..అందుకే అంతమంది ఫాలోయర్లు!

కూరగాయలు తరగడం మినహా వంట జోలికే పోలేదు.. ఒకప్పటి విషయమిది. మరి ఇప్పుడు? హైదరాబాదీ రుచులకు చిరునామాగా మారారు. లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.

Updated : 19 Feb 2023 08:03 IST

కూరగాయలు తరగడం మినహా వంట జోలికే పోలేదు.. ఒకప్పటి విషయమిది. మరి ఇప్పుడు? హైదరాబాదీ రుచులకు చిరునామాగా మారారు. లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. విదేశీయులకు తెలుగు వంటల రుచి చూపిస్తున్నారు. ఐరేని ఇందిర.. ఓ వైపు ఉద్యోగ బాధ్యతలు మరోవైపు యూట్యూబర్‌గా ఎలా కొనసాగగలుగుతున్నారు? ఆమె మాటల్లోనే..

అమ్మ కళావతి చేతి వంటకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే! అసలే ఉమ్మడి కుటుంబం. ఎంత వేగమో అంతే రుచిగా వండేది. మామూలు కూరలోనూ ప్రత్యేకత చూపించగలదు. నాకు మాత్రం దానిపై ఆసక్తే లేదు. సాయంగా కూరగాయలు మాత్రం తరిగిచ్చేదాన్ని. మాది సిద్దిపేట. నాన్న టీచర్‌. అమ్మాయిలు ఒకరిపై ఆధారపడకుండా ఎదగాలనేవారు. పెళ్లయ్యాక హైదరాబాద్‌కి వచ్చేశా. మావారు అనిల్‌ రాచమల్ల, అత్తమామలు కూడా నాన్న మాటే! దీంతో పెళ్లయ్యాకే హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, లిటరేచర్‌ల్లో పీజీ చేశా. ఫార్మసిస్టుగా ఉద్యోగాన్నీ సంపాదించా. పెళ్లైన కొత్తలో మావారి స్నేహితులు, బంధువులు వారాంతాల్లో ఇంటికొచ్చేవారు. వాళ్లందరికీ వంట చేయడం నావల్ల కాక అమ్మ సాయం కోరేదాన్ని. ఇలా చాలాసార్లు జరిగాక అమ్మను ఇబ్బంది పెట్టకూడదు అనుకొని తన వద్దే నేర్చుకోవడం మొదలుపెట్టా. తర్వాత బంధువులకు చేసిపెడితే మెచ్చుకున్నారు. అప్పట్నుంచీ ఎవరు బాగుందన్నా అదో కిక్కు. అలా వంట ఇష్టమైన వ్యాపకమైంది. పిల్లలు పెద్దయ్యాక హోంవర్క్‌లూ వాళ్లే చేసుకునేవారు. నాకేమో ఆఫీసయ్యాక చాలా సమయం మిగిలినట్లు అనిపించేది. టీవీ, ఇతర వ్యాపకాల్లేవు. దీంతో కొత్త వంటలు పరిచయం చేద్దామని 2016లో ‘హైదరాబాదీ రుచులు’ ప్రారంభించా. దేశంలోని అన్ని రాష్ట్రాలవారు, సంస్కృతులను ఇక్కడ చూడొచ్చు. అందుకే ఆ పేరు!

విదేశీయులకూ..

పదివేల ఫాలోయర్లు రావడానికి మూణ్నెళ్లు పట్టింది. ఇప్పుడా సంఖ్య ఎనిమిదిన్నర లక్షలకు పైమాటే! ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాల్లోనూ దాదాపు 7 లక్షలమంది అనుసరిస్తున్నారు. 1150 వంటలకు.. 17 కోట్లకుపైగా వీక్షణలున్నాయి. విజయవంతం అవ్వాలని కాదు కానీ అమ్మ, అమ్మమ్మల రుచులు చూపించాలనుకొని యూట్యూబ్‌లో కొచ్చా. ఇంతమంది ఆదరిస్తోంటే ఆనందమనిపిస్తోంది. అందుకే దీన్నో బాధ్యతగా భావిస్తా. ఇంట్లోవాళ్లకు చేసినవే వీడియో తీస్తా. మాది తెలంగాణ, అమ్మమ్మ వాళ్లు మహారాష్ట్రలో ఉండేవారు. మా అత్తగారిది ఆంధ్రా నేపథ్యం. ఆ వంటలన్నీ చూపిస్తుంటా. సెలవుల్లో పర్యటనలకు వెళ్లినా అక్కడి భిన్న సంస్కృతులు, ప్రజల ఆహార అలవాట్లు పరిశీలిస్తుంటా. వాటినీ నా శైలిలో ప్రయత్నిస్తుంటా. అందుకే నా వంటల్లో కొత్తదనానికి ఆస్కారమెక్కువ. కొత్తగా పెళ్లైనవారు, బ్యాచిలర్స్‌, పిల్లలకు ఆరోగ్య ఆహారంపై దృష్టి పెడుతుంటా. చాలామంది వంటంటే చాలా కష్టం అనుకుంటారు. ఆ అభిప్రాయం పోగొట్టాలనే పరిమిత వస్తువులతో సులభంగా చేసుకోవడం నేర్పిస్తుంటా. ప్రతీ వీడియోలో చివర ‘అంతే’ అంటుంటాను. ‘చూశారా వంట ఎంత సులువో’ అని చెప్పడమే ఉద్దేశం. మాకో బాబు, పాప. అమ్మాయి స్పెయిన్‌లో చదువుకునేటప్పుడు నా వీడియోలతోనే వంట నేర్చుకుంది.

ఆసక్తే ప్రధానం

వంటలకు నెగెటివిటీ ఉండదు అనుకుంటాం. కానీ వీడియో పెట్టగానే డిస్‌లైక్‌లు, నెగెటివ్‌ కామెంట్లు వచ్చేవి. మొదట్లో బాధేసేది. ఇప్పుడు వాటినసలు పట్టించుకోను. చాలామంది వంట ప్రయత్నించామని మెసేజ్‌లు, కొందరు ఫొటోలూ, వీడియోలూ పెడుతుంటారు. ఉద్యోగం, యూట్యూబ్‌ సమన్వయమెలా అనడుగుతారు చాలామంది. ఆసక్తి ఉంటే సమయమదే దొరుకుతుందంటాను నేను. దాంతోపాటు ఓపికా ఉండాలి. యూట్యూబే కాదు.. ఏ రంగమైనా ఈ లక్షణాలు తప్పనిసరి. ‘హైదరాబాదీ రుచులు’ పేరుతో ఈ-బుక్‌ తీసుకొచ్చా. తెలంగాణ పర్యటకశాఖ తరఫున విదేశీయులకు తెలుగు వంట రుచి చూపిస్తున్నా. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి పురస్కారాలూ అందుకున్నా. నెస్లీ, ఎంటీఆర్‌, హిమాలయ, ఫార్చ్యూన్‌, ప్రెస్టీజ్‌ వంటి ఎన్నో సంస్థలకు ప్రచారకర్తని. సొంత ఫుడ్‌ బ్రాండ్‌ తేవాలన్నది నా కల.

- భూపతి సత్యనారాయణ, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్