సైగలు నేర్పి.. లక్షలు గెలిచి!

నాన్న వేలు పట్టుకుని అడుగులు వేయిస్తుంటే.. అమ్మ చిట్టిపొట్టి పలుకుల్ని ముద్దుముద్దుగా నేర్పించే బాల్యం గురించి ఆమెకు తెలియదు.

Updated : 20 Dec 2022 03:29 IST

నాన్న వేలు పట్టుకుని అడుగులు వేయిస్తుంటే.. అమ్మ చిట్టిపొట్టి పలుకుల్ని ముద్దుముద్దుగా నేర్పించే బాల్యం గురించి ఆమెకు తెలియదు. మాటలురాని అమ్మానాన్నల దగ్గర సైగ భాషని నేర్చుకున్న అజీమా థాంజీ ఆ కష్టం మరోబిడ్డకు రాకూడదనుకుంది. ఈ కృషిలో భాగంగా ఆమె ప్రారంభించిన అంకుర సంస్థ టైగ్లోబల్‌ పోటీల్లో విజేతగా రూ.41 లక్షల్ని గెలిచింది. ఈ సందర్భంగా వసుంధరతో తన గాథను పంచుకుందీ 31 ఏళ్ల పాకిస్థానీ అమ్మాయి...

మా అమ్మానాన్నలు బధిరులు. దాంతో నా ముద్దు మాటలు వాళ్లు వినలేకపోయేవారు సరికదా.. వాళ్లకి నేనే నేర్పాల్సిన పరిస్థితి. నేనూ వాళ్ల సైగల భాషని నెమ్మదిగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టా. బడిలో పేరెంట్‌ మీటింగ్‌ జరిగితే టీచర్‌కు, అమ్మకు మధ్య దుబాసీగా ఉండేదాన్ని. ఓసారి అత్యవసరంగా బంధువులింటికి అమ్మతోపాటు వెళ్లాలి. కానీ పరీక్షల వల్ల వెళ్లలేకపోయా. అప్పుడు అమ్మకు చాలా ఇబ్బందై బాధపడింది. కారణం.. తనేం చెప్పినా ఎవరికీ అర్థంకాదు. అందుకే వెంట నేనుండాల్సిందే! బడిలో మిగిలిన అమ్మానాన్నలు గలగలా మాట్లాడుతుంటే మా అమ్మ మాత్రం బెరుగ్గా దూరంగా ఉండేది. ఇవన్నీ చాలామందికి చిన్న విషయాలుగా అనిపించొచ్చు. కానీ నాకిది చాలా పెద్ద విషయం. కానీ సాంకేతికత పెరుగుతున్న ఈ కాలంలోనూ ఒకరిపై మరొకరు ఆధారపడటం ఏంటనిపించింది. అందుకే.. బధిరుల భాషను అందరూ సులువుగా అర్థం చేసుకోవాలి. అలాగే బధిరులు కూడా తమ భావాలను ఇతరులతో తేలిగ్గా పంచుకోగలిగేలా చేయాలనుకున్నా. 

బధిరులకు సాయంగా..

2017లో ‘కనెక్ట్‌ హియర్‌’ అంకురాన్ని ప్రారంభించా. ఫేస్‌బుక్‌ సాయంతో అవసరమైన వారికి సైగ భాష నేర్పడం మొదలుపెట్టా. వీడియోకాల్‌ ఇంటర్‌ప్రిటేషన్‌, సైన్‌ లాంగ్వేజ్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో శిక్షణనివ్వడం ప్రారంభించా. అలాగే బధిరులు తమ గురించి తాము చెప్పడానికి ఆహ్వానించాం. వారి వ్యథలను అందరితో పంచుకోవడం, వారి భావాలను వ్యక్తీకరించడానికి ఇది మంచి వేదికగా మారింది. కానీ దీన్ని మరింత విస్తృత పరచడానికి కావాల్సిన వనరులు నా దగ్గర లేవు. చిన్న ఆఫీసు, నాలుగు కంప్యూటర్లు కొనే ఆర్థికస్థోమత కూడా లేదు. తర్వాత కొంతమంది మహిళలు అందించిన ఆర్థిక సాయం నా ఆశయాన్ని ముందుకు నడిపించింది. బధిరులకు సేవలందించాలనుకొనే వారికి మా కనెక్ట్‌ హియర్‌ ద్వారా శిక్షణనివ్వడం మొదలుపెట్టా. వర్క్‌షాపులు పెట్టి ఇంటర్వ్యూలు, బ్యాంకు, ఆసుపత్రులు, దుకాణాల్లో బధిరులకు సాయం చేయడానికి కావాల్సిన శిక్షణ ఇస్తాం. అలాగే ప్రభుత్వ ప్రకటనలు, వార్తల్ని సైగ భాషలోకి అనువదించడాన్ని నేర్పుతాం. ఇప్పటి వరకు 10 వేల మందికిపైగా శిక్షణ ఇచ్చాం. శిక్షణ పొందిన అభ్యర్థులను.. బధిరులు మా సంస్థ నుంచి సాయంగా తీసుకోవచ్చు. నా స్వదేశం పాక్‌ సహా అమెరికా వంటి దేశాలకు చెందిన 100కుపైగా జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో సైగభాష ద్వారా వేల మందికి మా అంకురం ఉపాధిని కల్పిస్తోంది.


ఈ నెలలో హైదరాబాద్‌లో జరిగిన టైగ్లోబల్‌ పోటీల్లో ‘కనెక్ట్‌ హియర్‌’ విజేతగా రూ.41 లక్షల్ని బహుమతిగా అందుకుంది. అజీమా సేవలకు డయానా అవార్డు సహా పలు పురస్కారాలు వరించాయి. వీళ్లది పాకిస్థాన్‌లోని లాహోర్‌. ఎంబీఏ పూర్తైన తర్వాత... పాకిస్థాన్‌ యూత్‌ అంబాసిడర్‌గానూ ఎంపికైంది. సోషల్‌ ఎంటర్‌ప్రైజ్‌ వరల్డ్‌ ఫోరంలో అజీమా బోర్డు మెంబరు కూడా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్