గంజన్నం తిని... అంతర్జాతీయ స్థాయికి

నిరుపేద కుటుంబంలో పుట్టిందామె. ఎంత పేదరికం అంటే గంజి అన్నం తప్ప మరోటి తెలియనంతగా... దానికి తోడు సామాజిక వివక్ష. దాన్ని ఎదిరిస్తూ, పేదరికాన్ని భరిస్తూనే ఫుట్‌బాల్‌ను ప్రేమించింది.

Updated : 10 Oct 2022 14:54 IST

నిరుపేద కుటుంబంలో పుట్టిందామె. ఎంత పేదరికం అంటే గంజి అన్నం తప్ప మరోటి తెలియనంతగా... దానికి తోడు సామాజిక వివక్ష. దాన్ని ఎదిరిస్తూ, పేదరికాన్ని భరిస్తూనే ఫుట్‌బాల్‌ను ప్రేమించింది. ఎందరు ఎగతాళి చేసినా.. విమర్శలెన్నెదురైనా పట్టుదలగా సాగించిన కఠోర సాధనే దేశ ఫుట్‌బాల్‌ జట్టుకు నేతృత్వం వహించే అవకాశాన్ని అందించింది. ఆమే.. అష్తమ్‌ ఒరౌన్‌. జాతీయ అండర్‌ 17 ఫుట్‌బాల్‌ బృందానికి కెప్టెన్‌.

అష్తమ్‌కు నలుగురు తోబుట్టువులు. సేద్యానికి పనికిరాని పొలంలో అప్పుడప్పుడు వేసే పంట వారి ఆకలిని తీర్చలేకపోయేది. దాంతో అమ్మానాన్నలు తారాదేవి, హీరాలాల్‌ తెచ్చే కూలి డబ్బులే ఆ కుటుంబానికి ఆధారమయ్యేవి. జార్ఖండ్‌లోని ఓ మారుమూల పల్లె వాళ్లది. అష్తమ్‌నైనా బాగా చదివించాలని బడికి పంపేవారు. అదంతా ఫోన్‌, ఇంటర్నెట్‌ వంటి సౌకర్యాలేవీ లేని లోతట్టు ప్రాంతం. అందుకేనేమో.. పిల్లలెక్కువగా ఆటల పట్ల ఆసక్తిగా ఉండే వారు. అలా స్కూల్‌లో ఫుట్‌బాల్‌ ఆడేవారిని చూసినప్పుడల్లా అష్తమ్‌లోనూ ఉత్సాహం పొంగుకొచ్చేది. ఆ బాల్‌ను చూస్తే చాలు, తనూ ఆడాలని అనుకునేది. తన ఆసక్తిని గుర్తించిన కోచ్‌ శిక్షణనివ్వడం మొదలు పెట్టాడు. అదే ఆమె జీవితానికి మలుపు.

మైదానంగా..

ఇంట్లోను, బయటా... పొలాలు, ఖాళీ ప్రదేశాలు.. ఇలా చోటు, సమయం దొరికితే చాలు, అష్తమ్‌ స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడుతూనే ఉండేది. పగలూ రాత్రి తేడా లేకుండా ఎప్పుడూ ఆడుతూ, గెంతుతూ కనిపించే నన్ను చూసి ఇరుగుపొరుగువారు విమర్శించే వారు, ఆడపిల్లను ఇలానేనా పెంచేది అని నాన్నను తిట్టేవారు అని చెబుతుంది అష్తమ్‌. ‘అమ్మానాన్నలను అవమానించే వారు. ఆడపిల్లనెందుకు అలా వదిలేస్తున్నారు, ఫుట్‌బాల్‌ మాన్పించండి అని సలహాలిచ్చేవారు. వారిద్దరూ పొలం పని లేకపోతే కూలీకెళ్లి మమ్మల్ని పోషించే వారు. అందరం రోజూ గంజి అన్నమే తినేవాళ్లం. వేరే ఆహారం మాకు తెలీదు. ఫుట్‌బాల్‌ ఆడాలంటే పోషకాహారం తీసుకోవాలి అని అందరూ అనుకునేవారు. అయితే మా ఇంట్లో మాత్రం గంజి అన్నమే పోషకాహారం. అలానే సాధన చేస్తూ ఉంటే స్థానికంగా జరిగే ‘ఖస్సీ’ టోర్నమెంట్స్‌లో పాల్గొనేందుకు మా కోచ్‌ అవకాశం ఇప్పించే వారు. అక్కడ టీం విజేతగా నిలిస్తే మేకను బహుమతిగా ఇస్తారు. అది కూడా మంచిదే కదా. అందుకే నెగ్గడమే ధ్యేయంగా పెట్టుకునే దాన్ని. అమ్మ ఎప్పుడూ నన్ను చూసి బాధపడేది. కేవలం గంజి అన్నాన్ని మాత్రమే పెట్ట గలుగుతున్నానని కుమిలి పోయేది. నాన్న కూడా ఎవరెన్ని మాటలన్నా.. నన్ను ప్రోత్సహించే వారు. అవేమీ పట్టించుకోకు, నువ్వు పెద్ద క్రీడాకారిణిగా ఎదగాలి, బాగా ఆడటం నేర్చుకో అనేవారు. గతేడాది సీనియర్‌ ఉమెన్‌ ఫుట్‌బాల్‌ టీంలో ఎంపికై, మెరుగైన ఆటను ప్రదర్శించడంతో అండర్‌ -17 నేషనల్‌ క్యాంపునకు హాజరవ్వగలిగా. ఇక్కడ నా ఆట నచ్చి ‘ఫిఫా అండర్‌-17 ఉమెన్‌ వరల్డ్‌ కప్‌-22’ ఫుట్‌బాల్‌ బృందానికి కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అమ్మా నాన్న ప్రోత్సాహంతోనే మన దేశ జట్టుకు కెప్టెన్‌గా అవకాశాన్ని దక్కించుకోగలిగా. ఈ విషయం తెలియగానే ముందసలు అమ్మా నాన్న నమ్మలేకపోయారు. నాన్నకైతే నోట మాట రాలేదట. తర్వాత సంబర పడిపోయారు. నా పట్టుదల, కసి చూసి ఎప్పటికైనా నేను ఏదో సాధిస్తానని నమ్మే వారు. ఎంత పేద కుటుంబంలో పుట్టినా, సరైన ఆహారం అందకపోయినా కష్టపడి నిన్ను నువ్వు నిరూపించుకున్నావని, జార్ఖండ్‌కే గర్వకారణంగా నిలిచావని అమ్మ అంటుంటే చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది అష్తమ్‌. వీళ్ల బృందాన్ని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ప్రశంసలతో ముంచెత్తారు.  ఇదే రాష్ట్రం నుంచి అష్తమ్‌తో పాటు నీతు లిండా, అంజలీ ముండా, అనితా కుమారి, పూర్ణిమా కుమారి, సుధా అంకిత టిర్కీ ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్