ఆకులతో చెప్పులు.. పెంకులతో పాత్రలు!

ఆకులతో చెప్పులు, కోడిగుడ్డు గుల్లలతో వంటపాత్రలు.. వినడానికి వింతగా ఉందా? ‘ఉంటే ఉండనివ్వండి.. నేను మాత్రం వృథా నుంచి అద్భుతాలు చేస్తా’ అంటున్న మిధుషి ఉత్పత్తులకు విదేశాల్లోనూ డిమాండ్‌ పెరుగుతోంది...  సముద్రపు ఒడ్డున దొరికే గులకరాళ్లు, ఎండిపోయిన పూలు, రాలిన ఆకులు ఇలాంటివి మనకి వృథాగానే అనిపిస్తాయి కానీ మిధుషికి మాత్రం కాదు.

Updated : 09 Jul 2022 09:51 IST

ఆకులతో చెప్పులు, కోడిగుడ్డు గుల్లలతో వంటపాత్రలు.. వినడానికి వింతగా ఉందా? ‘ఉంటే ఉండనివ్వండి.. నేను మాత్రం వృథా నుంచి అద్భుతాలు చేస్తా’ అంటున్న మిధుషి ఉత్పత్తులకు విదేశాల్లోనూ డిమాండ్‌ పెరుగుతోంది... 

ముద్రపు ఒడ్డున దొరికే గులకరాళ్లు, ఎండిపోయిన పూలు, రాలిన ఆకులు ఇలాంటివి మనకి వృథాగానే అనిపిస్తాయి కానీ మిధుషికి మాత్రం కాదు. అందుకే చిన్నతనంలో వాటిని అందమైన కళారూపాలుగా మలిచి తన గదిని అలంకరించుకొనేది. పెద్దయ్యాక కూడా ఆ అలవాటుపోలేదు సరికదా... దాన్నే కెరియర్‌గా మలచుకొనేంత బలంగా మారింది. తన కలని నిజం చేసుకొనేందుకు లండన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలోని సెంట్రల్‌ సెయింట్‌ మార్టిన్స్‌ కాలేజీలో... ఇండస్ట్రియల్‌ డిజైనర్‌గా శిక్షణ తీసుకుంది. ప్రొఫెసర్లతో కలిసి పర్యావరణహిత ఉత్పత్తులపై ఎన్నో ప్రయోగాలు చేసింది. 2020లో నెదర్లాండ్స్‌లో... ఒక ప్రాజెక్ట్‌ని ప్రారంభించి స్కూల్‌ పిల్లలకు వృథా నుంచి అద్భుతాలు చేయడం ఎలానో నేర్పించింది. స్వస్థలం దిల్లీకి తిరిగొచ్చి తన ఆలోచనలని ఆచరణలో పెట్టేందుకు ‘వైఈఎల్‌ఎమ్‌’ అనే సంస్థని ప్రారంభించింది. ‘మన చుట్టూ ఉన్న సహజ వనరులు ఎప్పటికీ ఇలానే ఉంటాయి అనుకొంటే పొరపాటు. అవి నిండుకొనే సమయం ఆసన్నమవుతోంది. అందుకే చేతిలో ఉన్న వనరులనే పునర్వినియోగం చేయడం ఎలానో నేర్చుకోవాలి. అలా ఆలోచించినప్పుడు నా దృష్టి కోడిగుడ్డు గుల్లలు, ఈకలపై పడింది. ఒక రకం సముద్రనాచుని బయోబైండర్‌ (జిగురు)గా వాడి కాంక్రీట్‌ కంటే బలమైన పదార్థాన్ని గుల్లలతో తయారుచేశా. ఇది బలమైనదే కాదు... తేలిగ్గానూ ఉంటుంది. భూమిలో వేగంగా కలిసిపోయి ఎటువంటి వ్యర్థాలు మిగల్చదు.

ఇక కోడి ఈకలతో తేలికపాటి ఫర్నిచర్‌ని తయారు చేసేందుకు అవసరం అయిన బయోప్లాస్టిక్‌ని రూపొందించాను. వీటితో చేసిన ఉత్పత్తులని చైనాలో గ్వాంగ్జౌలో జరిగిన సస్టెయినబుల్‌ డిజైన్‌ మెటీరియల్‌ మ్యూజియమ్‌లోనూ, మిలాన్‌ డిజైన్‌ వీక్‌, లండన్‌ డిజైన్‌ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించాక వాటికి ఆర్డర్లు రావడం మొదలయ్యింది. ముఖ్యంగా గుల్లలతో చేసిన వంటపాత్రలకి ఆదరణ ఎక్కువయ్యింది. ఇందుకు కావాల్సిన మెటీరియల్‌ కోసం హోటళ్లు, ఫుడ్‌స్టాల్స్‌ని ఆశ్రయించేదాన్ని. వాళ్లు ఇచ్చిన కోడిగుడ్డు గుల్లలు వాసన రాకుండా మొదట శుభ్రం చేయాలి. ఆ తర్వాత ప్రాసెసింగ్‌ ఉంటుంది. మొదట్లో ఈ మెటీరియల్‌ సేకరణ కోసం చాలా కష్టపడ్డా... తర్వాత దిల్లీలో ఎగ్‌ ఫ్లేక్స్‌ అమ్మేందుకు ప్రత్యేకించి దుకాణం ఉందని తెలిసి సంతోషించాను’ అంటున్న మిథుషి కొత్తకొత్త డిజైన్లతో ఎగ్‌వేర్‌ వంట పాత్రలని రూపొందిస్తూ వినియోగదారులని ఆకట్టుకుంటోంది. తన మరో ఆవిష్కరణ... ‘హసీరూ’. ఇవి ఆకులతో చేసిన చెప్పులు. అయితే వీటిని మిథుషి తల్లి సాక్షి కొచ్చార్‌ రూపొందించారు. పోకచెక్కల ఆకులతో రూపొందించిన ఈ పాదరక్షలకు కొద్ది కాలంలోనే గిరాకీ భారీగా పెరిగిపోయింది. వేల జతలు అమ్ముతున్నారు. జత రూ.500. ‘ఏ వస్త్రధారణకయినా అతికినట్టుగా అమిరిపోవడం, తేలిగ్గా ఉండటం, ముఖ్యంగా నడిచినప్పుడు పాదాలపై ఒత్తిడి లేకపోవడం వంటి సదుపాయాలు ఉండటంతో ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. అమెరికా, ఐరోపా దేశాల నుంచి ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయి’ అని చెప్పే మిధుషి.. భవిష్యత్తులో వీటిని పెద్ద ఎత్తున తయారుచేస్తూ... సహజ వనరులని కాపాడటమే తన లక్ష్యమటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్