ప్రేమ వంట చేద్దామా?

ఐశ్వర్య, పవన్‌కు సమయం దొరికినప్పుడు బయటికెళ్లి భోజనం చేసొస్తుంటారు. పొరుగునే ఉన్న రామ్‌, సౌమ్య దంపతులు మాత్రం వీకెండ్‌ వచ్చిందంటే చాలు, కలిసి వండుకోవడానికే ఇష్టపడతారు. ఇలా దంపతులు కలిసి వంట చేస్తే.. అది ప్రేమ వంట అవుతుంది. ఒకరికొకరు సాయం చేసుకుంటూ తయారుచేసే ఆహారానికి రుచి కూడా రెట్టింపు అవుతుందట.

Published : 01 Apr 2024 01:33 IST

ఐశ్వర్య, పవన్‌కు సమయం దొరికినప్పుడు బయటికెళ్లి భోజనం చేసొస్తుంటారు. పొరుగునే ఉన్న రామ్‌, సౌమ్య దంపతులు మాత్రం వీకెండ్‌ వచ్చిందంటే చాలు, కలిసి వండుకోవడానికే ఇష్టపడతారు. ఇలా దంపతులు కలిసి వంట చేస్తే.. అది ప్రేమ వంట అవుతుంది. ఒకరికొకరు సాయం చేసుకుంటూ తయారుచేసే ఆహారానికి రుచి కూడా రెట్టింపు అవుతుందట. భార్యాభర్తల మధ్య బంధాన్ని మరింత బలపడేలా కూడా చేస్తుందట. మరి మీరూ ప్రయత్నిస్తారా.

థెరపీలాంటిది...

కలిసి వంట చేయడంవల్ల ఫలితాలెన్నో ఉన్నాయి. ఇద్దరూ కలిసి తమకిష్టమైన వారి కోసం నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఇదొక మార్గం. ఎంత బిజీగా ఉన్నా ఆ పనులన్నీ పక్కన పెట్టి ఒకరిపై మరొకరు దృష్టి పెట్టడానికి దొరికే అపూర్వ అవకాశం కూడా. ఒకరికొకరు సహకరిస్తూ ఎదుటివారి ఆలోచనను పసిగడుతూ... వంటకు కావాల్సిన వస్తువులను అందించాలి. మానసికంగా ఇరువురూ ఒక్కటే అన్నట్లుగా ప్రతి పనినీ ముగించాలి. భార్యాభర్తలిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ.. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ చేసే ఈ వంట సమయం ఇద్దరికీ ఒక థెరపీలాంటిది అంటున్నారు నిపుణులు.

అదనంగా...

మనసుకు నచ్చిన వ్యక్తి అభిరుచికి పెద్దపీట వేసి ఒకరు వంటింట్లోకి అడుగుపెడితే, అవతలివారికిష్టమైన వంటకాన్ని వండి తినిపించాలనే ఆలోచనతో మరొకరు వంట చేయడానికి సిద్ధపడాలి. పైకి చెప్పకపోయినా...భార్యాభర్తలిద్దరికీ ఎదుటివారి మనసు అర్థమవుతుంది. తమ కోసం ఒకరున్నారనే భావనను కలిగిస్తుంది. ఎవరికివారు తమ కోసం కాకుండా భాగస్వామి కోసం చేస్తున్నామని పైకి చెప్పకపోయినా అవతలివారి మనసు అది చదవగలదు. ఇదీ ఒక రకమైన ప్రేమభాషే. ఎదుటివారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉంటే ఒకరిపై మరొకరికి గౌరవభావం పెరుగుతుంది. సంతోషంగా, సరదాగా చేసే ఆ వంటకు అదనపు రుచీ... వస్తుంది.

మార్గమిది..

కలిసి వంట చేయడమంటే ఎదుటివారిపై ప్రేమను చూపించగలిగే సున్నితమైన మార్గంలాంటిదే. ఇరు మనసులూ ఊసులాడుకుంటూ... ఒకే పనిని ఏకాగ్రతగా, ఎదుటివారితో కలిసి మెలిసి వంట చేయడంవల్ల వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. వంట పూర్తి చేసి దాన్ని భాగస్వామికి కానుకగా అందించి, ఆ రుచిని ఇరువురూ కలిసి పంచుకుంటే చాలు. ఆ అనుభూతిని చెప్పడానికి అక్షరాలు దొరకవు. ఒకరినొకరు పొగడటం, కృతజ్ఞతలు చెప్పుకోవడంవంటివన్నీ భార్యాభర్తలిద్దరినీ మరింత దగ్గర చేస్తాయి. ఈ సమయాన్ని ఓ మధురమైన జ్ఞాపకంగా హృదయాల్లో పదిలపరుచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్