యుద్ధమైనా సిద్ధం...

నిండా ఇరవై ఏళ్లు నిండని అమ్మాయిలు. కలలకు రెక్కలు తొడిగి ఆకాశంలో ఎగరాలనుకున్నారు. పైగా చేసే పని సాహసోపేతంగా... అందరూ గర్వించేలానూ ఉండాలని దేశరక్షణలో భాగమవ్వాలనుకున్నారు.

Updated : 06 Jan 2023 06:06 IST

నిండా ఇరవై ఏళ్లు నిండని అమ్మాయిలు. కలలకు రెక్కలు తొడిగి ఆకాశంలో ఎగరాలనుకున్నారు. పైగా చేసే పని సాహసోపేతంగా... అందరూ గర్వించేలానూ ఉండాలని దేశరక్షణలో భాగమవ్వాలనుకున్నారు. తగ్గట్టుగానే కష్టపడి ఫైటర్‌ పైలట్‌ అయ్యే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్న అన్షిక, సానియాలను మీరూ కలిసేయండి.


చిన్నతనం నుంచే ఆసక్తి
అన్షిక యాదవ్‌

అందరూ బొమ్మలతో ఆడుతోంటే అన్షిక దృష్టెప్పుడూ విమానాలపైనే! తాతనడిగి పేపర్‌తో రాకెట్లు చేసి ఎగరేయడమంటే సరదా. పెద్దయ్యాక ఏమవుతావన్నా తన సమాధానం.. ‘విమానం నడుపుతాననే’! తను అన్నది సరదాగా కాదని ఆమె పెద్దయ్యాకే అందరికీ అర్థమైంది. స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ అయినా అన్షిక పెరిగిందంతా పంజాబ్‌లోని లూథియానా. అమ్మ పూజ, నాన్న డాక్టర్‌ డీఎన్‌ యాదవ్‌ పరిశోధకుడు. ఆయన వృత్తిరీత్యా ఎప్పుడూ ప్రయాణాల్లోనే ఉండేవారు. అందుకని తను అమ్మమ్మా తాతయ్యల దగ్గర పెరిగింది. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఫైటర్‌ పైలట్‌ అవుతానంది అన్షిక. తన కోరిక విని ముందు ఆశ్చర్యపడ్డారు. అందుకు చాలా కష్టపడాలన్నారు. దానికీ ముందే సిద్ధమయ్యిందామె. స్కూలు, కళాశాలల్లో ఎన్‌సీసీలో చేరి.. ‘బెస్ట్‌ ఎన్‌సీసీ క్యాడెట్‌’గానూ నిలిచింది. పది, ఇంటర్‌ల్లో 95% మార్కులు సాధించిన తను ఆటల్లోనూ ముందే. ఈత నేర్చుకొని జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలూ గెలిచింది. మనసుతోపాటు శరీరాన్నీ దృఢంగా ఉంచుకోవడానికే ఇవన్నీ చేసింది. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ ప్రవేశ పరీక్ష రాసి, జాతీయస్థాయిలో 17వ ర్యాంకు, అమ్మాయిల్లో ప్రథమ స్థానం సాధించింది. ఈ పరీక్ష ద్వారా మొత్తం 400 మందికి అవకాశమివ్వగా మహిళలకు కేటాయించింది 19 సీట్లే! వాటిల్లోనూ ఫైటర్‌ పైలట్‌ ఖాళీలు రెండే! వీటిల్లో ఒకటి కైవసం చేసుకుంది అన్షిక. జేఈఈలోనూ ఉత్తీర్ణత పొంది ఎన్‌ఐటీ కురుక్షేత్రలోనూ సీటు సాధించిందీ 18 ఏళ్ల అన్షిక. పుణె, తర్వాత హైదరాబాద్‌ల్లో శిక్షణ పూర్తిచేసుకోనున్న ఈ అమ్మాయి ‘దేశరక్షణలో పాలు పంచుకోవాలి. యుద్ధభూమిలో తలపడాలన్నది నా కల’ అంటోంది.


ఆంగ్ల మాధ్యమమే అవసరం లేదు
సానియా మిర్జా

‘అమ్మాయివి నీవల్ల ఏమవుతుంది? ఇంగ్లిష్‌ మీడియంలో చదివిన వాళ్లకే అవకాశాలు..’ లాంటి మాటలు వింటూ పెరిగింది 19 ఏళ్ల సానియా. అమ్మాయిలూ అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారు. అలాంటప్పుడు ఈ చిన్నచూపు ఎందుకు? అబ్బాయిలు సంపాదించాలి, అమ్మాయిలు వంటింటికి పరిమిత మవ్వాలన్న మాటలు సానియాకు నచ్చేవి కాదు. ఏదైనా సాధించి చూపాలనుకునేది. అందుకు ఏదైనా కొత్త రంగం ఎంచుకోవడం మేలనుకుంది. నాన్న చిన్న టీవీ మెకానిక్‌. వీళ్లది ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌. అప్పుడు సానియాకి 12 ఏళ్లు. టీవీలో మొదటి మహిళా ఫైటర్‌ పైలట్‌ లెఫ్టినెంట్‌ అవని చతుర్వేది గురించి వస్తోంది. అది చూసి ప్రేరణ పొంది తనూ ఆమె బాటలో నడవాలనుకుంది సానియా. అదే నాన్నతో చెప్పింది. వాళ్లది సంప్రదాయ ముస్లిం కుటుంబం. అయినా కూతురిని ప్రయత్నించనివ్వాలని అనుకున్నాడు ఆమె నాన్న. ఫైటర్‌ పైలట్‌ అవ్వాలన్న తన లక్ష్యం చెప్పినప్పుడు.. అందరూ హిందీ మాధ్యమంతో ప్రవేశ పరీక్షల్లో నెగ్గడం అసాధ్యమన్న మాటే! ఆ ఉద్దేశాన్నీ మార్చాలనుకొని కష్టపడి చదివింది. పది, ఇంటర్‌ల్లో స్కూల్‌, జిల్లా టాపర్‌గా నిలిచింది. తర్వాత ఎన్‌డీఏ ప్రవేశ పరీక్షపై దృష్టిపెట్టింది. రెండో స్థానంలో నిలిచింది. ‘తొలిసారి విఫలమయ్యా. అమ్మాయిలకు రెండే ఖాళీలన్నప్పుడు నిరుత్సాహపడ్డా. అదే వైఫల్యం తెచ్చిపెట్టింది. ఈసారి చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని కసిగా ప్రయత్నించా. చేయగలనా అని నిరుత్సాహపడే ఎంతోమందిలో స్ఫూర్తి నింపాలన్నదే నా కల’ అనే సానియా.. శిక్షణానంతరం దేశంలో మొదటి ముస్లిం మహిళా ఫైటర్‌ పైలట్‌గా నిలవనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్