కన్నతల్లే..అమ్మేసింది!

కన్నతల్లి అంత ఘోరం చేస్తుందని ఎవరూ ఊహించరు. చెప్పినా నమ్మరు. కానీ ఆ అమ్మాయి అమ్మ వల్లే చిత్రవధను అనుభవించింది. బడికి పంపాల్సిన చిన్నారిని వ్యభిచార కూపంలోకి నెట్టిందా దుర్మార్గురాలు. నాలుగేళ్ల నరకం తర్వాత అందులోంచి బయటపడిందా అమ్మాయి. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో

Updated : 13 Jun 2022 07:17 IST

కన్నతల్లి అంత ఘోరం చేస్తుందని ఎవరూ ఊహించరు. చెప్పినా నమ్మరు. కానీ ఆ అమ్మాయి అమ్మ వల్లే చిత్రవధను అనుభవించింది. బడికి పంపాల్సిన చిన్నారిని వ్యభిచార కూపంలోకి నెట్టిందా దుర్మార్గురాలు. నాలుగేళ్ల నరకం తర్వాత అందులోంచి బయటపడిందా అమ్మాయి. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో భారత్‌లో అడుగుపెట్టింది. గతం చేసిన గాయాలను మాన్పుకుంటూ చదివింది... చదువుతూనే ఉంది. ఇప్పుడు మరింత పెద్ద చదువు కోసం లండన్‌కు వెళ్లింది. తన కొచ్చిన కష్టాలు అఫ్గాన్‌లో మరే ఆడపిల్లకూ రాకుండా చూస్తానంటోన్న ఆ అమ్మాయి.. లైలా రాసెఖ్‌. స్ఫూర్తికే స్ఫూర్తినిచ్చే తన కథేంటంటే...

ఫ్గానిస్తాన్‌లోని కాబుల్‌.. లైలా సొంతూరు. చిన్నతనంలోనే అత్యంత భయానక జీవితాన్ని గడిపింది. తన కుటుంబమే తనకు శత్రువుగా మారింది. డబ్బు కోసం ఏడేళ్ల పసిమొగ్గను వ్యభిచార ముఠాకి అప్పగించిందా తల్లి. దీంతో యూనిఫామ్‌ వేసుకుని బడికి వెళ్లి చదువుకోవాలి, నేస్తాలతో ఆడుకోవాలన్న ఆమె కలలన్నీ కన్నీళ్లతోపాటు ఇంకిపోయాయి. కనీసం పుస్తకం, పెన్సిల్‌ ఇచ్చే వాళ్లూ లేరు. అమ్మ, అన్న, మారుతండ్రే ఆమెను నరకకూపంలోకి తోసేస్తే ఇక దిక్కెవరుంటారు. మాట వినకపోతే కొట్టి కొట్టి ఒళ్లు పుండు చేసేవారు. విటులిచ్చే డబ్బులు ఇంట్లో ఇచ్చేది లైలా. అలా చేయని రోజు నరకం చూడాల్సిందే. ఇంత ఘోరం జరుగుతున్నా ఇరుగు పొరుగు కూడా పట్టించుకోలేదు. ఆమె మొరాలంకించిన దేవుళ్లూ లేరు. అలా ఆ నరకకూపంలో నాలుగైదేళ్లు గడిచాయి.

నవ్వడం అదే తొలిసారి

తన జీవితం ఇక ఇంతే అనుకుంది లైలా. మగవాళ్లను చూస్తేనే ఒళ్లు జలదరించేదామెకు. అమ్మ, అన్న, మారుతండ్రి.. వీళ్ల గొంతు వింటే హడలిపోయేది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె జీవితం అనుకోని మలుపుతిరిగింది. 2013లో ఆమె తల్లిని అరెస్టుచేసి జైలుకు పంపారు పోలీసులు. వారి సమాచారంతో వుమెన్‌ ఫర్‌ అఫ్గాన్‌ వుమెన్‌ (డబ్ల్యూఏడబ్ల్యూ) సంస్థ ప్రతినిధులు లైలాను ఆదుకున్నారు. బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచారు. కౌన్సెలర్లు ఎన్నో నెలలు కష్టపడితే కానీ ఆమె మామూలుస్థితికి రాలేదు. తేరుకున్నాక బడికెళ్లి చదువుకుంటానని వారితో చెప్పింది. తన ఆసక్తిని చూసి అందుకు ఏర్పాట్లు చేశారు. యూనిఫామ్‌ వేసుకుని, భుజాన బ్యాగ్‌ తగిలించుకుని బడికి వెళ్లడం మొదలుపెట్టింది. తన బాల్యం తనకు వచ్చిందని సంతోషపడింది. జంకులేకుండా మాట్లాడటం నేర్చుకుంది. మొదటిసారి మనసారా నవ్విందీ అప్పుడే. తన జీవితం గాడిలో పడ్డట్టే అనుకుంది. కానీ అంతలోనే మరో కష్టం ఎదురైంది.

కొడైక్కనాల్‌ మార్చేసింది

లైలా తొమ్మిదో తరగతి చదువుతుండగా...  వాళ్ల అమ్మ జైలునుంచి బయటికొచ్చింది. తను ఉన్నచోటు కనిపెట్టి లైలాను తనతో రమ్మంది. ‘నాతో రాకపోయినా.. స్కూల్‌కి బయటకు వస్తావుగా అప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తా’ అని బెదిరించి మరీ వెళ్లింది. ఆ క్షణం నుంచీ మళ్లీ లైలాకు కంటిమీద కునుకులేదు. బయటకు వెళ్తే ప్రమాదమని కొన్నాళ్లపాటు బడికి కూడా వెళ్లలేదు. ఆ సమయంలో డబ్ల్యూఏడబ్ల్యూ ప్రతినిధులు ఆమెను దేశం నుంచే బయటకు పంపితే మంచిదని భావించారు. ఆ సంస్థ ప్రతినిధికి చెన్నైకి చెందిన నిత్యానంద్‌ జయరామన్‌తో పరిచయం ఉంది. ఆవిడ లైలా దీనగాథ విని చలించిపోయింది. ఇండియాలో లైలాకు సంరక్షకురాలిగా ఉండేందుకు అంగీకరించింది. ఇక అన్నీ చకచకా జరిగిపోయాయి. లైలాను తమిళనాడులోని ‘కొడైక్కనాల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌’లో చేర్పించారు. ఇక్కడికి వచ్చాక ఆమె భయాందోళనలు పోయాయి. తోటి బాలలతో జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టింది. తనకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌ కూడా వచ్చింది. ఆంగ్లం అర్థం చేసుకోవడమే కష్టమైన లైలా.. క్రమంగా అనర్గళంగా మాట్లాడే స్థాయికి ఎదిగింది. దిల్లీలోని అశోక యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసింది. ఆపైన మహిళలపై జరుగుతోన్న అరాచకాలపైన గొంతెత్తాలని చెన్నైలోని ‘ఏషియన్‌ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం’లో పీజీ డిప్లొమా చేసింది. తన లక్ష్యానికి మరో అడుగు అవసరమని భావించి లండన్‌లోని స్కూల్‌ ఆఫ్‌ ఆఫ్రికన్‌ అండ్‌ ఓరియంటల్‌ స్టడీస్‌ (ఎస్‌వోఏఎస్‌)లో ఇంటర్నేషనల్‌ పాలిటిక్స్‌లో పీజీ చేయాలనుకుంది. ఆ ప్రతిష్ఠాత్మక సంస్థలో సీటొచ్చిందిగానీ... రూ.20లక్షలకు పైగా ఖర్చవుతుందని తెలిసి సందిగ్ధంలో పడింది. కానీ తన లక్ష్యం సాధించకుండా మళ్లీ కాబుల్‌ వెళ్తే... అక్కడి సమాజంలో నిలదొక్కుకోలేననుకుంది. అప్పుడు ఆమెలో మెదిలిన ఆలోచన.. ‘క్రౌడ్‌ ఫండింగ్‌’. మిలాప్‌ అనే ఎన్జీవో వెబ్‌సైట్‌ ద్వారా తన కథను ప్రపంచానికి చెప్పి బాసటగా నిలవాలని అర్థించింది... అది చదివి చలించిపోయిన మానవతా మూర్తులెందరో ఆపన్న హస్తాన్ని అందించారు. దాంతో కొద్ది రోజుల్లోనే తనకు కావాల్సిన రూ.20 లక్షలు విరాళంగా వచ్చింది. ఇటీవలే లండన్‌లోని ఆ విద్యాసంస్థలో చేరింది లైలా.


మళ్లీ అఫ్గాన్‌ వెళ్తా..

అఫ్గాన్‌లో గతేడాది తాలిబాన్‌ పాలన తిరిగి ప్రారంభమవ్వడానికి ముందు వరకూ ఏటా సెలవులకు కాబూల్‌ వెళ్లేది. డబ్ల్యూఏడబ్ల్యూ వాలంటీరుగా పిల్లల చదువులకు తోడ్పడుతూ ఉండేది లైలా. ‘విద్యతో జీవితాలు ఎలా మారతాయో తెలుసుకున్నాను. భారతదేశం నన్ను అక్కున చేర్చుకుంది. పాత జ్ఞాపకాలను మరిపించి కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఈ దేశం చూపిన ప్రేమ, ఆదరణ మరవలేను. ఆ స్ఫూర్తితో లండన్‌లో కోర్సు పూర్తవగానే నా మాతృభూమికి వెళ్తా. అక్కడ ఆడపిల్లల, మహిళల చదువుల కోసం పోరాడతా’నంటోంది లైలా.

- హిదాయతుల్లాహ్‌.బి, ఈనాడు, చెన్నై

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్