నీటి కోసం.. ప్రపంచమంతా చుట్టేస్తోంది

భవిష్యత్తులో ప్రపంచం ఎదుర్కోబోయే గడ్డు సమస్య నీటికొరత. ఉపేక్షిస్తూ కూర్చుంటే పచ్చని మన నేలలూ.. ఎడారి భూములవుతాయి.

Published : 24 Jan 2023 00:55 IST

భవిష్యత్తులో ప్రపంచం ఎదుర్కోబోయే గడ్డు సమస్య నీటికొరత. ఉపేక్షిస్తూ కూర్చుంటే పచ్చని మన నేలలూ.. ఎడారి భూములవుతాయి. కానీ ఈ సమస్యని పట్టించుకునే వాళ్లెవరు? ప్రజల దృష్టిని నీటి    కొరతవైపు మళ్లించాలన్న లక్ష్యంతో మినాగులి 200 మారథాన్ల లక్ష్యంతో ప్రపంచాన్ని చుట్టేస్తోంది..

‘అడవులని బతికించుకోవడం కోసం మాట్లాడే మనం... నీటి గురించి ఎందుకు మాట్లాడం? సమయం గడిచేకొద్దీ ఉన్న కాస్త నీరూ ఆవిరైపోతోంది. నీళ్లు లేకపోతే అడవులూ లేవు. భవిష్యత్తులో ప్రజలు ఆకలితో కాదు... దాహంతో అల్లాడిపోతారు. ఈ నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదీ, కార్పొరేట్‌ సంస్థలది కూడా. అందుకే ప్రపంచంలోని ఎడారులూ, నీటికొరత ఎక్కువగా ఉన్న ప్రాంతాలే లక్ష్యంగా పరుగుపెడుతున్నా. అలా అయినా అందరి దృష్టి ఈ సమస్యపై పడుతుందన్నదే నా ఆశ’ అంటోంది మెల్‌బోర్న్‌లో న్యాయవాదిగా కెరియర్‌ ప్రారంభించిన మినాగులి. స్వచ్ఛమైన జలాలని కాపాడుకొనే ఉద్దేశంతో ‘థస్ట్‌’ అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించి.. ఇంతవరకూ తీవ్రమైన నీటికొరతని ఎదుర్కొంటున్న 17 దేశాలని తన మారథాన్లతో చుట్టేశారామె. ‘ఇప్పటికి 17 దేశాలే. త్వరలోనే మరో 40 దేశాలు నీటి ఎద్దడి బారిన పడి, ఎడారులవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్నిదేశాల్లో మంచినీటిని అందించే కుళాయిలు, పైపులైన్లు కూడా లేవు. దాంతో కలుషిత నీటిని తాగి, ప్రతి రోజూ ఐదేళ్లలోపున్న 800 మంది చిన్నారులు డయేరియా బారిన పడి మరణిస్తున్నారు. మనకున్న నీటిలో అధికశాతం కార్పొరేట్‌ కంపెనీలు తమ అవసరాల కోసం వాడుకుంటున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం కూడా వాళ్ల నుంచే రావాల’నే మినా ఇంతవరకూ ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో 155 మారథాన్లని పూర్తిచేశారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో ఈ ఏడాది జరిగే ప్రపంచ నీటి సదస్సు మొదలయ్యేనాటికి తక్కిన మారథాన్‌లని పూర్తిచేసి అల్ట్రామారథాన్‌ రన్నర్‌గా మారాలన్నది మినా లక్ష్యం. ‘ఇంతవరకూ ఎనిమిది వేల కిలోమీటర్ల దూరం పరుగుపెట్టా. అలాగని నేనో గొప్ప ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ని అనుకొనేరు. చిన్నప్పుడు స్కూల్లో నన్నెవరూ తమ టీమ్‌లోకి తీసుకొనేవారు కాదు. అంత బలహీనంగా ఉండేదాన్ని. మారథాన్‌ మధ్యలో కండరాలు దెబ్బతిన్నాయి. అనారోగ్యం పాలయ్యా. అయినా పరుగాపలేదు. 53 ఏళ్ల వయసులో ఇలా అలుపెరగకుండా పరుగుపెట్టడానికి కారణం నీళ్లే. తక్కిన మారథాన్‌లనీ పూర్తిచేయాలన్నదే నా లక్ష్యం. నేనే కాదు.. ఈ బ్లూరన్‌ ఛాలెంజ్‌లో మీరూ పాల్గొనవచ్చు. ప్రాణాధారమైన నీటిని కాపాడుకోవచ్చు’అంటారు మినా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్