కెనడా వద్దనుకుని.. కిచెన్లో అడుగుపెట్టా!

అమ్మాయి విదేశాల్లో ఎంబీఏ చేయాలి.. కార్పొరేట్‌ ప్రపంచంలో విజయం సాధించాలనుకున్నారా తల్లిదండ్రులు. ఆమె మాత్రం త్వరగా వ్యాపారంలో అడుగుపెట్టి త్వరత్వరగా పాఠాలు నేర్చుకుంటే విజయం సాధించవచ్చనుకుంది.

Updated : 26 Sep 2022 07:49 IST

అమ్మాయి విదేశాల్లో ఎంబీఏ చేయాలి.. కార్పొరేట్‌ ప్రపంచంలో విజయం సాధించాలనుకున్నారా తల్లిదండ్రులు. ఆమె మాత్రం త్వరగా వ్యాపారంలో అడుగుపెట్టి త్వరత్వరగా పాఠాలు నేర్చుకుంటే విజయం సాధించవచ్చనుకుంది. అనుకోవడమే కాదు.. పాతికేళ్లకే హోటల్‌ రంగంలో అడుగుపెట్టి రూ.10కోట్ల టర్నోవర్‌ స్థాయికి కంపెనీని ఎదిగేలా చేసింది.. తెలుగమ్మాయి మర్రెడ్డి హరిణి. ఆ ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుందిలా..

మాది గుంటూరు. నాన్న కృష్ణారెడ్డి చెన్నై, గుంటూరుల్లో ఎలక్ట్రానిక్స్‌ షోరూమ్‌ నడిపేవారు. ఆపైన నా చదువు కోసం కర్ణాటకలోని హొసపేటె, మైసూరులకు మారాం. అమ్మ శోభారాణి, తమ్ముడు హరి. నాన్న స్ఫూర్తితో వ్యాపారంలో అడుగుపెట్టాలనుకున్నా. ఇంటర్లో ఈబీఏసీ(ఎకనామిక్స్‌, బిజినెస్‌ స్టడీస్‌, అకౌంటెన్సీ, కంప్యూటర్‌సైన్స్‌), వైజాగ్‌ గీతం నుంచి బీబీఎం పూర్తి చేశా. అప్పుడే వ్యాపారంలో అడుగుపెడతానని నాన్నతో చెబితే.. ముందు కెనడాలో ఎంబీఏ చేయమన్నారు. నాకేమో విదేశాలకు వెళ్తే అక్కణ్నుంచి తిరిగి రావటం కుదరదనిపించింది. పాఠాలకంటే అనుభవ పాఠాలతోనే విజయం సాధ్యమనిపించింది. చదువుకు దాచిన మొత్తాన్నే పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తానన్నా.

ఎలక్ట్రానిక్స్‌ మార్కెటింగ్‌ అంటే సాంకేతికత తెలియాలి. ఫ్యాషన్‌ రంగం సౌకర్యంగా ఉంటుందనేది నాన్న సలహా. నాకు కొత్త వంటలు ప్రయత్నించడం, వడ్డించడం ఇష్టం. అమ్మమ్మవాళ్ల ఊరెళ్లినప్పుడు కొత్త వంటకాలు నేర్చుకునేదాన్ని. ఆ రంగమే నాకు సరైనదనిపించింది. ‘మగవాళ్లకే కష్టం అమ్మాయిలకి సాధ్యమా’ అన్నారు బంధువులూ, స్నేహితులూ. అవగాహన పెంచుకుంటే ఏ రంగమైనా ఒకటే అనుకున్నా. ఆరు నెలలు ప్రాజెక్టు వర్క్‌ చేయాలని హొసపేటెలోని ఓ ప్రముఖ హోటల్‌ ఎండీని సంప్రదించా. ‘40 ఏళ్ల అనుభవంతో చెబుతున్నా ఆడవాళ్లకిది కష్టం’ అని మొహం మీదే చెప్పేశారు. నా పట్టుదల చూసి చివరకు అంగీకరించారు. అందరూ అసాధ్యం అంటుంటే.. ఈ రంగంలోనే సత్తా నిరూపించుకోవాలన్న పట్టుదల మరింత పెరిగింది. 

అచ్చమైన ఆంధ్రాశైలి
బెంగళూరులో రెస్టారెంట్‌ ప్రారంభించాలనుకున్నా. నాన్న తన వ్యాపార అనుభవాల్ని వివరించారు. బెంగళూరులో ఆంధ్ర, తమిళనాడు, కేరళ.. ఇలా రాష్ట్రాల పేరుతో  ప్రత్యేకమైన రెస్టారెంట్లు అడుగడుగునా కనిపిస్తాయి. లోపల అన్నిచోట్లా ఒకేతరహా వంటకాల్ని వడ్డిస్తారు. నా రెస్టారెంట్‌ అలా ఉండకూడదనుకున్నా. అందుకోసం మా ఇంట్లో వండే అచ్చమైన ఆంధ్ర వంటకాలతో మెనూ సిద్ధం చేశా. ఉలవచారు బిర్యానీ, గుంటూరు గోంగూర, ఆవకాయ బిర్యానీ, పల్నాడు నాటుకోడి బిర్యానీ.. ఈ వంటలతో 2018లో ‘జమీందార్‌’ రెస్టారెంట్‌ ప్రారంభించా. విద్యార్థులూ, చిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకుని రూ.299కే రెండు రకాల బిర్యానీలూ, కొన్ని చికెన్‌ స్టార్టర్లు అపరిమితంగా అందించాం. దాంతో మాకో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కొద్ది రోజులకే పోటీ హోటళ్లు మమ్ముల్ని అనుసరించాయి. వంటకాలకు మసాలా పొడులు ఇంటి దగ్గరే చేయడంతో రుచిలో, నాణ్యతలో మాకు ప్రత్యేకత వచ్చింది. వందల హోటళ్లు ఉండే కళ్యాణనగరలో.. కేవలం మూడేళ్లలోనే మేం రూ.9 కోట్ల వార్షికాదాయం సాధించాం. సీట్ల సామర్థ్యాన్ని 60 నుంచి 200కు పెంచాం. నగరంలో మరో రెండు ఔట్‌లెట్లనీ ప్రారంభించాం. ఆంధ్రా వంటకాల్ని అందిస్తూనే, ఇతర రకాల్నీ పెంచుకుంటూ పోవడమే ఈ విజయానికి ప్రధాన కారణం. రెండేళ్లపాటు రోజూ 12-14 గంటలు పనిచేశా. సరకులు కొనడం, వంటల్ని పర్యవేక్షించడం, ఫ్రంట్‌ ఆఫీస్‌.. అన్నింటినీ స్వయంగా పర్యవేక్షించేదాన్ని. కొవిడ్‌ సమయంలో మార్పులూచేర్పులకి అవకాశం దక్కింది. ఆ సమయంలో రూ.349కే 20 రకాలు అందించేలా చేసిన మార్పు మా కస్టమర్లని బాగా పెరిగేలా చేసింది.


‘ఫ్యామిలీ’ రెస్టారెంట్‌

పనివాళ్లు ఎక్కువగా మగవాళ్లే, గంటలకొద్దీ కిచెన్‌లో వేడి మధ్య ఉండాలి. అందుకే అమ్మాయిలకు ఇది సరిపోదని చెబుతారు. కానీ అబ్బాయిలకు సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కాదనుకుని పనిచేశా. ప్రస్తుతం 100 మందికి ఉపాధి కల్పిస్తున్నా. అయిదేళ్లలో వెయ్యిమందికి ఉపాధి కల్పించాలన్నది లక్ష్యం. నాన్న, తమ్ముడు కూడా ప్రస్తుతం హోటల్‌ నిర్వహణలో నాకు సాయంగా ఉన్నారు. మసాలాల తయారీని అమ్మ పర్యవేక్షిస్తుంది.


-కె.ముకుంద, బెంగళూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్