సేవకు.. వారసురాలు

ఎనిమిదేళ్లు.. అమ్మ ప్రేమను ఆస్వాదించే వయసు. కానీ తనేమో.. ఆ ప్రేమంతా వాళ్లమ్మ వేరే వాళ్లకు పంచడం చూస్తూ పెరిగింది. మొదట బాధపడినా.. తర్వాత అమ్మ ఆంతర్యం అర్థమైంది. అప్పట్నుంచి ఆమెకు సాయం చేయడమే కాదు.. తనూ ప్రేమను పంచుతోంది.  అమ్మ నుంచి సేవా వారసత్వాన్ని ఎలా అందుకుందో లహరి వసుంధరతో పంచుకుందిలా...

Updated : 12 May 2022 03:28 IST

ఎనిమిదేళ్లు.. అమ్మ ప్రేమను ఆస్వాదించే వయసు. కానీ తనేమో.. ఆ ప్రేమంతా వాళ్లమ్మ వేరే వాళ్లకు పంచడం చూస్తూ పెరిగింది. మొదట బాధపడినా.. తర్వాత అమ్మ ఆంతర్యం అర్థమైంది. అప్పట్నుంచి ఆమెకు సాయం చేయడమే కాదు.. తనూ ప్రేమను పంచుతోంది.  అమ్మ నుంచి సేవా వారసత్వాన్ని ఎలా అందుకుందో లహరి వసుంధరతో పంచుకుందిలా...

మాది కడప జిల్లా పోరుమామిళ్ల. నాకు అయిదేళ్లున్నప్పుడు నాన్న రమణ చనిపోయారు. అమ్మ రాధిక బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వచ్చి వృద్ధాశ్రమంలో సహాయకురాలిగా చేరింది. ఓరోజు బస్టాండ్‌లో ముసలావిడని చూసింది. సుస్తీ చేసినట్లుగా కనిపించేసరికి దగ్గరకెళ్లింది. మూడ్రోజులుగా అక్కడే ఉందట.. వివరాలడిగితే అయినవాళ్లే వదిలేసి వెళ్లారని కన్నీళ్లు పెట్టుకుంది.  అమ్మకు జాలేసి తనను వెంటబెట్టుకొని తను పనిచేసే వృద్ధాశ్రమానికి తీసుకెళ్లింది. అది ఉచిత సేవా సంస్థ కాదు. దీంతో వాళ్లు ఉండనివ్వమన్నారు. తనకు ఒంట్లో బాగోలేదనీ, కొద్దిరోజులైనా ఉండనిమ్మని అమ్మ బతిమాలింది. ‘చనిపోతే బాధ్యులెవర’ంటూ నిర్దాక్షిణ్యంగా మాట్లాడి.. అమ్మనీ పనిలోంచి తీసేశారు. ఆవిడని తీసుకొని అమ్మ ఇంటికొచ్చింది. ‘తనకో ఆసరా చూపిస్తానని తీసుకొచ్చా. నన్ను నమ్మి వచ్చిన తనని వదిలేయలేన’ంది. మాతోపాటే ఆ ముసలావిడా ఉండేది. అలా ఒక్కొక్కరూ చేరుతూ వచ్చారు.

మొదట్లో తనే చిన్నాచితకా పనులు చేస్తూ అందర్నీ పోషించేది. కష్టమయ్యే కొద్దీ వృద్ధాశ్రమమే నడుపుదామనుకుంది. ప్రతి ఇద్దరు డబ్బులు కట్టేవాళ్లకి ఒకరిని ఉచితంగా తీసుకోవాలన్నది అమ్మ ఆలోచన. కానీ వాళ్ల బాధలు చెప్పగానే తనూ ఏడ్చేసి ఉచితంగానే చేర్చుకునేది. ఇదంతా గమనిస్తున్న ఒక కాంట్రాక్టర్‌ ‘వీళ్లందర్నీ చేర్చుకొని ఏం చేస్తున్నావ్‌? నీకేం లాభ’మని అడిగారు. సేవ చేస్తున్నానంటే ఆయన నమ్మలేదు. నేరుగా వాళ్లతోనే మాట్లాడాక నెలకు సరిపడా నిత్యావసరాలు కొనిచ్చి వెళ్లారు. ప్రతి నెలా సాయమందిస్తూ వచ్చారు. అలా చుట్టుపక్కల తెలిసిన వాళ్లు ఎవరో ఒకరు సాయం చేస్తూ వచ్చారు. ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు ముసలివాళ్లు చనిపోతే.. వెంటనే ఇల్లు ఖాళీ చేయించేవాళ్లు. వాళ్లను తీసుకొని ఎన్ని ఇళ్లు మారుంటామో! చాలామంది నడవలేరు కూడా. కొందరు అద్దెకి ఇవ్వడానికే ఒప్పుకొనేవారు కాదు. దీంతో ఊళ్లో ఉన్న కొద్ది పొలాన్ని అమ్మి, చౌదరి గూడ, మేడ్చల్‌లో ‘లహరి హోమ్‌’ కట్టించింది. ఇదీ దశలవారీగా పూర్తిచేసిందే. కొందరు తాము కట్టుకోగా మిగిలిపోయిన కిటికీలు, నిర్మాణ సామగ్రి ఇచ్చారు. మా దగ్గర ప్రస్తుతం 30 మంది ఆశ్రయం పొందుతున్నారు.

అమ్మ ఇది ప్రారంభించేనాటికి నాకు ఎనిమిదేళ్లే. ఎక్కువ సమయం  వాళ్లతోనే ఉంటోంటే నేనంటే ఇష్టం లేదనుకునేదాన్ని. వాళ్ల పరిస్థితి అర్థమయ్యాక నేనూ సాయపడటం మొదలుపెట్టా. అన్నం తినిపించడం, స్నానం చేయించడం వంటివన్నీ చేస్తా. ఇక్కడ ఉన్నవారంతా పిల్లల్ని ప్రయోజకులను చేసి నిలవ నీడ లేకుండా చేసుకున్నవారే. మతి స్థిమితం లేక బస్‌స్టాండుల్లో, వీధుల్లో తిరుగుతున్న వారినీ చేర్చుకుంటాం. అప్పుడప్పుడు పోలీసులూ కొంతమందిని వదిలెళుతుంటారు. చిరునామా దొరికితే సరే.. లేదంటే మా దగ్గరే ఉండిపోతారు. ఇప్పటికి లహరి హోమ్‌ ప్రారంభించి పదేళ్లు. నెలవారీగా ఇచ్చేవాళ్లు, పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలకు ఆహారం, డబ్బులు పంపిణీ చేసేవారితో నడుపుతూ వచ్చాం. కానీ కొవిడ్‌ సమయంలో పరిస్థితి తారుమారైంది. సాయం చేసేవారు లేక ఆశ్రమం నడపలేని పరిస్థితి. అప్పుడొక ఫౌండేషన్‌ వాళ్లు మాకు ఆహారాన్ని పంపిణీ చేసే పనిచ్చారు. వాళ్లు చెప్పిన ప్రాంతాల్లో ఆహారం ప్యాక్‌ చేసుకొని ఇచ్చేవాళ్లం. ఇప్పుడు పరిస్థితి తిరిగి మెరుగుపడింది. కొన్ని ఆవులు, గేదెల్ని ఏర్పాటు చేసుకున్నాం. కావాల్సినన్ని పాలు ఉంచుకొని మిగతావి అమ్ముతున్నాం. ఆశ్రమం గురించి యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో సమాచారం పెడుతుంటా. వాటిని చూసి స్పందిస్తున్నారు. ప్రత్యేకంగా పనివాళ్లు ఎవరూ లేరు. నేను, అమ్మ.. ఇంకా మా ఇద్దరు మామయ్యలు, అత్తయ్యలు రోజూ కొద్దిసేపు పనుల్లో సాయం చేస్తారు. నాకు 18 ఏళ్లు. బీఎస్‌సీ నర్సింగ్‌ మొదటి ఏడాది చదువుతున్నా. అత్యవసర సమయాల్లో వైద్య సాయం అందివ్వొచ్చని దీన్ని ఎంచుకున్నా. అమ్మకు సాయంగా ఇదంతా చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. తనకు ఎంతో సంతృప్తినిచ్చే ఈ సేవల్ని కొనసాగించడమే నా లక్ష్యం.

- టి. శారద, ఈనాడు జర్నలిజం స్కూల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్