ఒంటరి యాత్ర

ప్రయాణాలంటే ఆ అమ్మాయికి పిచ్చి. ఒంటరిగా చేయడమంటే ఇంకా సరదా! చేస్తూ వచ్చింది కూడా.

Updated : 25 Nov 2022 09:04 IST

22 ఏళ్ల అమ్మాయి

22 దేశాలు

25 వేల కి.మీ...

ప్రయాణాలంటే ఆ అమ్మాయికి పిచ్చి. ఒంటరిగా చేయడమంటే ఇంకా సరదా! చేస్తూ వచ్చింది కూడా. ఈసారి యాత్రకి ఏదైనా సందేశాన్నీ జోడిస్తే బాగుంటుంది కదా అనిపించింది. అంతే.. ‘అమ్మాయిలు ఏదైనా సాధించగలరు’ అని నిరూపించేలా సైకిల్‌ ప్రయాణం కట్టింది. అదీ 22 దేశాలకు! ఆ అమ్మాయెవరో.. తన ప్రయాణం కథేంటో.. చదివేయండి.

అరుణిమ.. బీకామ్‌ గ్రాడ్యుయేట్‌. చిన్నతనం నుంచే ప్రయాణాలంటే పిచ్చి. ఇది నాన్న నుంచి మొదలైందంటుందీ అమ్మాయి. ఆయన వృత్తిలో భాగంగానే కాకుండా.. సరదాగా కూడా ప్రయాణాలు చేసేవారు. ఆ ఫొటోలను చూసినప్పుడల్లా తనకూ అలా వెళ్లాలన్న కోరిక ఉండేది.. అయితే ఒంటరి ప్రయాణ ఆలోచన మాత్రం తనదే అంటుంది అరుణిమ. వీళ్లది కేరళ. చిన్నప్పుడు స్కూలుకు వ్యానులో వెళ్లేది. ‘ఓసారి అది వెళ్లిపోయింది. నేనేమో ఎలాగైనా స్కూలుకెళ్లాలి. లిఫ్ట్‌ అడిగేశా. ఒక అంకుల్‌ దింపేశారు. ఇలా వెళ్లానని తెలిసి ‘భయం వేయలేదా’ అనడిగింది అమ్మ. నాకు ఆయన ముఖం చూసినప్పుడు భయం వేయలేదు. అందుకే ఎక్కేశానని చెప్పా. తర్వాత బస్‌ ఎప్పుడు మిస్‌ అయినా భయపడలేదు’ అని నవ్వేస్తుందీ 23 ఏళ్ల అమ్మాయి.

ఖర్చు లేకుండా కోరుకున్న ప్రదేశానికి వెళ్లడం.. తనకు కొత్తగా తోచేది. ‘వివిధ ప్రదేశాలు చూడొచ్చని ఏమాత్రం సెలవు దొరికినా బంధువుల ఇంటికీ ఒక్కదాన్నే వెళ్లిపోయేదాన్ని. ‘అమ్మాయిని ఒంటరిగా ఎలా పంపిస్తార’ంటూ చాలామంది కోప్పడేవారు. నాన్న మాత్రం నన్ను, అన్నయ్యని నచ్చింది చేయండని ప్రోత్సహించేవారు. ఇంటర్‌లోనే పక్కరాష్ట్రాలకు వెళ్లడం ప్రారంభించా. వెళ్లిన తర్వాతే ఇంట్లో చెప్పిన సందర్భాలెన్నో! అంతా పాకెట్‌ మనీతోనే.. కాబట్టి.. వెంట గుడారం, లిఫ్ట్‌ అడుగుతూ వెళ్లడం అలవాటైంది. మన దేశమంతా ఇలాగే తిరిగేశా. నేపాల్‌, వియత్నాం, థాయ్‌లాండ్‌ వంటి దేశాలూ చుట్టొచ్చా’నని అనుభవాలు పంచుకుంటోంది.

సరదాగా తిరిగితే ఏముంటుంది? దేనికైనా ఓ అర్థముండాలిగా అని ఆలోచించింది అరుణిమ. ‘నాకు మేఘాలయ చాలా ఇష్టం. మళ్లీ మళ్లీ వెళ్లాలనిపిస్తుంది. అక్కడ బార్‌టెండర్‌ నుంచి మాంసం కోయడం వరకు ప్రతిదీ అమ్మాయిలు చేస్తారు. థాయ్‌లాండ్‌లోనూ అంతే! పురుషాధిక్యత కనిపించదు. అమ్మాయిలు ధైర్యంగా నచ్చింది చేస్తుంటారు. మన దగ్గర్లా జాగ్రత్త పేరుతో ఇంట్లోనే ఉంచడం లాంటివి ఉండవు. అప్పుడొచ్చిన ఆలోచనే 22 దేశాలను చుట్టిరావడం. నా తక్కువ ఖర్చు మంత్రాన్ని మరవలేదు. అందుకే సైకిల్‌ మీద ప్రారంభించా. కేరళ నుంచి ముంబయి సైకిల్‌ మీద వెళ్లి అక్కడి నుంచి ఒమన్‌ విమానంలో వెళ్లి.. అక్కడ్నుంచి నా పాతిక వేల కి.మీ. ప్రయాణం మొదలుపెడతా. రెండేళ్లు పడుతుందని అంచనా! కుదిరితే ఆఫ్రికా ఖండంలోని 54 దేశాలూ చుట్టాలనుంది’ అని చెబుతోంది. తన ప్రయాణాన్ని కేరళ క్రీడాశాఖా మంత్రి జెండా ఊపి మరీ ప్రారంభించారు.

ఒక్కదానికి భయం వేయదా? ‘ప్రయాణాల్లో ఎంతోమంది కలుస్తుంటారు. సాయం చేసేవారూ ఎక్కువే. ఓసారి ఓ లారీలో వెళుతున్నా.. మొదట బాగానే మాట్లాడాడు. తర్వాత తన బుద్ధి చూపించాడు. నేనూ పెప్పర్‌ స్ప్రేతో సమాధానం చెప్పా. ఇంకోసారీ ఇలాంటి సంఘటనే. రెండుసార్లు మాత్రమే ఇది ఎదుర్కొన్నా. వ్యక్తుల కళ్లను బట్టి వాళ్లను అంచనా వేస్తా. నా జాగ్రత్తలో నేనుంటా’నని ధైర్యంగా చెబుతోన్న అరుణిమ ప్రయాణం కోసమని ప్రత్యేకంగా సైకిల్‌ తీర్చిదిద్దించుకుంది. ఓ స్పాన్సర్‌ కూడా ఉన్నారు. చనిపోయేలోపు ప్రపంచాన్నంతా చుట్టేయడమే తన కోరిక అనే తను కొందరు అమ్మాయిలకైనా వాళ్లనుకున్నది ధైర్యంగా సాధించడంలో స్ఫూర్తిగా నిలవాలనుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్