ప్రియాంకా మాటలే.. కిరీటానికి బాటలు

అందంలోనే కాదు ఆలోచనల్లోనూ భిన్నమైన వ్యక్తిత్వం ఈ కన్నడ కస్తూరిది... ‘ఇరుకు గదిలో ఇబ్బంది పడే కన్నా... ఆ గాజు గోడలని బద్దలు కొట్టుకుని స్వేచ్ఛగా జీవించడమే మేలు..’ అని ప్రియాంకా చోప్రా చెప్పిన మాటల్ని ప్రగాఢంగా విశ్వసించి.. అనుసరించి మిస్‌ ఇండియా వరల్డ్‌గా ఎదిగిన సినీశెట్టి పంచుకున్న విశేషాలివి..

Updated : 05 Jul 2022 07:51 IST

అందంలోనే కాదు ఆలోచనల్లోనూ భిన్నమైన వ్యక్తిత్వం ఈ కన్నడ కస్తూరిది... ‘ఇరుకు గదిలో ఇబ్బంది పడే కన్నా... ఆ గాజు గోడలని బద్దలు కొట్టుకుని స్వేచ్ఛగా జీవించడమే మేలు..’ అని ప్రియాంకా చోప్రా చెప్పిన మాటల్ని ప్రగాఢంగా విశ్వసించి.. అనుసరించి మిస్‌ ఇండియా వరల్డ్‌గా ఎదిగిన సినీశెట్టి పంచుకున్న విశేషాలివి..

సోషల్‌ మీడియాలో: బాలీవుడ్‌ చిత్రాల ప్రభావంతో సరదాగా సినిమా పాటలకు డ్యాన్స్‌లు చేసేదాన్ని. ఓసారి వేదికపై నా భరతనాట్య ప్రదర్శన అయిన తర్వాత సెమీ క్లాసికల్‌గా ఓ పాటకు డ్యాన్స్‌ చేశా. ఆ వీడియోను ఇన్‌స్టాలో ఉంచితే వైరల్‌ అయ్యింది. దాంతో హిప్‌హాప్‌ కొరియోగ్రాఫర్ల వద్ద కూడా శిక్షణ తీసుకుని... ఆ డ్యాన్స్‌లను ఇన్‌స్టాలో ఉంచేదాన్ని. అభిమానులు, స్నేహితుల ప్రశంసలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఆధునికం, సంప్రదాయం ఏ నాట్యం చేసినా నాకంటూ ప్రత్యేక శైలి ఉండేలా చూసుకుంటా.అందుకే ఇన్‌స్టాలో నన్ను 77 వేల మంది అభిమానులు అనుసరిస్తున్నారు.

అమ్మమ్మ ప్రోత్సాహంతో: పుట్టి, పెరిగింది ముంబయిలోనే అయినా, కన్నడ మూలాలున్న అమ్మాయిని. అమ్మ హేమ. నాన్న సదానందశెట్టి వ్యాపారవేత్త. అమ్మ, అమ్మమ్మల పెంపకమే నన్నీరోజు ఇక్కడ నిలబెట్టింది. అమ్మమ్మ ప్రభావం నాపై మరీ ఎక్కువ. చిన్నప్పుడు డ్యాన్స్‌ అంటే ప్రాణం పెట్టేదాన్ని. దాంతో ఊహకూడా సరిగా రాని నాలుగోఏటే నాకు భరతనాట్యం నేర్పించింది అమ్మమ్మ. దీనికితోడు నా గురువు రాధాకృష్ణన్‌పద్మిని ప్రోత్సాహం కూడా తోడై 14 ఏళ్లకే అరంగేట్రం చేశా. ఆ తర్వాత హిప్‌హాప్‌ వంటి ఆధునిక నృత్యాల్లోనూ శిక్షణ తీసుకున్నా.  అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌లో డిగ్రీ చేసి, ప్రస్తుతం ఛార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అకౌంటెంట్‌(సీఎఫ్‌ఏ) చదువుతున్నా.

ఆదర్శం: మాజీ మిస్‌ వరల్డ్‌, నటి ప్రియాంక చోప్రానే నాకు ఆదర్శం. ‘అందాల పోటీల్లోకి అడుగు పెట్టడానికి కారణం.. ‘మిస్‌ వరల్డ్‌ 2000’ విజేత ప్రియాంకాచోప్రానే. ఓ ఇంటర్వ్యూలో ఆమె అన్న మాటలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. ‘ఇరుకు గదిలో ఇష్టం లేకుండా ఇమిడిపోవడం కన్నా.. ఆ గ్లాస్‌ సీలింగ్‌ని బద్దలుకొట్టుకుని బయటకు రావడమే మంచిది’ అన్న తన మాటలు నాలో కల్లోలం సృష్టించాయి. ఆ రోజు నుంచీ ఆమెకు వీరాభిమానిగా మారిపోయా. ఆమెలా నేనూ అందాల పోటీల్లోకి ఎందుకు అడుగుపెట్టకూడదనిపించింది. ఆమె స్ఫూర్తితోనే మోడల్‌గా కెరియర్‌  మొదలుపెట్టాను.  నెమ్మదిగా  అవకాశాలను అందుకున్నా.

జీవితమంటే: ఎన్ని రోజులు జీవించామన్నది కాదు. ‘ఒక్క నిమిషం ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది’ అంటామే.. అలాంటి ఉద్విగ్నభరిత క్షణాలు జీవితంలో ఉండాలి.

కష్టపడాల్సిందే: అందాల పోటీలో విజేతగా నిలవడం కోసం ఎన్నో కొత్తకొత్త అంశాల్లో శిక్షణ తీసుకున్నాను. అవన్నీ కొత్తే నాకు. కానీ ప్రాణం పెట్టి చేస్తే ఫలితం వస్తుందని నమ్మి చేశాను. అదే విజయం తెచ్చిపెట్టింది.  

కెరియర్‌లో విజయాలు: మోడల్‌గా ఎదుగుతూ ప్రముఖ సంస్థలైన ఎయిర్‌టెల్‌, ఫ్రీఫైర్‌, పాంటలూన్స్‌ వంటి ప్రముఖ బ్రాండ్లకి మోడలింగ్‌ చేశా. పర్యాటక ప్రాంతాలను చుట్టిరావడం అంటే చాలా ఇష్టం. జర్మనీ, ఫ్రాన్స్‌, బెల్జియం వంటి దేశాల్లో తిరిగొచ్చా.  

మరిచిపోలేని క్షణాలు: ‘మిస్‌ ఇండియా వరల్డ్‌’ పోటీల్లో ‘బాడీ బ్యూటిఫుల్‌’, ‘మిస్‌ టాలెంటెడ్‌’ టైటిల్స్‌ను దక్కించుకున్నప్పుడు. అన్నింటికన్నా మరిచిపోలేని అనుభవం మాత్రం పద్నాలుగేళ్లప్పుడు చేసిన నా మూడు గంటల అరంగేట్రం. అప్పుడు కలిగిన అనుభూతి నా మనసులో శాశ్వతంగా ఉండిపోతుంది.

నచ్చిన పుస్తకం: ఇన్‌టు ది వైల్డ్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్