ఆటల్లో సౌకర్యం... వంద కోట్ల వ్యాపారం

ఆమెకు ఆటలంటే ఇష్టం.. ఫిట్‌నెస్‌ అంటే ప్రాణం. కానీ వాటికోసం సౌకర్యవంతమైన దుస్తులు లేక ఇబ్బంది పడేది. ఆ సమస్య తనది మాత్రమే కాదు, భారత్‌లో అమ్మాయిలందరిదీ అని గుర్తించి.. పరిష్కారంగా ‘బ్లిస్‌క్లబ్‌’ను ప్రారంభించింది.

Published : 14 Oct 2022 00:47 IST

ఆమెకు ఆటలంటే ఇష్టం.. ఫిట్‌నెస్‌ అంటే ప్రాణం. కానీ వాటికోసం సౌకర్యవంతమైన దుస్తులు లేక ఇబ్బంది పడేది. ఆ సమస్య తనది మాత్రమే కాదు, భారత్‌లో అమ్మాయిలందరిదీ అని గుర్తించి.. పరిష్కారంగా ‘బ్లిస్‌క్లబ్‌’ను ప్రారంభించింది. ఈ వినూత్న ఆలోచనని రెండేళ్లలో రూ.100 కోట్ల టర్నోవర్‌ ఉన్న వ్యాపారంగా మలిచింది మీనూ.

వ్యాయామం కోసమే యాక్టివ్‌వేర్‌ అనుకుంటాం. కానీ మన దగ్గర మహిళలు వాటిని ఇంట్లో ఉన్నప్పుడూ, మార్కెట్‌కి వెళ్లేటపుడూ, పిల్లల్ని స్కూల్లో దింపి రావడానికి... ఇలా అనేక సందర్భాల్లో ధరిస్తారు. బయటకు వెళ్లేటప్పుడు వాళ్లకి ఫోన్‌, తాళం చెవి, ఇయర్‌ ఫోన్స్‌, డబ్బులు పెట్టుకోవడానికి అవసరమైన జేబులు కావాలి. ఇది గమనించిన మీనూ తన బ్లిస్‌క్లబ్‌ద్వారా.. నాలుగు జేబులతో ‘ది అల్టిమేట్‌ లెగ్గింగ్స్‌’ని 2020 డిసెంబరులో తెచ్చారు. స్వల్ప వ్యవధిలోనే డిమాండ్‌ ఏర్పడింది వాటికి. ఆపైన భారతీయ మహిళలకు సరిపోయేలా వివిధ సైజుల్లో ట్రాక్‌ ప్యాంట్స్‌, టాప్స్‌, టీషర్టులూ, స్పోర్ట్స్‌ బ్రా.. ఇలా 24 రకాల ఉత్పత్తులు తీసుకొచ్చారు. వీటి తయారీకి నాణ్యమైన క్లౌడ్‌సాఫ్ట్‌ ఫ్యాబ్రిక్‌ను ఉపయోగిస్తారు. వీరి ఉత్పత్తుల్లో నడుము దగ్గర తాళ్లతో తెచ్చిన లెగ్గింగ్స్‌కు డిమాండ్‌ ఎక్కువ.

కార్పొరేట్‌ కొలువుని వదిలి..

బెంగళూరుకు చెందిన మీనూ.. విప్రో, గోల్డ్‌మేన్‌ శాక్స్‌ లాంటి కంపెనీల్లో పనిచేశారు. హైదరాబాద్‌ ఐఎస్‌బీ నుంచి ఎంబీఏ చేసి.. హెచ్‌యూఎల్‌, ఫోన్‌ పే.. బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో కీలకపాత్ర పోషించారు. ఈమె అల్టిమేట్‌ ఫ్రిస్బీ ఆడేటప్పుడు అబ్బాయిల షార్ట్స్‌ వేసుకునే వారు. ‘మోకాలి వరకూ ఉండే షార్ట్స్‌ దొరికేవి కాదు. దాంతో అబ్బాయిల షార్ట్స్‌ వేసుకునేదాన్ని. విదేశాల్లో నాకు సరిపోయే యాక్టివ్‌వేర్‌ దొరికేది. అవి భారత్‌, చైనా, బంగ్లాదేశ్‌, శ్రీలంకలో తయారైనవే. కానీ మన మార్కెట్‌లో లభించవు. అప్పుడే భారతీయ అమ్మాయిలకూ యాక్టివ్‌వేర్‌ తేవాలనుకున్నా’ అంటూ ఇటువైపు రావడానికి కారణాన్ని వివరిస్తారు మీనూ. వీళ్ల మోడల్స్‌ ప్రొఫెషనల్స్‌ కాదు, సంస్థ వినియోగదారులే. నాజూగ్గానే కాకుండా లావుగా, సన్నగా ఉన్న వాళ్లూ వారిలో కనిపిస్తారు. వినియోగదారుల సంఘాన్ని ఏర్పాటు చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. ఫేస్‌ బుక్‌లో సంస్థ వినియోగదారులకో గ్రూప్‌ ఉంది. వాళ్లని ‘21 రోజుల ఛాలెంజ్‌’ పేరుతో వ్యాయామం దిశగా ప్రోత్సహిస్తుందీ సంస్థ. శిక్షణనీ ఇస్తుంది. ‘మొదటి ఉత్పత్తి రావడానికి ముందే కమ్యూనిటీ క్లబ్‌ని ఏర్పాటుచేశాం. కొవిడ్‌ సమయంలో మూడువేల మందితో ఆన్‌లైన్‌ లైవ్‌ యోగా చేయించి లిమ్కాబుక్‌లో చోటు సంపాదించాం. వీళ్లకి వాట్సాప్‌ గ్రూప్‌లూ ఉన్నాయి’ అంటారు మీనూ. ఇన్‌స్టాలో ఈ సంస్థకి 1.6 లక్షల ఫాలోయర్లున్నారు. యాప్‌నీ తెచ్చి షాపింగ్‌తోపాటు ఫిట్‌నెస్‌ విభాగంలో సేవల్ని అందించాలనుకుంటున్నారు మీనూ. ఈ మేలో రూ.130 కోట్ల పెట్టుబడిని పొందిన ఈ సంస్థ వార్షిక టర్నోవర్‌ రూ.100కోట్లకు పైనే. ఉత్పత్తులు ఆన్‌లైన్లోనే దొరుకుతాయి. త్వరలో బెంగళూరులో దుకాణాన్ని తెరవనున్నారు. అత్యుత్తమ అంకుర సంస్థల్లో ఒకటిగా బ్లిస్‌క్లబ్‌ను గుర్తించింది లింక్డిన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్