పెళ్లి కాదేమో అంటారంతా..

ఆ మొసళ్ల బ్యాంకులోకి అడుగుపెడితే చాలు.. నవ్వుతూ పలకరిస్తుందామె. పాములు, మొసళ్ల పిల్లలను అలవోకగా చేతిలో ఉంచుకొని వాటిపై సందేహాలను తీరుస్తుంది. అరచేతిలో తాబేళ్లు, ఊసరవెల్లి వంటివాటితో చిన్నారులకు పాఠాలెన్నో చెబుతుంది. ఐజెడ్‌ఈకు దక్షిణాసియా తరఫున ప్రాంతీయ ప్రతినిధిగా..

Published : 27 Jun 2022 02:14 IST

ఆ మొసళ్ల బ్యాంకులోకి అడుగుపెడితే చాలు.. నవ్వుతూ పలకరిస్తుందామె. పాములు, మొసళ్ల పిల్లలను అలవోకగా చేతిలో ఉంచుకొని వాటిపై సందేహాలను తీరుస్తుంది. అరచేతిలో తాబేళ్లు, ఊసరవెల్లి వంటివాటితో చిన్నారులకు పాఠాలెన్నో చెబుతుంది. ఐజెడ్‌ఈకు దక్షిణాసియా తరఫున ప్రాంతీయ ప్రతినిధిగా.. అందరిలో సరీ సృపాలపట్ల అవగాహన కలిగించడమే తన లక్ష్యం అంటున్న మద్రాసుకు చెందిన 29 ఏళ్ల స్టెఫీజాన్‌ స్ఫూర్తి కథనమిది.

చెన్నై, మొసళ్ల బ్యాంకు ట్రస్టు(ఎమ్‌సీబీటీ)లో ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న స్టెఫీజాన్‌కు చిన్నప్పటి నుంచి జంతువులంటే ప్రేమ. అందుకే దాన్నే కెరియర్‌గా ఎంచుకొంది. జంతువులపట్ల ప్రజల్లో భయాన్ని పోగొట్టడానికి సందర్శకులు, విద్యార్థుల్లో అవగాహన పెంచుతోంది.

నాన్న భయపడతారు..

జంతువుల మధ్య తిరగడం తనకెంతో ఇష్టమంటుంది స్టెఫీజాన్‌. ‘ఏడో తరగతిలో ఉన్నప్పుడు ఒకసారి స్టీవ్‌ ఇర్విన్‌ నిర్వహించే ఓ కార్యక్రమాన్ని టీవీలో చూసి స్ఫూర్తి పొందా. నేనూ అతనిలా అందరికీ జంతువులపట్ల అవగాహన కలిగించాలని అనుకున్నా. ఇంటర్‌లో సైన్స్‌ తీసుకున్నా. తిరుచ్చి బిషప్‌ హెబర్‌ కళాశాలలో జంతుశాస్త్రం మెయిన్‌గా బీఎస్సీ, ఆ తర్వాత స్కాట్‌ల్యాండ్‌ ఎడిన్‌బరో నేపియర్‌ యూనివర్శిటీలో మూడేళ్ల వైల్డ్‌ లైఫ్‌ బయాలజీ అండ్‌ కన్జర్వేషన్‌లో మాస్టర్స్‌ పూర్తిచేశా. ముంబయి నేచురల్‌ హిస్టరీ సొసైటీలో మైగ్రేటరీ బర్డ్స్‌ అంశంపై రిసెర్చిఫెలోగా చేరా. ఆ తర్వాత మూడేళ్లు పాఠశాలలు, కళాశాలల్లో జంతువుల పట్ల అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించా. అలా చెన్నై మొసళ్ల బ్యాంకులో ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌గా విధుల్లో చేరా. ఇక్కడికొచ్చేవారిలో చాలామందికి పాములు, మొసళ్ల గురించి సందేహాలు, భయాలుంటాయి. అవన్నీ తీరుస్తుంటా. పిల్లల కోసం ప్రత్యేకంగా వర్చువల్‌ షోలు, జంతువులతో పలురకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటా. వీటిని ప్రజలకు దగ్గర చేయడమే నా లక్ష్యం. అమ్మాయివి కదా.. నీకు భయం ఉండదా అంటూ చాలామంది అడుగుతారు. పాములు, మొసళ్ల పిల్లలను నా చేతిలో చూసినప్పుడు వింతగా, ఆశ్చర్యంగా చూస్తారు. ఎవరికైనా వీటిని చూసి భయపడకండి అని చెప్పేముందు నేను ధైర్యంగా ఉండాలి కదా. ‘పాములను పట్టుకుంటూ ఉంటే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, నీకు చివరకు పెళ్లి కాదేమో’ అని నాన్న భయపడుతుంటారు. ఈ బాధ్యతలు నాకు చాలా ఇష్టం. మనసుకు నచ్చిన పని చేస్తున్నా. నా పనిని గౌరవించే వ్యక్తినే ఎంచుకుంటా. ఏటా మన దేశంలో 50-60 వేలమంది పాముకాటుకు గురై చనిపోతున్నారు. దీనిపై అవగాహన పెంచాలనుకుంటున్నా. ముందుగా భయంతోనే ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. వన్యమృగాలు, మనం ఒకే భూమిపై బతకాలి. మన మధ్య సమన్వయం ఉండాలి. అప్పుడే ప్రకృతి వైపరీత్యాలకు తావుండదు. ఈ అంశంపై అందరిలో అవగాహన కలిగించాలనేదే నా ఆశయం’ అని చెబుతున్న స్టెఫీజాన్‌ గతేడాది ఇంటర్నేషనల్‌ జూ ఎడ్యుకేటర్స్‌ అసోసియేషన్‌ (ఐజెడ్‌ఈ)లో దక్షిణాసియాకు ప్రాంతీయ ప్రతినిధిగా ఎంపికైంది. 2019లో థాయ్‌ల్యాండ్‌లో జరిగిన ఆసియన్‌ జూ ఎడ్యుకేటర్స్‌ కాన్ఫరెన్స్‌వంటి పలు అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొని ప్రసంగించే అర్హతను దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్