వారుతుంది. ఇలా కాకూడదంటే భాగస్వామి ఆలోచనలనూ, భావాలనూ స్వేచ్ఛగా వ్యక్తపరిచేలా మనం మసలుకోవాలి. ‘మా వారంటే నాకు చాలా ఇష్టం, గౌరవం’ ఉందంటే సరిపోదు. ఎప్పుడైనా ఆయనతో చెప్పారా! బంధంలో ఏ విషయాన్ని అయినా స్వేచ్ఛగా పంచుకున్నప్పుడు మాత్రమే దాంపత్య జీవితం కలకాలం సాఫీగా సాగుతుంది. అంతేకాదు ఈరోజు వంట బాగుందనో, లేక ఎందుకు అలసటగా కనిపిస్తున్నావ్‌ ఏమైంది. అనే చిన్న పలకరింపు’ ఆమెకెంతో ఊరటనిస్తుంది.

తగ్గిచూడండి.. ఆలుమగలన్నాక చిన్నాచితకా గొడవలు రావడం సహజమే. ఆ సమయంలో ఎవరో ఒకరు మౌనం పాటిస్తే గొడవలు తగ్గుతాయి. అంత మాత్రం చేత మీరు తప్పు చేసినట్లు కాదు. ఇలా చేయడం వల్ల గొడవ తీవ్రత తగ్గుతుంది. దీనివల్ల ఇద్దరి మధ్యా దూరం పెరగదు. కోపం తగ్గాక ‘మీరు ఆవేశంలో ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు’, ‘మాట్లాడే తీరు మార్చుకో’మని సున్నితంగా చెప్పాలి. ఈ సూత్రం దంపతులు ఇద్దరికీ వర్తిస్తుంది మరి.

రాజీపడటం.. ఎంత ప్రేమిస్తే ఏం ప్రయోజనం... రాజీపడే మనస్తత్వం లేకపోతే అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. బంధంలో ముందుకు సాగాలంటే సానుభూతి, అవగాహన, క్షమాపణలు చెప్పడం... అలవరుచుకోవాలి. ప్రస్తుత కాలంలో ఎక్కువ యువజంటలు ఈ కారణాల వల్లే విడాకుల వరకు వెళుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ‘క్షమాపణ లేని చోట ప్రేమ నిలవదు’ అంటున్నారు నిపుణులు.

సమన్వయం.. దాంపత్యంలో వృత్తిగత, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోగలిగితేనే మూడుపువ్వులూ ఆరు కాయలుగా కొనసాగుతుంది. ఆఫీసూ, ఇంటి పనులకు పరిమితులు గీసుకోవాలి. ఆఫీసువేళల్లో ఇంటిపనినీ, ఇంటిదగ్గర ఆఫీసు పనులను చేయకూడదు. ఇలా చేయడం వల్ల కుటుంబంతో గడిపే నాణ్యమైన సమయం దెబ్బతింటుంది. ఈ నాలుగు సూత్రాలను భాగస్వాములు ఇరువురూ అనుసరించినపుడు బంధం మరింత బలంగా బలపడుతుంది. ఇక అపార్థాలకు తావుండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్