Updated : 09/11/2022 04:19 IST

ఊరి పేరే మార్చింది..

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా కులవివక్ష వెంటాడుతోందనడానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రాంతాలు, వీధుల పేర్లు ఒకటి. ఈ దురాచారంపై పోరాటం ప్రారంభించిందా అమ్మాయి. తొలి ఫలితాన్నీ సాధించింది తమిళనాడుకు చెందిన అనుసూయ.

సివిల్‌ ఇంజినీర్‌ అనుసూయ  శరవణముత్తు వాళ్లది అరియలూరు జిల్లా, అనందవాడిలోని ఇందిరానగర్‌. అక్కడ 100కు పైగా పేద కుటుంబాలకు 22 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇచ్చింది. అప్పట్లో ఈ ప్రాంతానికి ఇందిరానగర్‌ అని పేరు పెట్టారు. ఇక్కడి వారంతా ఆదిద్రావిడులు కావడంతో ఆ పేరుతో పిలిచే వారు. అది క్రమంగా రికార్డుల్లోకీ ఎక్కేసింది. ‘రేషన్‌, ఓటర్‌, ఆధార్‌ వంటి ధృవీకరణ పత్రాలన్నింటిలోనూ ‘ఆది ద్రావిడర్‌’ చిరునామా నమోదైంది. ఈ ప్రాంతం అనగానే తక్కువగా చూసేవారు. బడిలో కొందరు సహ విద్యార్థినుల వాళ్ల ఇళ్లలోకి మమ్మల్ని రానిచ్చే వారు కాదు. గుమ్మం వరకే మాకు అనుమతి ఉండేది. అలా వివక్షను ఎదుర్కొంటూ పెరిగాను. ఈ దురవస్థను తొలగించి, ఇందిరా నగర్‌గా పేరు మార్చడానికి పోరాటం మొదలుపెట్టా’ అని వివరించింది అనుసూయ. చాలా ప్రయత్నాలు విఫలం అయ్యాయి. చివరకు స్థానికుల సంతకాలూ సేకరించి ఈ ఆగస్టులో జిల్లా కలెక్టరు రమణ సరస్వతిని కలిసి తమ వ్యథను వివరించింది. ఫలితంగా జిల్లా యంత్రాంగం ఆ ప్రాంతం పేరును ఇందిరానగర్‌గా మార్చడానికి అనుమతినిచ్చింది. ఇప్పుడక్కడి వారంతా మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందని తనని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇప్పుడు తన దృష్టి రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా ప్రాంతాల పేర్లుండేలా చేయడం మీద సారించింది అనుసూయ. అక్కడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి