కార్టూన్‌ రంగంలో రారాణి

కార్టూన్‌ అనగానే ప్రతిఒక్కరికీ ఫేవరెట్‌ ఏదో గుర్తొచ్చేస్తుంది. బాల్యస్మృతుల్లో వాటికీ ప్రత్యేక స్థానం మరి. హన్సాకీ అంతే! ఆర్థిక కారణాల వల్ల వైద్యురాలవ్వాలన్న కల నెరవేరలేదు. దీంతో ఆసక్తిని ఇటు మళ్లించారు. మంచి ఉద్యోగాన్ని కాదని సొంత సంస్థని ప్రారంభించారు.

Updated : 05 Dec 2022 03:51 IST

కార్టూన్‌ అనగానే ప్రతిఒక్కరికీ ఫేవరెట్‌ ఏదో గుర్తొచ్చేస్తుంది. బాల్యస్మృతుల్లో వాటికీ ప్రత్యేక స్థానం మరి. హన్సాకీ అంతే! ఆర్థిక కారణాల వల్ల వైద్యురాలవ్వాలన్న కల నెరవేరలేదు. దీంతో ఆసక్తిని ఇటు మళ్లించారు. మంచి ఉద్యోగాన్ని కాదని సొంత సంస్థని ప్రారంభించారు. ఓ దశలో కుంగుబాటుకీ గురైన ఆవిడ.. దేశంలో యానిమేషన్‌ రంగంలో ప్రముఖుల్లో ఒకరిగా ఎలా ఎదిగారు?

తెల్లకోటు ధరించి, అందరికీ వైద్యం చేయాలి, గొప్ప కార్డియాలజిస్టు అవ్వాలన్నది హన్సా మోండల్‌ కల. కానీ ఆర్థిక పరిస్థితి సహకరించక డిగ్రీలో చేరాల్సి వచ్చింది. వైద్యరంగంపై మక్కువతో దానిలోనే ప్రభుత్వ విభాగంలో ఉద్యోగం సంపాదించారు. వీళ్లది కోల్‌కతా. అందరిలాగే ఆవిడకీ కార్టూన్లంటే ఇష్టం. హాస్యం జోడిస్తూనే సందేశం ఇవ్వడం వీటి పరమార్థం. మనకూ ఇలాంటి కథలు బోలెడు. వాటినీ అందుబాటులోకి తెస్తే బోలెడంత విజ్ఞానం కదా అనుకున్నారు. మంచి జీతమొచ్చే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి డ్రాయింగ్‌, యానిమేషన్‌ కోర్సుల్లో చేరారు. కార్టూన్‌ స్టోరీ బోర్డు, డైరెక్షన్‌ వంటివెన్నో నేర్చుకున్నారు. అక్కడే పరిచయమైన సౌరవ్‌తో కలిసి ‘సాఫ్టూన్స్‌’ ప్రారంభించారు.

ఓ చిన్న గదిలో రెండు కంప్యూటర్లతో హౌరాలో ప్రారంభమైందీ సంస్థ. భారతీయ స్థానికతకు హాస్యం జోడిస్తూ 2001లో తొలి యానిమేటెడ్‌ సిరీస్‌ను తీసుకొచ్చారు. రెండేళ్లలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. వాటిని సీడీలు, వీసీడీలు, కొన్ని గేమ్‌ల రూపంలోనూ తీసుకొచ్చారు. కొన్ని టీవీ సంస్థలు ఒప్పందం చేసుకొని మరీ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాయి. మొదట బెంగాలీ భాషలోనే ప్రారంభమైనా తర్వాత హిందీలోనూ తీసుకొచ్చారు.

‘పదేళ్లపాటు మార్కెట్‌ని ఏలామని చెప్పొచ్చు. ఇంటర్నెట్‌ చొచ్చుకురావడంతో మా మార్కెట్‌ పడిపోయింది. సంస్థను మూసేయాల్సిన పరిస్థితి. ప్రాణప్రదంగా తీసుకొచ్చిన సంస్థ కళ్లముందే మూతపడుతోంటే డిప్రెషన్‌కి గురయ్యా. అప్పుడే కార్టూన్‌ని సోషల్‌ మీడియాకి అనుసంధానం చేయాలన్న ఆలోచన వచ్చింది. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ల్లోకి తీసుకొచ్చా. ఇక వెనుదిరగాల్సిన అవసరం లేకపోయింది. ప్రతి వీడియోకీ కోట్ల వీక్షణలు. ఇప్పుడు ఓటీటీ, యాప్‌ రూపంలోనూ తీసుకొచ్చా’మని చెబుతోన్న హన్సా సాఫ్టూన్‌కి సీఓఓ. స్థానిక టీవీ చానెళ్లతోనే కాదు.. డిస్నీతోనూ చేసే అవకాశాన్నీ దక్కించుకున్నారు. పాపోమీటర్‌, నసీరుద్దీన్‌ షా, పంచతంత్ర, హనీ-బనీ వంటివి తెలుగు, తమిళం సహా స్థానిక భాషలన్నింటిలోకీ అనువాదమయ్యాయి. సాఫ్టూన్‌ యూట్యూబ్‌ ఛానెళ్లకి కనీసం 30 లక్షల సబ్‌స్క్రైబర్లున్నారు. ఈక్రమంలోనే ఎన్నో అవార్డులూ లభించాయి. దేశంలో అగ్రస్థాయి యానిమేటర్లలో ఈమే ఒకరు. ‘నచ్చినదాంట్లో ఉన్నత స్థాయికి ఎదగాలన్న కోరిక ఉండాలి. దానికోసం ఎంత కష్టమైనా పడాలి, నూతన పోకడలు తెలుసుకుంటూ సాగాలి. అప్పుడే ఎవరైనా సాధించగలర’ంటారు హన్సా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్