గిన్నిస్‌కెక్కిందీ.. పిజ్జా గర్ల్‌

పిల్లలు పేచీ పెడితేనో, మనకు తినాలనిపిస్తేనో ఎప్పుడైనా తింటాం.

Published : 30 Nov 2022 00:43 IST

పిల్లలు పేచీ పెడితేనో, మనకు తినాలనిపిస్తేనో ఎప్పుడైనా తింటాం. ఈమెకు మాత్రం పిజ్జానే సర్వస్వం. దుస్తులు, యాక్సెసరీస్‌, ఫర్నిచర్‌, పుస్తకాలు... అంతేనా ఇంట్లో ప్రతి వస్తువునూ.. పిజ్జా డిజైన్‌లో చూసుకొని మురిసిపోతుంది. ఆ ప్రేమే తనకు గిన్నిస్‌ రికార్డ్స్‌లో స్థానాన్ని కల్పించింది. పిజ్జా గర్ల్‌ ‘టెల్నా కుప్పారి’ గురించి తెలుసుకొందాం.

టెల్నా ఇల్లంతా పిజ్జామయమే. ఏటా క్రిస్మస్‌కు మా ఇంటికి పిజ్జా డెలివరీ వచ్చేది. అలా చిన్నప్పటి నుంచి ఇదంటే ప్రేమ. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిజ్జా రకాలను తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. 2012లో ఓసారి న్యూజెర్సీ వెళ్లినప్పుడు పిజ్జా డిజైన్‌ చొక్కాలను చూసి మనసు పారేసుకుంది. అప్పటి నుంచి మొదలైందీ కలెక్షన్‌. ‘పిజ్జా డిజైన్‌ దుస్తులతో పిజ్జా తినడానికి వెళ్లినప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూడటం, అభినందించడం సంతోషాన్నిస్తుంది. యాక్సెసరీస్‌, చెప్పులు, బ్యాగులన్నీ ఇదే డిజైన్‌లో ఉండటంతో అందరూ పిజ్జా గర్ల్‌ అంటున్నారు’ అని చెప్పుకొస్తోందీమె.

ప్రసవాలకీ...

కాలిఫోర్నియాకు చెందిన టెల్నా అమెరికా రాకముందు అయిదారు దేశాల్లో ఉంది. ఇంగ్లీష్‌ టీచర్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌, హోటల్‌ సర్వర్‌, స్కాటిష్‌ దినపత్రిక కాలమిస్టు... ఇలా పలు ఉద్యోగాలు చేసింది. ఒక సంస్థలో రిసెప్షనిస్టుగా ఉన్నప్పుడు డొమెనిక్‌తో పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకొంది. బాబు గియాకోమో కడుపులో ఉండగా పిజ్జా అవుట్‌ఫిట్‌ ధరించి మరీ ప్రసవానికి ఆసుపత్రికి వెళ్లిందీమె. ‘పిజ్జా డిజైన్‌తో ఆసుపత్రి గదిని అలంకరింపజేశా. ఆ డిజైన్‌ దుప్పటిలోనే బాబును ఇంటికి తీసుకొచ్చాం. పాప కడుపులో ఉన్నప్పుడైతే, ఏడునెలల గర్భవతిగా మెటర్నటీ షూట్‌ పేరుతో పిజ్జా డ్రస్‌తో నూయార్క్‌లోని దుకాణాలన్నీ తిరిగేశా. అక్కడ అందరితో ఫొటోలు తీసుకొనే దాన్ని. మా దుస్తులు, నగలు, బొట్లు, చెప్పులు, మేకప్‌ కిట్‌, స్లీపింగ్‌ బ్యాగు, ఇంటి అలంకరణ, మా కుక్కపిల్ల దుస్తులు సహా సాస్‌, న్యాప్‌కిన్స్‌, దుప్పట్లు, వాల్‌హ్యాంగింగ్స్‌, పుస్తకాలు, పిల్లల బొమ్మలు, గేమ్స్‌, పజిల్స్‌, వీడియోలు వంటి వన్నీ పిజ్జా డిజైన్‌తోనే ఉంటాయి. పిజ్జాకు సంబంధించిన పుస్తకాలు నా దగ్గర 230 ఉన్నాయి. గేమ్స్‌ 15 రకాలున్నాయి. మొత్తం నావద్ద 669 వస్తువులుండటంతో ఇది ప్రపంచరికార్డుగా నమోదైంది. అలా గిన్నీస్‌బుక్‌కెక్కా’ అంటున్న 42 ఏళ్ల ఈ పిజ్జాగర్ల్‌ అభిరుచి వింతగా అనిపిస్తోందా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్