Published : 04/10/2022 00:59 IST

పల్లె గళం.. పార్లమెంటులో!

నలుగురిలో మాట్లాడాలంటేనే చాలా మందికి బిడియం. అలాంటిది డిగ్రీ అమ్మాయి.. దేశ పార్లమెంట్‌లో ప్రసంగించడమంటే మాటలా! మిద్దె రూప ఆ అవకాశాన్ని దక్కించుకుంది. ఆ అవకాశం ఎలా వచ్చింది.. అక్కడేం మాట్లాడిందన్న అంశాల్ని వసుంధరతో పంచుకుందిలా.. 

నేను ఎనిమిదో తరగతిలో ఉండగా.. ‘అమ్మాయిలైతేనేం.. వాళ్లూ బాగా చదువుకుని పేరు తెస్తారు’ అని బంధువులతో నాన్న చెప్పడం విన్నా. అప్పటివరకూ నాకెలాంటి లక్ష్యాల్లేవ్‌. నాన్న మాటలు విన్నాక నాలో మార్పు వచ్చింది. మాది వైఎస్సార్‌ కడప జిల్లా టి.కోడూరు. నాన్న సత్యనారాయణ, అమ్మ రమాదేవి. రైతు కుటుంబం. కారు డ్రైవర్‌గానూ చేస్తారు నాన్న. నాకో చెల్లి.. అపర్ణ. మా ఊరికి బస్సు కూడా రాదు. అయిదో తరగతి వరకూ తాడిపత్రిలోని ప్రైవేటు స్కూల్లో, ఆరో తరగతిలో నవోదయ స్కూల్‌కి ఎంపికై హిందూపురంలో చదివా. అప్పుడే ఇంగ్లిష్‌ మీడియానికి మారడంతో చదువు భారంగా అనిపించేది. ముభావంగా ఉండేదాన్ని. నాన్న మాటలు విన్నప్పట్నుంచీ నన్ను నేను మార్చుకోవాలనున్నా. వక్తృత్వ పోటీలూ, పాటలు, చిత్రలేఖనం.. అన్నింటిలోనూ భాగమయ్యేదాన్ని. ఇంటర్‌.. కర్ణాటకలోని తుముకూరు, సిద్ధగంగ ఆశ్రమ కాలేజీలో చదివా. అక్కడే సమాజసేవపై అవగాహన ఏర్పడింది. కడప మహిళా కాలేజీలో బీఏ చదువుతూ ‘స్ప్రెడింగ్‌ స్మైల్స్‌ టు ది సొసైటీ’ స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాల్లో భాగమవుతూ వచ్చా. డిగ్రీ ఫస్టియర్లో నెహ్రూ యువ కేంద్రం వక్తృతృ పోటీల్లో జిల్లాలో ఫస్ట్‌ వచ్చా. సెకెండియర్‌లోనూ పాల్గొన్నా, కరోనా కారణంగా అవి ముందుకు వెళ్లలేదు. అప్పుడు యునిసెఫ్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌ సదస్సులోనూ ప్రసంగించా. మూడో ఏడాదిలో నెహ్రూ యువ కేంద్రం నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నా. జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో వేర్వేరు అంశాలపైన మాట్లాడించారు. పలు స్క్రీనింగ్‌ టెస్టుల్లో పాసై రాష్ట్ర స్థాయి విజేతగా నిలవడంతో పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో ప్రసంగించే అవకాశం వచ్చింది. ‘స్వతంత్ర సమరయోధులకు నివాళి’ అంశం.. నేను గాంధీజీ ఆలోచనలు నేటి సమాజానికి ఎందుకు అవసరమో వివరిస్తూ మాట్లాడా. ‘మార్పు రావాలి. అది మన నుంచి మొదలవ్వాలి’ అంటూ నా ఆలోచనల్ని పంచుకున్నా. గ్రామీణ, మహిళాభివృద్ధి గురించి ప్రత్యేకించి చెప్పా. స్పీకర్‌ ఓం బిర్లా, చాలా మంది ఎంపీలూ, అధికారులూ శ్రోతల్లో ఉన్నారు. కలాం, ఇందిరాగాంధీ నాకు ఆదర్శం. లక్ష్యం పెట్టుకోవాలే కానీ సాధించడం కష్టమేమీ కాదన్నది నా ఉద్దేశం. హైదరాబాద్‌లో సివిల్స్‌కు సిద్ధమవుతున్నా. నా చదువుకి మా గ్రామానికి చెందిన జానకిరామయ్యశర్మ, హర్షవర్ధనశర్మ ఆర్థిక చేయూతనిస్తునారు. ప్రభుత్వాధికారిగా సమాజానికి సేవ చేయాలనేది నా లక్ష్యం.

  - బోగెం శ్రీనివాసులు, కడప


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి