ఈ అమ్మాయి వందల మందికి అమ్మ

బాల్య వివాహం అంటే చాలు... క్షణాల్లో అక్కడ వాలిపోతుంది... ఆ పెళ్లిని ఆపే వరకూ ఊరుకోదు. అనాథలు కనిపిస్తే తీసుకెళ్లి ఎక్కడో అక్కడ ఆశ్రయం కల్పిస్తుంది. కరోనాలో అందరూ భయంతో ఇళ్లలో కూర్చుంటే తను ఊళ్లన్నీ తిరుగుతూ.. వలంటీరుగా చేసింది... ఇవన్నీ 21 ఏళ్ల చంద్రలేఖ గురించి అంటే ఆశ్చర్యపోతారు.

Published : 31 Oct 2022 00:15 IST

బాల్య వివాహం అంటే చాలు... క్షణాల్లో అక్కడ వాలిపోతుంది... ఆ పెళ్లిని ఆపే వరకూ ఊరుకోదు. అనాథలు కనిపిస్తే తీసుకెళ్లి ఎక్కడో అక్కడ ఆశ్రయం కల్పిస్తుంది. కరోనాలో అందరూ భయంతో ఇళ్లలో కూర్చుంటే తను ఊళ్లన్నీ తిరుగుతూ.. వలంటీరుగా చేసింది... ఇవన్నీ 21 ఏళ్ల చంద్రలేఖ గురించి అంటే ఆశ్చర్యపోతారు. ఇంకా చాలా చేస్తున్న ఈ అమ్మాయి స్ఫూర్తి గాథ చదవండి...

ఓసారి సుబ్రమణ్యస్వామి ఆలయ ఉత్సవాలు చూడటానికి వెళ్లింది చంద్రలేఖ. అక్కడ రోడ్డు పక్కగా ఓ వృద్ధురాలు కనిపించింది. ఒళ్లంతా గాయాలు, మురికి దుస్తులతో భిక్షాటన చేస్తున్న ఆమెను చూసి కదిలిపోయింది. ఆహారాన్ని అందించింది. వివరాలు అడగ్గా, తన వాళ్లు గెంటేశారని కన్నీళ్లు పెట్టుకుందా పండు వృద్ధురాలు. వెంటనే పబ్లిక్‌ టాయ్‌లెట్‌లో ఆమెకు స్నానం చేయించింది. దుస్తులు మార్చింది. పోలీసుల సాయంతో వృద్ధాశ్రమానికి తరలించింది. అప్పటికి చంద్రకళ ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌’ మొదటి ఏడాది చదువుతోంది.

సేవ కోసం సంస్థను..

తమిళనాడు, ఉసిలంపట్టి సమీప గ్రామానికి చెందిన రైతు కుటుంబం చంద్రలేఖ వాళ్లది. కూడళ్లు, రైల్వేస్టేషన్‌, బస్టాండుల్లో అనాథలను చూసినప్పుడు, పోలీసులకు సమాచారాన్ని అందించేది. వారిని పునరావాసానికి పంపే వరకూ చూసుకునేది. ఇంట్లో ఇచ్చే పాకెట్‌ మనీతోనే ఇవన్నీ చేసేది. ‘నా పనుల్ని చూసి, మా కళాశాల ఆచార్యులు, సిబ్బంది, సహ విద్యార్థులూ చేయూత నిచ్చే వారు. 2020లో మదురైలోని తిరునగర్‌లో ‘గుయాస్‌ (గైడన్స్‌ ఆఫ్‌ యూత్‌ అండ్‌ అడోలెసెన్స్‌)’ సంస్థను ప్రారంభించా. ఇప్పటి దాకా వందల అనాథలను వృద్ధాశ్రమాలకు తరలించగలిగా. కొందరిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించాం. కుంగుబాటుకు గురై, కుటుంబీకుల వివరాలను చెప్పలేని వారిని ఆశ్రమాల్లోనే సంరక్షిస్తున్నాం. తీవ్ర అనారోగ్యానికి గురైనవారిని ఆసుపత్రుల్లో చేరుస్తున్నాం. శిశు భ్రూణ హత్యలు జరుగుతున్న ప్రాంతాల్లో అవగాహన కలిగిస్తున్నాం. కొన్నిసార్లు నవజాత శిశువును చెత్తకుప్పల్లో పడేస్తుంటారు. మా ఫోన్‌ నెంబరు తెలిసిన వారు సమాచారాన్నిస్తే, ఆ శిశువును రక్షించి పోలీసులకు అప్పగిస్తున్నాం. భిక్షాటన చేస్తున్న చిన్న పిల్లలను హోంలకు తరలిస్తున్నాం. బాల్య వివాహం సమాచారం రాగానే అక్కడకు వెళతాను. దాన్ని నిరోధించడానికి పోలీసుల సాయాన్ని తీసుకుంటా. ఆ తల్లిదండ్రులతో అమ్మాయిలకు చదువెంత ముఖ్యమో అవగాహన కలిగిస్తాను. అలా ఎన్నో బాల్య వివాహాలను ఆపగలిగాం. కొన్ని సార్లు వారి బంధువులు మమ్మల్ని బెదిరిస్తుంటారు... దాడులూ చేశారు. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ మా పని మేం చేస్తుంటాం. బాలికా విద్య ప్రాముఖ్యత గురించి చెప్పడానికి పాఠశాలలు, కాలేజీల్లో కార్యక్రమాలు చేపడుతున్నాం. పర్యావరణ కాలుష్యాన్ని నిరోధించడం కోసం, మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం’ అంటున్న చంద్రలేఖ సేవలు ఇప్పుడు మదురై సహా శివగంగ, తేని జిల్లాల్లోనూ విస్తరించాయి.


కొవిడ్‌లో ..

మదురైలో కొవిడ్‌ విజృంభించినప్పుడు  వలంటీరుగా సేవలందించింది. చుట్టుపక్కల గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి స్థానికులకు మాస్క్‌లు, శానిటైజర్‌ ఇతరత్రా సాయమూ అందించింది చంద్రలేఖ. ‘చిన్నప్పటి నుంచి స్వామి వివేకానంద, అబ్దుల్‌కలాం రచనలు నాకు స్ఫూర్తి. నా వల్ల ఇతరులకు అందిన సహాయాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆ రోజు తృప్తిగా నిద్రపోతుంటా... ఏ రోజైనా చేయలేకపోతే నాకు నిద్రపట్టదు’ అనే చంద్రకళ స్ఫూర్తిదాయకం కదూ...


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్