లాక్‌డౌన్‌లో లాభసాటి వ్యాపారం!

కొవిడ్‌ అందరిలో ఆరోగ్య స్పృహని పెంచింది. ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యమిచ్చే రియాకి మాత్రం అదో సమస్యలా మారింది.

Published : 02 Dec 2022 00:37 IST

కొవిడ్‌ అందరిలో ఆరోగ్య స్పృహని పెంచింది. ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యమిచ్చే రియాకి మాత్రం అదో సమస్యలా మారింది. బయటికి వెళ్లలేదు. జిమ్‌కి అసలే అవకాశం లేదు. ఆ సమయంలో తనకొచ్చిన ఆలోచన వ్యాపారవేత్తను చేసింది. అది ఏడాదిలోనే రూ.37 కోట్ల వ్యాపారమూ అయ్యింది.

2020.. లాక్‌డౌన్‌ విధించే నాటికి రియా నిహాల్‌ సింగ్‌కి పెళ్లై మూడు నెలలే. బయటకు వెళ్లడానికి వీల్లేకపోవడంతో భర్త రౌనక్‌ సింగ్‌తో కలిసి ఇంట్లోనే జిమ్‌ ఏర్పాటు చేసుకుందామనుకుంది. స్మార్ట్‌ జిమ్‌ పరికరాల కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేదు. తమలా వెదికే వారెందరో కదా అనుకున్నాక దీన్నే వ్యాపారంగా మలచుకోవాలనుకుంది.

యువతే.. టార్గెట్‌!

‘నేను, రౌనక్‌ అమెరికాలోనే చదువుకున్నాం. నేను ఎకనామిక్స్‌లో డిగ్రీ చదివి, ఓ పీఆర్‌ సంస్థలో నాలుగేళ్లు పనిచేశా. రౌనక్‌ వాళ్ల నాన్నది ఎలక్ట్రానిక్‌ పరికరాల వ్యాపారం. దాన్ని చూసుకోవడానికని మెకానికల్‌ ఇంజినీరింగ్‌ అయ్యాక ఎంబీఏ చేశాడు. మా పరిచయం అమెరికాలోనే. ఒకరకంగా ఫిట్‌నెస్‌పై ప్రేమే మమ్మల్ని దగ్గర చేసింది. 2020 జనవరిలో ఇలా పెళ్లయిందో లేదో లాక్‌డౌన్‌! విదేశాల్లోలా ఇక్కడ స్మార్ట్‌ ఎక్సర్‌సైజ్‌ పరికరాలు దొరకడం లేదని గుర్తించాక మేమే అందిస్తే బాగుంటుందనుకున్నాం. పరికరాల లభ్యత, తయారీ, ఇక్కడికి తెప్పించడం వీటన్నింటిపై పరిశోధన చేసి, వివిధ దేశాల సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. 2021 మేలో ‘ఫ్లెక్స్‌నెట్‌’ ప్రారంభించాం. గుడ్‌గావ్‌లో అయిదుగురితో ప్రారంభమైంది. ఒకేసారి అన్ని ఉత్పత్తులనీ చేర్చి వ్యాపారం చేయడం కంటే.. ఒక్కోదాన్ని పరిచయం చేసుకుంటూ వెళ్లడం నయమనిపించింది. యోగా మ్యాట్‌ల నుంచి డిజిటల్‌ సైకిల్‌ వరకూ ఇప్పటికే చాలా పరికరాలను అందుబాటులోకి తెచ్చాం. ఒక ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌నీ ఏర్పాటు చేశాం. ఆసక్తి ఉన్నవారు ఇక్కడ మా ఉత్పత్తుల్ని వాడి చూడొచ్చు. మొదట్నుంచీ మా టార్గెట్‌ యువతే. ఈ తరానికి ఏం కావాలన్నది మాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది? ఏదైనా ఆలోచన రాగానే ఇతరులెలా ఆలోచిస్తున్నారన్నదీ గమనించాకే ముందడుగు వేస్తున్నాం. అదే మేం దూసుకెళ్లడానికి కారణమవుతోంది. ఏడాదిలో రూ.37 కోట్ల వ్యాపారానికి అదే కారణం’ అని చెబుతోంది రియా.

తను ఆన్‌లైన్‌ అమ్మకాలనీ ప్రారంభించింది. యాప్‌ రూపంలో వర్చువల్‌ ట్రైనింగ్‌, కస్టమర్లు తమ పురోగతిని పరిశీలించుకొనే సౌకర్యాలనూ ఉంచడంతో ఎక్కువ మంది వీళ్ల ఉత్పత్తులకు ఆకర్షితులవుతున్నారు. ప్రణాళికబద్ధంగా పనిచేస్తూ వినియోగదారులను అర్థం చేసుకుంటే చాలు ఎవరైనా రాణించొచ్చనే రియా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి తమ వ్యాపారం రూ.100 కోట్లకు చేరుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్