పర్యావరణంపై ప్రేమతో..

సొంతంగా ఏదైనా చేయాలి.. ఈతరం జపిస్తోన్న మంత్రమిది! ఈ అమ్మాయిలూ అంతే. అయితే పేరు, ప్రఖ్యాతులతోపాటు అది తోటివారికీ, పర్యావరణానికీ మేలు చేయాలన్నది వీళ్ల ఉద్దేశం. అందుకే కొందరు సేవగా ప్రయత్నిస్తోంటే మరికొందరు స్టార్టప్‌లతో సాధిస్తున్నారు. వాళ్లెవరో.. ఎంచుకున్న మార్గాలేంటో చదివేయండి.

Updated : 14 Nov 2022 07:37 IST

సొంతంగా ఏదైనా చేయాలి.. ఈతరం జపిస్తోన్న మంత్రమిది! ఈ అమ్మాయిలూ అంతే. అయితే పేరు, ప్రఖ్యాతులతోపాటు అది తోటివారికీ, పర్యావరణానికీ మేలు చేయాలన్నది వీళ్ల ఉద్దేశం. అందుకే కొందరు సేవగా ప్రయత్నిస్తోంటే మరికొందరు స్టార్టప్‌లతో సాధిస్తున్నారు. వాళ్లెవరో.. ఎంచుకున్న మార్గాలేంటో చదివేయండి.

మార్కెటింగ్‌ కాదని.. అర్పితా కలనురియా

‘జీరో వేస్ట్‌’ సూత్రాన్ని నమ్ముతుంది అర్పిత. ఈ విధానాన్ని అందరూ పాటిస్తే ప్రపంచవ్యాప్తంగా ఎంతో కాలుష్యం తగ్గుతుంది కదా అనుకుంది. ఈమెది ముంబయి. ఐఐఎం బెంగళూరు నుంచి ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లో పీజీ చేసింది. ఒక ప్రొడక్షన్‌ సంస్థలో చేరి, కొన్ని బాలీవుడ్‌ సినిమాలకు మార్కెటింగ్‌ చేసింది. తర్వాత ఎన్నోసంస్థల్లో మార్కెటింగ్‌ విభాగంలో ఉన్నత హోదాలను అందుకొంది. మొదట్నుంచీ ఏదైనా సొంతంగా చేయాలన్నది తన కల. దానికి పర్యావరణ హితాన్నీ జోడించాలనుకుని 2018లో ‘యాంపిల్‌ప్యాక్‌’ ప్రారంభించింది. ఇదో సస్టెయినబుల్‌ ప్యాకేజింగ్‌ సంస్థ. ఆహారం మొదలు ప్రతి దాని ప్యాకేజింగ్‌కి చాలావరకూ ప్లాస్టిక్‌నే వినియోగిస్తున్నారు. వీటిని తిరిగి ఉపయోగించడం దాదాపుగా అరుదు. ఫలితమే కాలుష్యం. దీన్ని అరికట్టాలని లోహ పాత్రలతో చేసిన, తిరిగి ఉపయోగించే ప్రత్యామ్నాయాలను రూపొందించింది. ఇందుకు ఏఐ, బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీలను వాడుతోంది. అందుబాటు ధరల్లోనే ఇస్తుండటంతో చాలా సంస్థలు తన సేవలు అందుకొంటున్నాయి. ప్లాస్టిక్‌ రహిత నగరాలను చూడటమే లక్ష్యమనే 40 ఏళ్ల అర్పిత నాస్కామ్‌ నుంచీ, కేంద్రప్రభుత్వం నుంచీ ఉత్తమ ఆంత్రప్రెన్యూర్‌ పురస్కారాలనూ అందుకుంది.


రెండు విధాలా సాయం.. క్రిస్టిన్‌ కగెత్సూ

‘ఏదైనా కొత్తగా ప్రయత్నించు..’ చిన్నతనం నుంచీ క్రిస్టిన్‌కి అమ్మ చెప్పే మాటిది. ఈ ప్రోత్సాహమే తనకు టెక్నాలజీపై ఆసక్తి పెంచింది. స్కూలు స్థాయిలోనే రోబోటిక్స్‌పై ప్రయోగాలు చేసింది. సామాజిక సేవా చేసేది. సస్టెయినబిలిటీతోపాటు స్టెమ్‌ కోర్సుల్లో అమ్మాయిల ప్రాధాన్యం అవసరమంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించేది. తను ఎంఐటీ నుంచి డిగ్రీ చేసింది. అమ్మాయిలకు కనీస అవసరాల్లో ఒకటైన శానిటరీ ప్యాడ్‌లు దొరకడమూ ఎంత కష్టమో గ్రహించాక దీనిపై పనిచేయాలనుకుంది. ప్లాస్టిక్‌తో తయారైన ఈ ప్యాడ్‌లు భూమిలో కలిసిపోవడానికి కొన్నేళ్లు పడుతుంది. ఈ రెంటికీ కలిపి పరిష్కారం కనుక్కోవాలనుకుంది. 2015లో అహ్మదాబాద్‌లో సహాధ్యాయులు తరుణ్‌ బోత్రా, గ్రేస్‌లతో కలిసి ‘సాథీ’ ప్రారంభించింది. స్థానిక మహిళలకు శిక్షణిచ్చి అరటి, వెదురు గుజ్జుతో నెలసరి ఉత్పత్తులు తయారు చేయించి ఆన్‌లైన్‌లో అమ్మేది. వెనుకబడిన ప్రాంతాల వారికి ఉచితంగా అందిస్తోంది. తన ప్రయత్నానికి 3ఎం యంగ్‌ ఇన్నొవేటర్‌, టైమ్‌ బెస్ట్‌ ఇన్నొవేషన్స్‌ 2019, విలేజ్‌ గ్లోబల్‌, ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30, ఆసియన్‌ సోషల్‌ ఇన్నొవేషన్‌ అవార్డు వంటి ఎెన్నో అవార్డులు, రివార్డులూ అందుకుంది 33 ఏళ్ల క్రిస్టిన్‌. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పోటీల్లో తన ఉత్పత్తులకు బహుమతులు సాధించింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్