కవలలు... మార్కులూ ఒకేలా!

కవలలు... పరిచయం అక్కర్లేని పదమే. అయినా... ఇద్దరూ అలా కలిసి వెళ్తోంటే అబ్బురంగా చూస్తాం. తెలియకుండానే వారి కదలికలను గమనిస్తుంటాం.

Published : 14 Apr 2024 02:12 IST

కవలలు... పరిచయం అక్కర్లేని పదమే. అయినా... ఇద్దరూ అలా కలిసి వెళ్తోంటే అబ్బురంగా చూస్తాం. తెలియకుండానే వారి కదలికలను గమనిస్తుంటాం. అయితే ఈ అక్కాచెల్లెళ్లు మరింత ప్రత్యేకం! చేసే ప్రతి పనితోనే కాదు... చదువుతోనూ అందరినీ ఆశ్చర్యపరిచారు. అదెలాగంటే...

చుక్కీ, ఇబ్బనీలది కర్ణాటకలోని హస్సన్‌. రెండు నిమిషాల తేడాతో పుట్టిన ఈ అక్కాచెల్లెళ్లు ఏం చేసినా కలిసే చేస్తారు. తాజా పీయూసీ (12వ తరగతి) పరీక్షల్లో ఒకే మార్కులు (600కి 571) తెచ్చుకున్నారు. ‘ఇద్దరం కలిసే చదువుతాం. ఒకరికొకరం సాయం చేసుకుంటాం. అయితే మా మధ్య పోటీ మాత్రం ఉండదు. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులొచ్చినా మరొకరం సంతోషిస్తామే తప్ప బాధపడం. నిజానికి 97 శాతం మార్కులు సాధిస్తామనుకున్నాం. శాతం తగ్గిందని కాస్త బాధపడినా... ఇద్దరం ఒకేలా మార్కులు తెచ్చుకోవడం ఆశ్చర్యం కలిగించింది. నిజానికి ఇది మేం ఊహించలేదు మరి. అందరూ ఆశ్చర్యపోతుంటే సంతోషంగా ఉంది’ అంటున్నారీ అక్కాచెల్లెళ్లు. వీళ్లు పదో తరగతిలోనూ ఒకేలా 620 (625కి) తెచ్చుకోవడం అందరినీ చకితుల్ని చేసింది. అన్నట్టూ వీళ్ల అభిరుచులూ ఒకటే. సంగీతం, నృత్యం, ఆడే ఆటల్లోనూ మార్పు లేదట. కొట్టుకోవడం, తిట్టుకోవడం లాంటివీ ఎరుగరట. ప్రస్తుతం నీట్‌కి సిద్ధమవుతోందీ ద్వయం. ఆ తరవాతా  ఇద్దరం కలిసే చదువుతాం అంటున్నారు.

వీళ్లేకాదు... గతంలో విజయవాడకు చెందిన స్వప్న, స్వాతి పదో తరగతిలో 600కి 578 మార్కులు సాధించారు. నోయిడాకి చెందిన మాన్సీ, మాన్యా ఐడెంటికల్‌ ట్విన్స్‌. వీళ్లూ పన్నెండో తరగతిలో 95.8 శాతం మార్కులు సాధించారు. అంతేకాదు, ప్రతి సబ్జెక్టులోనూ ఒకేలా మార్కులు తెచ్చుకోవడం విశేషం. ఇలాంటివాళ్లు ఇంకా ఉన్నారు. ఒకేలా కనిపించే కవలలు... ఇలా ఒకే మార్కులు సాధించడం కాస్త ఆశ్చర్యమే కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్