చక్రాల కుర్చీతో... అందాల పోటీకి

ఆమె వెన్నెముక వంగి ఉంటుంది... కండరాల బలహీనత కాలు కదపనీయదు... శరీరం ఏ పనికీ సహకరించదు...అయినా అవేవీ తన సంకల్పాన్ని దెబ్బతీయలేదు.

Updated : 22 Nov 2022 05:18 IST

ఆమె వెన్నెముక వంగి ఉంటుంది... కండరాల బలహీనత కాలు కదపనీయదు... శరీరం ఏ పనికీ సహకరించదు...అయినా అవేవీ తన సంకల్పాన్ని దెబ్బతీయలేదు.ఉన్నతంగా చదివింది...ఉద్యోగాన్నీ సంపాదించింది.  అందమంటే...ఆత్మవిశ్వాసమే అని నిరూపిస్తోంది.  ‘మిస్‌ వీల్‌ ఛైర్‌ వరల్డ్‌ ఇండియా-2022’ సౌమ్యా ఠాకూర్‌ స్ఫూర్తి కథనమిది.

ఎక్సైజ్‌ అధికారిగా పదవీ విరమణ చేసిన రాజీందర్‌ సింగ్‌, సరితలకు లేకలేక కలిగిన సంతానం సౌమ్య. వీళ్లది చండీగఢ్‌. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ చిన్నారికి 11 నెలల వయసులో వెన్నెముక ఒక పక్కకు ఒంగి ఉండటాన్ని గుర్తించారు. క్రమంగా కాళ్ల కండరాలు బలహీనపడటం మొదలయ్యాయి. వైద్య పరీక్షల్లో లోకోమోటార్‌ వైకల్యం అన్నారు వైద్యులు. తన శరీర బరువును తానే మోసుకోలేకపోయేది. క్రమేపీ అడుగుతీసి అడుగువేయలేని స్థితికి చేరింది. అప్పటి నుంచి చక్రాల కుర్చీకి పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయినా... బాగా చదువుకోవాలి, అమ్మా నాన్నలకు భారం కాకూడదు, ఏదైనా సాధించాలి... ఈ మూడే తారక మంత్రాల్లా జపించేది. లక్ష్యాన్ని సాధించడానికి తపించేది.

చదువుకోవాలని..

ఎంత కష్టమైనా బడికి వెళ్లి తీరాలని నిర్ణయించుకుంది సౌమ్య. చదువుపైనే ధ్యాసపెట్టేది. అమ్మ సాయంతో కాలేజీలో చేరింది. డిగ్రీ పూర్తి చేయడం పెద్ద సవాలుగా మారినా తన సంకల్పం ముందు అదీ ఓడిపోయింది. ‘మొహాలీలో ఓ ప్రైవేటు సంస్థలో మానవ వనరుల విభాగంలో ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగా. చిన్నప్పటి నుంచి ప్రతి వారూ సానుభూతి చూపడం నాకు ఇష్టముండేది కాదు. చదువు, ఉద్యోగం లక్ష్యాలు నెరవేరాక అందాల పోటీల్లో విజేతగా నిలవాలని కలలు కనేదాన్ని. ఆ పోటీల్లో పాల్గొనడానికీ చాలా ఖర్చవుతుంది. అయినా నా లక్ష్యాన్ని వీడదలచుకోలేదు. కొన్ని ఎన్జీవోలు, ఫౌండేషన్లను సంప్రదించి నా కల చెప్పా. వారి ఆర్థిక సాయంతో పోటీకి సిద్ధమయ్యా. ఒక దశలో లక్షల రూపాయల అవసరం వచ్చింది. ప్రభుత్వాన్ని కూడా సాయం కోరా. అదృష్టవశాత్తూ అదీ దొరికింది. ఆ ఉత్సాహంతో ‘మిస్‌ వీల్‌ ఛైర్‌ వరల్డ్‌ ఇండియా 2022’ పోటీలో పాల్గొన్నా. అందులో విజేతగా మన దేశం తరఫున ‘మిస్‌ వీల్‌ ఛైర్‌ వరల్డ్‌ 2022’ పోటీలకు వెళ్లా. ఇటీవల మెక్సికోలో ఈ పోటీలు జరిగాయి. ఇందులో 30 దేశాలు పాల్గొన్నాయి. అక్కడ కిరీటం దక్కలేదు. కానీ, అక్కడి దాకా వెళ్లడం, టాప్‌ 5లో స్థానాన్ని సంపాదించడం విజయాలే కదా. కిరీటం కోసం మళ్లీ ప్రయత్నిస్తా’ అంటోంది సౌమ్య. అమ్మానాన్నలు, స్నేహితుల ప్రోత్సాహమే తనకు కొండంత అండ అంటోందీ ధీర.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్