Updated : 26/12/2022 07:14 IST

అమ్మాయిలు.. సృష్టికర్తలు

ఆవిష్కరణకి ఆడా మగా అనే తేడా ఉంటుందా! ఎందుకు ఉండదు? సాధారణ సృజనలకీ, మహిళలు తమ అవసరాల కోసం.. ఒక స్త్రీగా ఆలోచించి ప్రాణం పోసిన ఆవిష్కరణలకి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఈ ఏడాది అలా మహిళలకోసం, మహిళలే రూపొందించిన అంశాలివి...


అమ్మ మనసుతో ఆలోచించి

బ్రెస్ట్‌పంప్‌... అమృతంలాంటి తల్లిపాలను తీసి దాచడానికి ఉపకరించే పరికరం. ఈ పరికరం లక్ష్యం మంచిదే అయినా.. పాలను సేకరించే విధానమే మోటుగా ఉంటుంది. ‘డబ్బాలు, వాటికి వేలాడే ట్యూబులు.. పరికరం బలంకొద్దీ రొమ్ముల నుంచి పాలను సేకరించే విధానం చూస్తే అచ్చంగా డెయిరీల్లో పశువుల నుంచి పాలు తీసే విధానమే గుర్తుకొచ్చేది. దానిని మార్చాలనుకున్నా’ అనే సమంత బేబియేషన్‌ సంస్థ సీఈవో. ‘భవిష్యత్తులో తన పిల్లలకు పాలు ఇవ్వాల్సి వస్తే ఎలా?’ అనే ఆలోచన నుంచే ఈ పరికరం ప్రాణం పోసుకుంది. ‘పైకి కనిపించకుండా లోదుస్తుల్లో అమరిపోయే పాలసంచులు.. అచ్చంగా పసిపాప తాగినంత సున్నితంగా పాలను సేకరించే విధానంతో ఈ పరికరాన్ని రూపొందించా. అందుకే వేలమంది తల్లులు ఈ పరికరం కోసం ముందస్తు ఆర్డర్లు ఇస్తున్నా’రంటోందామె.


అందానికి పరిష్కారం!

షాంపూ, కండిషనర్‌, బాడీవాష్‌, స్క్రబ్బర్‌, ఫేస్‌ప్యాక్‌ షీట్లు... ఇలా ఒక్కటేంటి అందాన్ని మెరుగుపరుచుకొనేందుకు కొన్ని వందల ఉత్పత్తులు మార్కెట్లో దొరుకుతున్నాయి. మనమూ వాటిని వాడుతున్నాం. మరి అవి మిగిల్చే ప్లాస్టిక్‌ వ్యర్థాల మాటేంటి? అంతేనా.. వాటిల్లోని హానికారక మైక్రోప్లాస్టిక్‌ మన శరీరంలోకి చేరి అనారోగ్యాలకూ కారణమవుతోంది. దీనికి పరిష్కారంగా ‘ప్లస్‌’ పేరుతో ప్లాస్టిక్‌ వ్యర్థాలు మిగలకుండా పూర్తిగా నీటిలో కరిగిపోయే ఉత్పత్తులని తయారుచేస్తోంది క్యాథరిన్‌ ఉడ్‌రఫ్‌. కాసిని నీళ్లు కలిపితే నురగవచ్చే షాంపూషీట్లు, బాడీవాష్‌ షీట్లు ‘ప్లస్‌’ ప్రత్యేకం. వీటిని ప్యాకింగ్‌ చేసేందుకు వాడే కవర్లూ నీటిలో పూర్తిగా కరిగిపోతాయి. దాంతో డ్రైనేజీల్లో అడ్డుకునిపోయే సమస్యా ఉండదు. పర్యావరణం మేలుకోరే ఆవిష్కరణగా ఈ ఏడాది అందరి ప్రశంసలూ అందుకొందీ సృజన.


డ్రాప్‌లెట్‌

మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీన్‌ వంటివి మనం ముఖానికి పట్టించామన్నమాటేకానీ.. అవి చర్మం లోపలికి ఇంకాయా లేదా అన్నది ప్రశ్నార్థకమే! మనకి ఆ సందేహం లేకుండా చేసే పరికరమే డ్రాప్‌లెట్‌. చేతిలో చిన్నగా అమరిపోయే ఈ పరికరంలో సీరమ్‌, మాయిశ్చరైజర్‌.. ఇలా నిర్దేశించిన ఉత్పత్తులని వేసి స్విచ్‌ ఆన్‌ చేస్తే చాలు. మన తలవెంట్రుకలో వందోవంతు పరిమాణంలోకి ఆ ఉత్పత్తులని మార్చి చర్మంలోకి ఇంకిపోయేట్టు చేస్తుందీ పరికరం. ఈ ఏడాది టైమ్‌ మెచ్చిన ఈ పరికరాన్ని ఎమ్‌ఐటీలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన మాధవి గవిని రూపొందించారు.


హత్తుకొనే బొమ్మలు

ఒంటరితనంతో బాధపడుతున్న వారికి.. ఆత్మీయ స్పర్శని అందిస్తాయి హగిమల్స్‌ బొమ్మలు. ప్రత్యేకమైన గ్లాస్‌బీడ్స్‌తో తయారుచేసిన ఈ బొమ్మలని హత్తుకుంటే.. తిరిగి అవి మిమ్మల్ని హత్తుకున్న భావన కలిగిస్తాయి. హెల్త్‌ జర్నలిస్ట్‌గా పనిచేసిన మెరినాకిడెకెల్‌ పిల్లల్లో పెరుగుతున్న ఒంటరితనం, ఆటిజం వంటి సమస్యలని అదుపు చేయడానికి ఈ బొమ్మలని పెద్దఎత్తున తయారుచేస్తోంది. టైమ్‌ ప్రకటించిన ఉత్తమ ఆవిష్కరణల్లో హగీమల్స్‌ కూడా ఉంది.


మనకోసం కొన్ని

వీగన్‌ అందాలు: వీగనిజాన్ని అనుసరించేవాళ్లు మాంసాహారానికీ, పాలకీ, తేనెకీ దూరంగా ఉంటారని తెలుసు. సౌందర్య ఉత్పత్తులకి కూడా దూరంగా ఉంటారని తెలుసా? ఎందుకంటే పెదాలకు వేసే లిప్‌కలర్స్‌ తయారీలో కొన్నిరకాల నత్తలు, కీటకాలు, జంతువుల కొవ్వులని వాడతారు కాబట్టి. కానీ ఇక నుంచి ఏ జంతువులనీ హింసించకుండా కేవలం నూనెలు, మినరల్స్‌ వంటివాటిని మాత్రమే వాడిచేసే వీగన్‌ లిప్‌స్టిక్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. అరోమీ సంస్థ ఇప్పటికే హింసలేని లిప్‌స్టిక్‌లని విడుదల చేసింది.

నాచు నుంచి దుస్తులు: భూమిలో కలవకుండా భారంగా మారిన ఫాస్ట్‌ ఫ్యాషన్‌కి అడ్డుకట్టవేసేందుకు ఈ ఏడాది అనేక ప్రయోగాలు జరిగాయి. వాటితో యాపిల్‌, పైనాపిల్‌, సముద్ర నాచు నుంచి తీసిన ఫైబర్‌తో రూపొందించిన దుస్తులు భవిష్యత్తుపై ఆశలు రేపుతున్నాయి.

వేడిలేని డ్రయ్యర్‌: సాధారణంగా తడి జుట్టుని ఆరబెట్టడానికి... హెయిర్‌డ్రయ్యర్‌ నుంచి వేడిగాలులు పంపి ఆరబెడుతుంటాం. ఆ వేడికి కుదుళ్లు బలహీనమై జుట్టు రాలిపోతుంటుంది. కానీ కొత్తగా వచ్చిన జువీహాలో హెయిర్‌ డ్రయ్యర్‌తో ఈ సమస్య ఉండదు. చల్లనిగాలులతోనే జుట్టుని ఆరబెడుతుందీ పరికరం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి