సేంద్రియ గుడ్లతో... కోట్ల వ్యాపారం

గుడ్డు పోషకాహారమే కాదు...అన్ని వర్గాలకూ అందుబాటులో ఉండే చౌకైన ఆహారం కూడా. అయితే, ఇది కూడా కల్తీ బారిన పడుతోందని తెలిసి...ఆలోచనలో పడింది చండీగఢ్‌కి చెందిన నమితా సతీజ. దానికి పరిష్కారంగా తీసుకొచ్చిందే ‘బెటర్‌ ఎగ్స్‌’ స్టార్టప్‌.

Updated : 17 Oct 2022 08:12 IST

గుడ్డు పోషకాహారమే కాదు...అన్ని వర్గాలకూ అందుబాటులో ఉండే చౌకైన ఆహారం కూడా. అయితే, ఇది కూడా కల్తీ బారిన పడుతోందని తెలిసి...ఆలోచనలో పడింది చండీగఢ్‌కి చెందిన నమితా సతీజ. దానికి పరిష్కారంగా తీసుకొచ్చిందే ‘బెటర్‌ ఎగ్స్‌’ స్టార్టప్‌. యాంటీబయోటిక్‌, హార్మోన్‌ఫ్రీ గుడ్ల ఉత్పత్తితో ఏడాదిలోనే రూ.5 కోట్లు వార్షికాదాయాన్నిఅందుకుంటోంది.

ప్రొటీన్లు పుష్కలంగా ఉండాల్సిన గుడ్డు.. కల్తీకి గురైతే...లాభం కంటే నష్టం ఎక్కువ. మార్కెట్లో దొరికే గుడ్లు కల్తీవో, నిల్వవో...  వినియోగించేవరకూ గుర్తించలేరు. ఆ విషయమే తనను ఆలోచింపజేసింది అంటోంది నమిత. ‘కొవిడ్‌వల్ల నష్టపోయిన వ్యాపారాలను గుర్తించి వాటికి చేయూతనివ్వడానికి ప్లాఫ్‌ అనే స్టార్టప్‌ని ప్రారంభించా. అందులో భాగంగానే ఓ సారి చండీగఢ్‌కి 75 కిలోమీటర్ల దూరంలోని ఛమ్‌కౌర్‌సాహిబ్‌లో ఉన్న కోళ్లఫారాలకు వెళ్లా. అప్పుడే ఈ కల్తీ గుడ్ల ప్రస్తావన వచ్చింది. ఆసక్తిగా అనిపించి సేంద్రియ పద్ధతిలో పెరిగే కోళ్ల గురించి తెలిసిన వైద్యులనూ, ఆ రంగంలో పనిచేస్తున్న వారితో మాట్లాడి ఓ నివేదిక తయారు చేశా. ఈ సారి నిపుణుల సాయంతో ప్రయోగాత్మకంగా కొన్ని కోళ్లకు పూర్తిగా ఉసిరి, పసుపు, బీట్‌రూట్‌ వంటి వాటితో కూడిన సేంద్రియ ఆహారాన్ని ఇచ్చా. అవి పెట్టిన గుడ్లను పరీక్షించి నిపుణుల సాయంతో కొందరు వైద్యుల వద్దకు వెళ్లి జీర్ణాశయ సమస్యలతో బాధ పడేవారికి అందించాం. అవి సత్ఫలితాలనివ్వడంతో సేంద్రియ కోడిగుడ్లతో వ్యాపారం చేయాలనుకున్నా’ అని చెబుతోంది నమిత.

రంగుల గుడ్లు...

స్టార్టప్‌ పెట్టడానికి ముందు ఆర్గానిక్‌ కేఫ్స్‌కెళ్లి, అక్కడ ఆర్గానిక్‌ ఎగ్స్‌ పేరుతో వచ్చే గుడ్లను నమిత పరిశీలించేది. నారింజవర్ణంలో ఉండే వాటికి ఆ రంగెలా వస్తుందో తెలుసుకోవాలనుకుంది. ‘బీట్‌రూట్‌, క్యాప్సికం కలిపి కోళ్లకిస్తే, పసుపు రంగు గుడ్లు పెట్టేవి. ఆర్గానిక్‌ పేరుతో నారింజరంగు గుడ్లు విక్రయించడంలో కృత్రిమవర్ణాలు కలుపుతున్నట్లు అనిపించింది. సేంద్రియ ఆహారాన్ని కోళ్లకు అందించి, వాటి గుడ్లు అందరికీ చేర్చాలనుకున్నా. మావారితో కలిసి 2020లో ‘బెటర్‌ ఎగ్స్‌’ పేరుతో సంస్థను ప్రారంభించా. మా ఫారంలో కోడి గుడ్లను అవుట్‌లెట్స్‌కు తీసుకెళ్లి, వాటి ప్రయోజనాలను చెప్పేదాన్ని. యాంటీబయోటిక్‌, హార్మోన్‌ ఫ్రీఅని చెబుతుంటే ఆశ్చర్యపడేవారు. కోడిగుడ్లు కొనమంటోందని వింతగా చూసేవారు. ప్రయోజనాలు తెలుసుకుని క్రమంగా అందరూ కొనడం మొదలుపెట్టారు. అవుట్‌లెట్స్‌లో వీటి విక్రయాలు పెరిగాయి. ఏడాది తిరిగేసరికి లక్షలాదిమంది వినియోగదారులను చేరుకున్నాం. అలా 2021 చివరినాటికి రూ.5 కోట్లు వార్షికాదాయాన్ని పొందాం’ అని చెబుతోంది నమిత. కోళ్లఫారం నిర్వహణ, గుడ్లు విక్రయాల్లో మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్