300 మందికి పని ఇవ్వగలుగుతున్నా

చిన్నవయసులోనే పెళ్లి... అయినా చదువాపలేదు. స్వయం ఉపాధి కోసం వేసిన అడుగులో తడబాట్లు. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూనే పోటీ ఎక్కువగా ఉండే లెదర్‌ బ్యాగుల తయారీలో అడుగుపెట్టారు. అనారోగ్యం ఎదురైనా లెక్క చేయకుండా ఆ సంస్థని విజయాల బాట పట్టించారు 32 ఏళ్ల ఝాన్సీ...

Updated : 09 Dec 2022 07:25 IST

చిన్నవయసులోనే పెళ్లి... అయినా చదువాపలేదు. స్వయం ఉపాధి కోసం వేసిన అడుగులో తడబాట్లు. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూనే పోటీ ఎక్కువగా ఉండే లెదర్‌ బ్యాగుల తయారీలో అడుగుపెట్టారు. అనారోగ్యం ఎదురైనా లెక్క చేయకుండా ఆ సంస్థని విజయాల బాట పట్టించారు 32 ఏళ్ల ఝాన్సీ...

మాది యాదాద్రి జిల్లా, ముషిపట్ల. నాకో చెల్లి, తమ్ముడు. అమ్మానాన్నలు సేద్యంలో నష్టపోయి, మాకోసం హైదరాబాద్‌లో బిస్కెట్ల ఫ్యాక్టరీలో కూలీలుగా చేరారు. నేను డిగ్రీ మొదటేడాదిలో ఉన్నప్పుడే నరేందర్‌తో పెళ్లైంది. బాగా చదువుకోవాలి, వ్యాపారవేత్తనవ్వాలి.. ఇవీ నా కలలు. అవి మా వారి ప్రోత్సాహంతో తీరాయి. ఎంబీఏ చేశాక పాప పుట్టింది. తనని చూసుకుంటూనే పిల్లలకు ట్యూషన్లు చెప్పేదాన్ని. జౌళి, కాటన్‌ బ్యాగుల తయారీలో ప్రభుత్వం శిక్షణ ఇస్తుందని తెలిసి.. మూడు నెలల కోర్సు పూర్తి చేశా.

పదివేల పెట్టుబడితో..

శిక్షణ తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్‌లో స్టాల్‌ పెట్టుకొనే అవకాశం దక్కింది. ఇందుకోసం రూ.10వేల పెట్టుబడితో.. 10 మందితో 300 బ్యాగులు చేయించా. అవన్నీ చకచకా అమ్ముడుపోయాయి. కొత్త ఆర్డర్లూ వచ్చాయి. 1000 బ్యాగులు వరకూ వేగంగానే అమ్ముడుపోయినా.. ఆ తర్వాత మార్కెటింగ్‌ ఎలా చేయాలో నాకు అర్థంకాలేదు. దాంతో జ్యూట్‌బోర్డ్‌ను సంప్రదించా. స్థానిక మహిళా సంఘాలు, గ్రామీణ ఉపాధి సంస్థలను కలవమని అక్కడిచ్చిన సూచన మేరకు.. ఊహించని అవకాశం దొరికింది. ఒక సంస్థ నుంచి 3,500 క్లాత్‌బ్యాగులకు ఆర్డరు వచ్చింది. నా బృందంతోపాటు చౌటుపల్లి, యాదాద్రి జిల్లాల్లోని స్వయం సహాయక బృందాల సభ్యులు 200 మందికి పని కల్పించా. క్రమేపీ ఆర్డర్లు పెరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలకు ల్యాప్‌టాప్‌ బ్యాగులు, ఫైల్స్‌ వంటివి వేలల్లో చేసిచ్చాం. సుమారు నాలుగు వందల మంది మహిళలకు నిరంతరం పని ఇవ్వగలిగాను. నెలకు 7, 8 లక్షల రూపాయల ఉత్పత్తులనూ చేసేవాళ్లం. వ్యాపారం లాభాల్లో పడింది.

కరోనా ప్రభావం..

2019లో లెదర్‌ బ్యాగులు చేయాలనే ఆలోచన వచ్చింది. పరిశోధన మొదలుపెట్టా. కోల్‌కతా వెళ్లి లెదర్‌ మెటీరియల్‌ అందించే వ్యాపారులను కలిశా. ఫ్యాక్టరీలూ తిరిగా. తర్వాత మా యంత్రాలను తోలు ఉత్పత్తుల తయారీకి వీలుగా మార్చాం. అయిదారుగురికి శిక్షణనిచ్చి తొలి విడతగా ఝాన్సీ లెదర్స్‌ పేరుతో 100 బ్యాగులు చేశాం. దిల్లీలో ఎగ్జిబిషన్‌కు వెళ్లితే వెంటనే అమ్ముడయ్యాయి. వందల బ్యాగులకు ఆర్డర్లు వచ్చాయి. నాకు నమ్మకం వచ్చింది. మరో ప్రదర్శన కోసం 300 బ్యాగులు కుట్టాం. ఇంతలో కరోనా లాక్‌డౌన్‌. లెదర్‌, జ్యూట్‌, కాటన్‌ బ్యాగుల స్టాక్‌ పోగుపడిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అందరికీ ఉపాధి కరవైంది. ఆలోపు  ఆన్‌లైన్‌లో మార్కెటింగ్‌ మెలకువల్లో శిక్షణ తీసుకొన్నా. లాక్‌డౌన్‌ ముగిశాక... అంటే ఓ ఏడాది తర్వాత అసోంలో ప్రదర్శనకు వెళ్లా. అక్కడ స్టాకంతా అమ్ముడైపోయింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు వైద్యశాలలకు వేల ల్యాప్‌ టాప్‌ బ్యాగులు, ఫైల్స్‌, బెల్టులు తదితరాలు చేసిస్తున్నాం. సీజన్లో నెలకు కనీసం రూ.10 లక్షల వ్యాపారం చేయగలుగుతున్నా. నా బృందంలో 50 మంది పని చేస్తున్నారు. అవసరాన్ని బట్టి 300 మంది దాకా పని ఇవ్వగలుగుతున్నా. స్వయం సహాయక బృందాల సభ్యులకు బ్యాగుల తయారీలో శిక్షణనిస్తున్నా.  

అనారోగ్యం పాలయ్యా..

ఒకసారి 600 బ్యాగుల ఆర్డరు దొరికినా వాటిని కుట్టడానికి తగినంత మంది మనుషులు దొరకలేదు. రెండ్రోజుల సమయమే మిగిలింది. నేనొక్కరినే 48 గంటలు ఏకబిగిన 100 బ్యాగులు కుట్టా. ఇలాంటప్పుడే మనలో ఎంత సామర్థ్యం ఉందో తెలుస్తుంది. ఇలా నిద్రాహారాల్లేకుండా చేసిన సందర్భాలెన్నో. ఒకసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యా. కోలుకోవడానికి నెలలు పట్టింది. పాపను బాగా చదివించాలి, నాలాంటి వాళ్లను మరింత మందిని తయారు చేయాలన్నవి నా లక్ష్యాలు. మనం ఎదగాలంటే... బృందాన్ని నడిపించగలిగే సామర్థ్యాన్ని సాధించాలి. సమస్యలెన్నెదురైనా ధైర్యంగా, సానుకూలంగా ఉంటే విజయం మనదే.


వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911 కు వాట్సప్‌, టెలిగ్రాం, సిగ్నల్‌ల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్