పల్లె అమ్మాయి ప్రధానిని మెప్పించింది

అప్పటిదాకా తన పేరు ఆ ఊరి వరకే పరిచితం. ప్రధాని మోదీ ప్రశంసతో దేశమంతా తెలిసింది. పెద్దగా చదివిందేమీ లేదు. గొప్ప వ్యాపారవేత్తా కాదు.. అయినా కూని దెహురి ప్రధానిని ఎలా మెప్పించగలిగింది?

Published : 04 Nov 2022 01:11 IST

అప్పటిదాకా తన పేరు ఆ ఊరి వరకే పరిచితం. ప్రధాని మోదీ ప్రశంసతో దేశమంతా తెలిసింది. పెద్దగా చదివిందేమీ లేదు. గొప్ప వ్యాపారవేత్తా కాదు.. అయినా కూని దెహురి ప్రధానిని ఎలా మెప్పించగలిగింది?

ఆరుగురు తోబుట్టువుల్లో చిన్నది కూని. తనకు 12 ఏళ్లు ఉన్నప్పుడు నాన్న చనిపోయాడు. ఆయన సంపాదనే వాళ్లకు జీవనాధారం. దీంతో ఒక్కపూట తిండికీ ఇబ్బంది అయ్యింది. అమ్మ పొలం పనులకు వెళ్లినా పూట గడవడం కష్టమయ్యేది. దీంతో కుటుంబానికి అండగా నిలవాలని చదువు మానేసి పనులకు వెళ్లడం మొదలు పెట్టింది. వీళ్లది ఒడిశాలోని కరదాపల్‌ అనే గ్రామం. ఓసారి వాళ్లక్క ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ పట్టు దారాలపై మనసు పారేసుకుంది. ఓ ప్రభుత్వ సంస్థ పట్టుదారాలు తీయడంపై శిక్షణిస్తోంటే చేరింది. నేర్చుకొని తమకు దగ్గర్లోని ఓ సంస్థలో పనిచేసేది. ఏ కుటుంబమైనా అభివృద్ధి చెందాలంటే మహిళ ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నది కూని నమ్మకం. నేర్చుకున్నది తనకొక్క దానికే పరిమితం కాకూడదని, చుట్టు పక్కల వారికీ నేర్పడం మొదలు పెట్టింది. పట్టుదారాలు తీయడమే కాదు.. వాటిని వస్త్రాలుగా నేసి అమ్మేది. మిగిలిన వారి ఉత్పత్తులనూ అమ్మించేది. అలా మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నందుకు 2019లో అప్పటి ఝార్ఖండ్‌ గవర్నర్‌ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం, లక్ష నగదునూ అందుకుంది. ఆ డబ్బుతో సొంతంగా శిక్షణ సంస్థనీ ఏర్పాటు చేసుకుంది. విద్యుత్తు యంత్రాల మీద దారాలు వడకడం త్వరగా అవుతుంది కానీ.. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. దానికి పరిష్కారం చూపి ప్రధాని ప్రశంసలు అందుకుంది 35 ఏళ్ల కూని.

‘తోటి మహిళలను వాళ్ల కాళ్లమీద వాళ్లను నిలదొక్కుకునేలా చేసి, ఆర్థిక భరోసా కల్పించాలనుకున్నా. అందుకే పట్టు గూళ్ల నుంచి యంత్రాలతో దారాలు తీయడం నేర్పిస్తూ వచ్చా. తర్వాత సోలార్‌ విద్యుత్‌తో కరెంటు బిల్లు ఆదా అవుతుందని దాన్ని నేర్పించడం మొదలు పెట్టా. 1000 మందికి పైగా శిక్షణిచ్చా. వాళ్లంతా స్వయం ఉపాధితో వారి జీవితాలను మెరుగు పరుచుకున్నారు. ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’లో అభినందించడం గర్వంగా ఉంది. సాధారణ పల్లెటూరి అమ్మాయిని. నా పేరు దేశమంతా తెలియడం ఆనందంగా ఉంది. రెండు నెలల క్రితమే నా శిక్షణ కేంద్రం ప్రారంభమైంది. ప్రస్తుతం 50 మందికి తర్ఫీదునిస్తున్నా. మరింత మందిని స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించడంతో పాటు మా స్థానిక వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా చేయడం లక్ష్య’మని చెబుతోంది. పెద్దగా చదువు కోకపోయినా ఉన్నత లక్ష్యాల దిశగా సాగుతోన్న తనను అభినందించాల్సిందేగా మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్