పరుగుల చిరుత క్రికెటర్‌ అయ్యింది...

పరుగుల రాణి అవుదామనుకుంది. అనుకోకుండా క్రికెట్‌లోకొచ్చింది. ఫాస్ట్‌బౌలర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా ఎదిగింది. ఆంధ్రా జట్టు.. ఆపై రైల్వేస్‌లో రాణించి ఇప్పుడు ఏకంగా భారత సీనియర్‌ జట్టులో స్థానం సంపాదించింది.. కేశవరాజు అంజలి శర్వాణి.

Updated : 03 Dec 2022 09:16 IST

పరుగుల రాణి అవుదామనుకుంది. అనుకోకుండా క్రికెట్‌లోకొచ్చింది. ఫాస్ట్‌బౌలర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా ఎదిగింది. ఆంధ్రా జట్టు.. ఆపై రైల్వేస్‌లో రాణించి ఇప్పుడు ఏకంగా భారత సీనియర్‌ జట్టులో స్థానం సంపాదించింది.. కేశవరాజు అంజలి శర్వాణి. ఈనెల ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20లో సత్తా చాటుతానంటోన్న ఈ ఆదోని అమ్మాయి వసుంధరతో తన ప్రయాణాన్ని పంచుకుందిలా..

నాకు పరుగంటే ఇష్టం.. పోటీల్లోనూ పాల్గొన్నా. ఇంటి దగ్గర, స్కూల్లో సరదాగా క్రికెట్‌ ఆడే దాన్ని. నా ఆటతీరు చూసి, మా కోచ్‌.. క్రికెటర్‌ని చేయమని నాన్నకి సలహా ఇచ్చారు. నాన్న కేవీ రమణారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ అనూరాధ. తమ్ముడు విక్రమాదిత్య. తొమ్మిదో తరగతిలో ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ప్రారంభించా. ఏడాదిలోనే ఆంధ్ర జట్టుకు ఎంపికవ్వడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. 2015 అండర్‌-19 ఆంధ్రా జట్టు నా కెప్టెన్సీలో ఆల్‌ఇండియా ఛాంపియన్‌షిప్‌ గెలుచుకోవడం మరిచిపోలేను. తర్వాత బౌలర్‌గా రాణించి 2016లో ఏపీ సీనియర్స్‌ జట్టు ఫైనల్స్‌కు చేరడంలో పాత్ర పోషించా. భారత్‌-ఎ తరఫునా విదేశీ మ్యాచ్‌లు ఆడా. నేను ఆల్‌రౌండర్‌ని. కొవిడ్‌ తర్వాత రైల్వేస్‌కు ఎంపికయ్యా. 17 ట్రోఫీలు గెలిచా. ఈ ఏడాది సీనియర్‌ టీ20 ట్రోఫీలో 10 మ్యాచ్‌లో 17 వికెట్లు తీశా. ఈ రెండు నెలల వ్యవధిలో 20 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు పడగొట్టా. అలా దేశంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అగ్రస్థానంలో నిలిచా. దీనికి తోడు ఏళ్లుగా నిలకడగా రాణిస్తుండటంతో భారత జట్టులో స్థానం దక్కింది.

వాళ్ల ప్రోత్సాహంతోనే...

మొదట్నుంచీ ఇంట్లోవాళ్ల ప్రోత్సాహముండేది. అదీకాక పదోతరగతిలో మంచి మార్కులొచ్చాయి. ఇంటర్‌లో మాత్రం చాలా వెనకబడ్డా. ఒక సబ్జెక్టు ఫెయిలయ్యా కూడా. అప్పుడు మాత్రం చాలామంది విమర్శించారు. ‘అమ్మాయిలకు చదువే ముఖ్యం. ఆటలంటూ తిరిగితే ఉద్యోగం వస్తుందా? భవిష్యత్తు పాడవుతుంది.. ఇకనైనా చదువు మీద దృష్టి పెట్టించు’ అని సలహాలిచ్చారు నాన్నకి. ఒకానొక దశలో అమ్మానాన్నా కూడా అవకాశాలు రాకపోతే నా భవిష్యత్తేమవుతుందోనని కంగారుపడ్డారు. అప్పుడు చూస్తూ ఉండండి.. ఉద్యోగమే నన్ను వెతుక్కొంటూ వస్తుందని ధైర్యం చెప్పా. చెప్పినట్లుగానే రైల్వే ఉద్యోగమొచ్చింది. ఇటీవలే దూరవిద్య ద్వారా బీఏ పూర్తిచేశా. రోజంతా సాధనతోనే సరిపోతుంది. పరీక్షలప్పుడే విరామం తీసుకొని చదువుతా. రైల్వేస్‌కి ఎంపికయ్యే నాటికి 22 ఏళ్లు. అప్పటికి నేనే చిన్నదాన్ని. అందరూ సీనియర్లే. అవకాశమొస్తుందా అనుకునేదాన్ని. మొదటి ఏడాది కాస్త ఇబ్బందీ పడ్డా. తర్వాత సీనియర్లతో పోటీపడే స్థాయికి నన్ను నేను మెరుగు పరచుకున్నా.

ఈ ఏడాది రకరకాల పోటీల్లో నా ఆటతీరు చూసుకున్నాక జాతీయ జట్టుకి ఎంపికవుతానన్న నమ్మకం ఏర్పడింది. ఇప్పట్నుంచి మరొకెత్తు. రైల్వేస్‌ అంటే పెద్దగా తెలియదేమో కానీ.. ఇప్పుడు దేశమంతా మా వెనుక ఉంటుంది.. కాబట్టి, ఇంకా మెరుగ్గా ఆడాలి. అలాగని ఒత్తిడిగా ఏం భావించట్లేదు. హర్మన్‌, స్మృతి, దీప్తి శర్మ.. వీళ్లంతా తెలుసు. రైల్వేస్‌లో వీళ్లతో పోటీపడ్డా. ఇప్పుడు కలిసి ఆడతాం... అంతే తేడా! ఇప్పటి దాకా నా తాపత్రయం తుది జట్టులో స్థానం కోసమే. ఇప్పుడు ఒత్తిడి అనుకుంటే ముందుకెళ్లలేను. ఈ విషయంలో మిథాలీరాజ్‌ నాకు ఆదర్శం. తన సారథ్యంలోనూ ఆడా. తనలా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తూ ప్రశాంత చిత్తంతో ముందుకెళ్లాలి. భారత జట్టులో రాణిస్తూ.. గెలుపులో నాదైన ముద్ర వేయడం లక్ష్యం.


ఏడాది పొడవునా సాధనే! ఏమాత్రం ఖాళీ దొరికినా నిద్రపోతా. సమయం మిగిలితే షాపింగ్‌, పాటలు వినడం.. ఇలా అప్పటికప్పుడు ఏం చేయాలనిపిస్తే అది చేస్తా. బాగా అలసిపోయా.. ఆటవిడుపు కావాలనిపిస్తే.. నచ్చిన ప్రదేశాలకు ప్రయాణం కట్టేస్తా.


పరుగుతో పాటు లాంగ్‌జంప్‌, ట్రిపుల్‌ జంప్‌ పోటీల్లో 40 పతకాలూ సాధించా. అండర్‌-16 నేషనల్‌ ప్లేయర్‌ని. జాతీయ పోటీల్లోనూ పాల్గొన్నా.


ఆటల్లో రాణించాలంటే అదృష్టం ఉండాలంటారు చాలా మంది. నేను మాత్రం ఎంత కష్టపడితే అంత అదృష్టం వెతుక్కొంటూ వస్తుందని చెబుతా. కాబట్టి, ఎంచుకున్నదేదైనా దాంట్లో ఎంతైనా  కష్టపడటానికి సిద్ధపడండి. శ్రమకి, విజయానికీ ఆడ, మగా తేడాలుండవు.


- యడ్లపాటి బసవ సురేంద్ర, కర్నూలు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్