సేవా వారసులు

అమ్మానాన్నల వేల కోట్ల ఆస్తులకు వారసురాళ్లు వీళ్లు. ఎండ కన్నెరగకుండా పెరిగారు. అయితేనేం? కష్టం విలువ మాకు తెలుసంటున్నారు. అందుకే తోచిన విధంగా సాయం చేస్తూ.. మనసున్న మారాణులు అనిపించుకుంటున్నారు. ఆ యువరాణులను మీరూ కలిసేయండి.

Updated : 24 Jul 2022 08:35 IST

అమ్మానాన్నల వేల కోట్ల ఆస్తులకు వారసురాళ్లు వీళ్లు. ఎండ కన్నెరగకుండా పెరిగారు. అయితేనేం? కష్టం విలువ మాకు తెలుసంటున్నారు. అందుకే తోచిన విధంగా సాయం చేస్తూ.. మనసున్న మారాణులు అనిపించుకుంటున్నారు. ఆ యువరాణులను మీరూ కలిసేయండి.


18 ఏళ్లకే సేవ: అద్వైతేష

అమ్మాయి బిర్లా గ్రూపు అధిపతి కుమార మంగళం బిర్లా మూడో సంతానం. 18వ ఏటనే ‘సేవ’ వైపు అడుగేసింది. ఇందుకు అమ్మ నీరజే స్ఫూర్తి అట. ‘ఉజాస్‌’ పేరుతో రుతుక్రమంపై అవగాహన, నెలసరి పరిశుభ్రత, శానిటరీ ప్యాడ్లను అందివ్వడంతోపాటు వాటి తయారీపైనా శిక్షణనిప్పిస్తోంది. ‘నాకు మహిళా సాధికారత, లింగ సమానత్వ అంశాలపై ఆసక్తి ఎక్కువ. అందుకే సైకాలజీలో డిగ్రీ చేయాలనుకుంటున్నా. మా ఇంట్లో వాళ్లందరూ ఒక్కొక్కరూ ఒక్కో రంగంలో సమాజ సేవ చేస్తున్నారు. నావంతుగా నేనూ చేయాలనుకున్నా. నెలసరి ఆరోగ్యంపై అపోహలు, దీన్నో తప్పుగా భావిస్తుండటం వంటి వాటిపై కొన్ని అనుభవాలు ఎదురయ్యాయి. వాటిపై విస్తృతంగా పరిశోధిస్తే.. ఫలితాలు ఆవేదన కలిగించాయి. తమకు అనుభవమయ్యేంత వరకూ నెలసరిపై కనీస అవగాహన లేని అమ్మాయిలున్నారని తెలిసింది. అందుకే దీనిపై కృషి చేయాలనుకున్నా. నాన్నతో మాట్లాడితే 2021 డిసెంబరులో ఆదిత్య బిర్లా ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ కింద ‘ఉజాస్‌’ను మొదలుపెట్టే అవకాశమిచ్చారు. దీని ద్వారా నెలసరి అపోహలు, సందేహాలపై వర్క్‌షాప్‌లు నిర్వహించడంతోపాటు శానిటరీ నాప్కిన్లనీ అందిస్తున్నాం. వీటిపై అబ్బాయిలకీ అవగాహన కల్పించాలనుకున్నా. కానీ స్కూళ్లలో అనుమతిచ్చే వారు కాదు. బతిమాలి ఒప్పించి వారికీ తరగతులు నిర్వహిస్తున్నా. పర్యావరణహిత ప్యాడ్‌ల తయారీలో శిక్షణనిచ్చి, ఆ ఉత్పత్తుల్ని మార్కెటింగ్‌ చేసి ఉపాధినీ కల్పిస్తున్నాం. దీన్ని దేశవ్యాప్తం చేయడమే లక్ష్యం’ అని చెబుతున్న అద్వైతేష ఇప్పటికే 200కుపైగా వర్క్‌షాప్‌లను నిర్వహించింది. 14 వేలమందికి శిక్షణనిచ్చింది. 3.2 లక్షలకుపైగా శానిటరీ నాప్కిన్లను పంచింది.


ఆడవాళ్ల కోసమే.. : నవ్య నవేలి

నాన్నది పెద్ద వ్యాపారం. ఇక తాత అమితాబ్‌ బచ్చన్‌ పేరు తెలియనిదెవరికి? అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటోంది నవ్య. తను ఎదగడమే కాదు.. తోటి ఆడవాళ్లూ ఎదిగేలా చేయాలనుకుంటోంది. ‘నేను చదివింది విదేశాల్లో! అక్కడ అమ్మాయిలకు స్వేచ్ఛ, నిర్ణయాధికారాలుంటాయి. ఇక్కడ అవి కొరవడటం గమనించా. ఇంకా కుటుంబ బాధ్యతల్లో పడి తమ ఆరోగ్యాల్ని నిర్లక్ష్యం చేసేవారే ఎక్కువ. నెలసరి విషయంలోనూ పాత కాల పద్ధతుల్నే అనుసరిస్తున్నారు. వీటన్నింటికీ పరిష్కారం చూపాలనుకున్నా. 2020లో చదువు పూర్తవ్వగానే ముంబయిలో ‘ఆరా హెల్త్‌’ ప్రారంభించా. ఇది ఆన్‌లైన్‌ సంస్థ. మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులు, సేవల సమాచారమంతా అందుబాటులో ఉంటుంది. 2021లో ‘ప్రాజెక్ట్‌ నవేలి’ మొదలెట్టి విద్య, మానసిక, శారీరక ఆరోగ్యం, గృహహింస అంశాల్లో తోడ్పాటు నందిస్తున్నాం. ‘ఆస్పైర్‌ ఫర్‌ హర్‌’ సంస్థకీ కో ఫౌండర్‌ని. ఇది ఉద్యోగ నైపుణ్యాలు నేర్పించడంతోపాటు మహిళలకు అవకాశాలనూ చూపిస్తుంది. లింగ సమానత్వమున్న సమాజాన్ని చూడాలన్నది నా కల. ఇది అవగాహన, అవకాశాలతోనే సాధ్యమవుతుందని నమ్ముతా. అందుకే ఇవన్నీ’ అంటోన్న నవ్య డిజిటల్‌ టెక్నాలజీ అండ్‌ యూఎక్స్‌లో డిగ్రీ చేసింది. అడ్వర్టైజింగ్‌ సంస్థలో రాణిస్తున్న తను నాన్న వ్యాపారానికి వారసురాల్ని అవుతానంటోంది.


తన అనుభవాన్నే: జాన్హవి

ప్రపంచ దేశాలతో పోలిస్తే... ఇప్పటికీ మనదేశంలో ప్రసూతి సమయంలో తలెత్తుతున్న మాతాశిశు మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది. అందుకే ప్రసవాలు జరిగే తీరునే మార్చాలనుకుంది ‘ఆస్ట్రికా’ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ 32 ఏళ్ల డాక్టర్‌ జాన్హవీ నిలేకనీ. నందన్‌, రోహిణీ నిలేకనీల పెద్దకూతురీమె. నందన్‌ ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరిగా వ్యాపార రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటే... రోహిణి 30 ఏళ్లుగా సేవారంగంలో ఉన్నారు. జాన్హవి ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసి గాలి కాలుష్యాన్ని తగ్గించడంపై దృష్టిపెట్టింది. ఆ తర్వాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో పబ్లిక్‌ పాలసీపై పీహెచ్‌డీ చేసింది. ఆస్ట్రికాని స్థాపించడానికి ప్రధాన కారణం.. స్వీయ అనుభవమే అంటుంది జాన్హవీ. తను తల్లైనప్పుడు... మనదేశంలో ప్రసవాల తీరుని, తల్లులు పడే ఇబ్బందులని చాలా దగ్గరగా పరిశీలించిందామె. ‘మన దేశంలో గర్భిణుల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ముందు జాగ్రత్త పేరుతో కొన్నిసార్లు అవసరం లేకపోయినా సిజేరియన్‌ వరకు వెళ్తారు. కొందరికి అవసరమైన సాయం అందక ప్రాణాల మీదకొస్తుంది. అందుకే సమయానికి తగిన సేవలు.. అందించాలనే నినాదంతో బెంగళూరులో ఆస్ట్రికా మిడ్‌వైఫరీ కేంద్రాన్ని ప్రారంభించా’ అనే జాన్హవి సిజేరియన్లని, ప్రసవ వేదనని తగ్గించడంలో నైపుణ్యాలపై నర్సులు, వైద్య సిబ్బందికి ప్రత్యేక మిడ్‌వైఫ్‌ శిక్షణ అందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు... మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌తోనూ, యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్స్‌ ఫండ్‌ సంస్థతోనూ కలిసి పనిచేస్తోంది జాన్హవి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్