దూసుకెళ్తున్నారు!

అభిమానులు తారలకేనా? కాస్త సృజనాత్మకత, మాటలతో మెప్పించగలిగితే చాలు.. లక్షల్లో ఫాలోయర్లు. అభిమానుల సంఖ్యతో తారలనీ ఆకర్షిస్తున్నారు. సినిమా అవకాశాల్నీ కొట్టేస్తున్నారు.

Updated : 08 Jan 2023 09:41 IST

అభిమానులు తారలకేనా? కాస్త సృజనాత్మకత, మాటలతో మెప్పించగలిగితే చాలు.. లక్షల్లో ఫాలోయర్లు. అభిమానుల సంఖ్యతో తారలనీ ఆకర్షిస్తున్నారు. సినిమా అవకాశాల్నీ కొట్టేస్తున్నారు. అంతేనా.. తమకున్న గుర్తింపుతో ‘ఫోర్బ్స్‌’ జాబితాకీ ఎక్కేస్తున్నారు. అలాంటి వారిలో కొందరు వీళ్లు..

పైజామాతో పాపులర్‌

షిర్లే సేథియాది దమన్‌. వీళ్ల కుటుంబం న్యూజీలాండ్‌లో స్థిరపడింది. మార్కెటింగ్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో డిగ్రీ చేసిన షిర్లేకి చిన్నప్పట్నుంచీ పాటలంటే పిచ్చి. పోటీల్లోనూ పాల్గొనేది. ఆక్లాండ్‌లో ఆర్‌జేగా చేస్తున్నప్పుడు శ్రేయాఘోషాల్‌ను కలుసుకొంది. ‘నీ గొంతు బాగుంది. పాడి యూట్యూబ్‌లో పెట్ట’మన్న సలహాతో తన పేరుతోనే ఛానెల్‌ ప్రారంభించింది. ఓ మ్యూజిక్‌ ఆల్బమ్‌ సంస్థ పోటీ నిర్వహిస్తోంటే సరదాగా ప్రయత్నిద్దామని పైజామా వేసుకొని పాడుతున్న వీడియో పంపింది. అప్పట్లోనే అది లక్షల వీక్షణలందుకుంది. దానిలో గెలిచి ‘పైజామా స్టార్‌’గా పాపులరైంది. 20 ఏళ్లకే కాన్సర్టుల్లో పాల్గొనేంత పేరొచ్చింది. తనకున్న ఆదరణకు ఫోర్బ్స్‌ ‘బాలీవుడ్స్‌ నెక్స్ట్‌ బిగ్‌ సింగింగ్‌ సెన్సేషన్‌’ అంటూ కితాబిచ్చింది. సినిమాల్లో పాడే అవకాశాలొచ్చాయి. యూట్యూబ్‌ సహా పలు ‘యూత్‌’ అవార్డులందుకుంది. సొంత ఆల్బమ్‌లనూ రిలీజ్‌ చేసిన ఈమె సంగీత శిక్షణ తీసుకోలేదు. తన యూట్యూబ్‌ ఖాతాను 38 లక్షలు, ఇన్‌స్టాను 75 లక్షలు, ఫేస్‌బుక్‌ను 88 లక్షలమంది అనుసరిస్తున్నారు. న్యూయార్క్‌లో ఫిల్మ్‌ కోర్సు చేసి, 2020లో ‘నిక్కమ్మ’తో బాలీవుడ్‌లో, ఈ ఏడాది ‘కృష్ణ వ్రింద విహారి’తో తెలుగులో నటనలోనూ అడుగుపెట్టింది 27ఏళ్ల షిర్లే.


ఓటీటీ డార్లింగ్‌

స్కూల్లో, కాలేజీలో నాటకాల్లో నటించినా, డ్యాన్స్‌ చేసినా, పాట పాడినా మిథిలా పాల్కర్‌కి అభినందనలు వెల్లువెత్తేవి. ఇంట్లోవాళ్లూ గర్వపడేవారు. తీరా నటనను కెరియర్‌గా ఎంచుకుంటానంటే మాత్రం దూరంగా ఉంచారు. తనది దాదర్‌. మాస్‌ మీడియాలో డిగ్రీ చేసింది. కర్ణాటిక్‌ సంగీతం, కథక్‌ల్లో ప్రావీణ్యం ఉంది. నటనలోనూ శిక్షణ తీసుకున్నాక థియేటర్‌ ఫెస్టివల్‌లో పనిచేసింది. అప్పుడే షార్ట్‌ఫిల్మ్‌లో నటించే అవకాశమిచ్చింది. అది అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై.. సినిమా, టీవీ ప్రకటనలు వెల్లువెత్తాయి. 2016లో ‘హాయ్‌ చల్‌’ అంటూ ఓ పాటపాడి యూట్యూబ్‌లో పెడితే అరవై లక్షల వ్యూస్‌తోపాటు దేశవ్యాప్తంగా పేరూ వచ్చింది. యూట్యూబ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీస్‌లతో ‘ఓటీటీ డార్లింగ్‌’గా పేరు తెచ్చుకుంది. అప్పుడే తనకీ స్థిరమైన కెరియర్‌ ఉందని ఇంట్లోవాళ్లూ మాట్లాడటం మొదలుపెట్టారు. మరాఠీ, హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈఏడాది ‘ఓరి దేవుడా’తో తెలుగునాటా పరిచయమైన మిథిల 2018లో ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30లో స్థానం దక్కించుకుంది. ఎన్నో అవార్డులూ వరించాయి. 29 ఏళ్ల మిథిలకి ఫేస్‌బుక్‌లో 14లక్షలు, ఇన్‌స్టాలో 38 లక్షలమంది ఫాలోయర్లున్నారు.


బిల్లీ మాసీగా గుర్తింపు

కుషా కపిలను చూసి చిన్నతనంలో ‘అసలీమె దేనికైనా పనికొస్తుందా’ అనేవారట. ఎంతసేపూ కథలు చదువుతూ, స్క్రిప్ట్‌లు రాస్తూ కూర్చునేదట. ఈమెది దిల్లీ. ఇంగ్లిష్‌ లిటరేచర్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులు చేసి అపారల్‌ డిజైనర్‌గా మారింది. సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, కంటెంట్‌ రైటర్‌గా మారి కొన్ని ప్రముఖ బ్యూటీ, ఫ్యాషన్‌ వెబ్‌సైట్లకీ పనిచేసింది. వ్యాసాల కంటే విషయాన్ని వీడియోల్లో హత్తుకునేలా చెప్పొచ్చనుకుంది. ‘సౌత్‌ దిల్లీ గర్ల్స్‌ పేరుతో ఆమె చేసిన ప్రయోగాలు వీక్షకులను మెప్పించాయి. దీంతో తనే సొంతంగా ప్రయత్నించాలనుకుంది. ఇతర సంస్థలతో కలిసి అపారల్‌, ఫ్యాషన్‌ సంస్థలను ప్రారంభించింది. చుట్టూ ఉన్న పరిస్థితులకు వ్యంగ్యాన్ని జోడించి వీడియోలు చేసేది. బిల్లీ మాసీ, జుల్మీ ఆంటీ, భారతీయ అమ్మ.. వంటి క్యారెక్టర్లు నెటిజన్లను బాగా ఆకట్టుకునేవి. యూట్యూబ్‌లో 7లక్షలు, ఇన్‌స్టాలో 29 లక్షలమంది ఆమెను అనుసరిస్తున్నారు. దీంతో యాంకర్‌, ప్రోగ్రామ్‌ హోస్ట్‌తోపాటు వెబ్‌సిరీస్‌, సినిమాల్లో నటించే అవకాశాలొచ్చాయి. వచ్చే ఏడాదికి అయిదు ప్రాజెక్టులకు సైన్‌ చేసింది. 33ఏళ్ల కుషా 2022లో సాధించిన విజయాలకు గుర్తింపుగా ఫోర్బ్స్‌ ‘శక్తిమంతమైన మహిళ’ల జాబితాలో చోటిచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్