వాస్తవాన్ని జీర్ణించుకుంటేనే...

మోడల్‌ని కావాలని ముంబయిలో అడుగు పెట్టా. తర్వాత ఏడాదికే అమ్మ క్యాన్సర్‌తో పోయింది. ఆ బాధను దిగమింగుకుంటోన్న సమయంలోనే మోడల్‌గా అవకాశాలు వరుసకట్టాయి.

Published : 24 Jan 2023 00:55 IST

మోడల్‌ని కావాలని ముంబయిలో అడుగు పెట్టా. తర్వాత ఏడాదికే అమ్మ క్యాన్సర్‌తో పోయింది. ఆ బాధను దిగమింగుకుంటోన్న సమయంలోనే మోడల్‌గా అవకాశాలు వరుసకట్టాయి. సినిమా ఛాన్సుల్నీ తెచ్చిపెట్టాయి. అప్పుడే ‘అనుమానాస్పదం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకీ ఎంటరయ్యా. ఈగ, మిర్చి, రామయ్యా వస్తావయ్యా, అత్తారింటికి దారేదీ... వంటి చిత్రాలతో నాకో గుర్తింపూ దక్కింది. జీవితం హాయిగా సాగిపోతోన్న సమయంలో ఒంట్లో చిన్న అలజడి. రొమ్ములో చిన్నగా నొప్పి... ఎందుకో మనసు కీడ శంకించి ఆసుపత్రికి పరుగెత్తా. క్యాన్సర్‌గా గుర్తించి ట్యూమర్‌ తీసేశారు. ఎందుకైనా మంచిదని ఇంకొన్ని పరీక్షలూ చేశారు. అప్పుడే తెలిసింది... అమ్మను కబళించిన క్యాన్సర్‌ రక్కసి నన్నూ జీవితాంతం వదలబోదని. వారసత్వంగా వచ్చే బ్రెస్ట్‌క్యాన్సర్‌ పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. దీనివల్ల ‘70 శాతం మళ్లీ క్యాన్సర్‌ తిరగబెట్టే ప్రమాదం, 45 శాతం జీవితాంతం క్యాన్సర్‌ వెంటాడే ప్రమాదం పొంచి ఉన్నాయి’ అన్న వైద్యుల మాటలతో నెత్తిన పిడుగు పడ్డట్లు అయ్యింది. ఈ వ్యాధి వల్ల నా బతుకు తలకిందులైపోకూడదంటే నా శక్తినంతా కూడదీసుకుని లేవగలగాలి. జీవితం ఎన్ని రకాల సవాళ్లు విసిరినా, ఎంత అన్యాయం చేయాలనుకున్నా నేను మాత్రం బాధితురాలిగా మారకూడదని గట్టిగా అనుకున్నా. అందుకే, బాధను పోగొట్టుకునేందుకు నాకు నేనే సర్ది చెప్పుకోవడం మొదలుపెట్టా. ఎందుకంటే నిరాశే నిప్పురవ్వ అయ్యి బాధలో ఉన్నవారిని నిలువునా దహించేస్తుంది. జీవితంపై ఆశ ఉంటే... అదే మనల్ని నడిపిస్తుంది. ఆ నమ్మకమే నేను కోలుకునేలా చేసింది. తిరిగి చిత్రీకరణల్లో పాల్గొనే ధైర్యాన్నిచ్చింది. కష్టాలు నాకే కాదు... ప్రతి ఒక్కరికీ వస్తాయి. వాటిల్లో కొన్నింటిని మనం అంత తొందరగా జీర్ణించుకోలేం... కానీ వాస్తవాన్ని అంగీకరించగలిగితే సమస్య నుంచి త్వరగా బయటపడగలం.

- హంసా నందిని, సినీనటి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్