సంకల్పం ఉంటే అందరూ సానియాలే!

ఒక భారత మహిళా టెన్నిస్‌ క్రీడాకారిణికి అప్పటిదాకా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీకి అర్హత సాధించడం కూడా ఒక కలే. అలాంటిది ఆమె ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించింది. మహిళల డబుల్స్‌లో ఏకంగా ప్రపంచ నంబర్‌వన్‌ అయింది.

Updated : 24 Feb 2023 09:44 IST

ఒక భారత మహిళా టెన్నిస్‌ క్రీడాకారిణికి అప్పటిదాకా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీకి అర్హత సాధించడం కూడా ఒక కలే. అలాంటిది ఆమె ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించింది. మహిళల డబుల్స్‌లో ఏకంగా ప్రపంచ నంబర్‌వన్‌ అయింది. కెరియర్లో 47 టైటిళ్లు ఆమె సొంతం అయ్యాయి. ఒక క్రీడాకారిణిగా సానియా మీర్జా గొప్పదనానికి ఇవి రుజువులు. అయితే తను ఒక ఛాంపియన్‌ మాత్రమేనా? కాదు.. సానియా అంటే అంతకుమించి. ఆమె వ్యక్తిత్వం, పోరాటతత్వం, దృఢచిత్తం.. అన్ని రంగాల మహిళలకూ స్ఫూర్తి పాఠాలే. సానియాను ఇష్టపడని వాళ్లు కూడా నేర్చుకోగల లక్షణాలు తన సొంతం..

‘నన్నెవరైనా టీ తాగమని అంటే.. తాగుతా. కానీ ఆ టీ నేను కోరుకున్నట్లే ఉండాలి. వీలైతే ఆ టీ నేనే చేసుకుంటా’’.. ఓ సందర్భంలో సానియా అన్న మాటలివి. తన వ్యక్తిత్వాన్ని తెలిపే మాటలివి. తన జీవితంలో ఏ విషయాన్నీ ఇతరులు నిర్దేశించడానికి వీల్లేదు అంటుంది ఆమె. ఎవరినీ అనుసరించడానికి, అనుకరించడానికి ఇష్టపడని సానియా.. చిన్పప్పటి నుంచి తనకంటూ ఒక కొత్త బాట వేసుకుంది. ఆమె టెన్నిస్‌లోకి వచ్చే సమయానికి.. ఒక రోల్‌ మోడల్‌లా చూసేందుకు భారత మహిళల టెన్నిస్‌లో ఒక్కరూ లేరు. ‘‘టెన్నిస్‌లో మన అమ్మాయిలు ప్రపంచ స్థాయికి ఎదగలేరు’’ అనే బలమైన అభిప్రాయం నాటుకుపోయిన సమయంలో ఆమె ఈ ఆటలో అడుగు పెట్టింది. మహిళల టెన్నిస్‌లో భారత్‌ నుంచి ఎవరైనా ఏదైనా సాధించి ఉంటే.. దాన్ని అందుకోవడమే సానియా లక్ష్యం అయ్యేదేమో! అలా ఎవ్వరూ కనిపించకపోవడంతో ఆమె లక్ష్యాలకు హద్దంటూ లేకపోయింది. తను సాధించిన ప్రతి విజయం ఒక చరిత్రే అయింది. తన విజయాల నుంచే స్ఫూర్తి పొందుతూ అత్యున్నత శిఖరాల వైపు ఆమె అడుగులు వేసింది.

నాణేనికి మరోవైపు..

సానియా సాధించిన అసాధారణ విజయాలకు తోడు తన ఆకర్షణ, విలక్షణ వ్యక్తిత్వంతో దేశంలో ఒక తరాన్ని ఆమె ఊపేసింది. ఆటలో ఎవ్వరూ ఊహించని స్థాయికి ఎదిగింది. డబ్బు, కీర్తి వచ్చాయి. భారీగా అభిమానగణాన్ని సొంతం చేసుకుంది. అంతమాత్రాన సానియా జీవితం ఒడుదొడుకులు లేకుండా సాఫీగా సాగిపోయిందని అనుకుంటే పొరపాటే. కెరియర్‌ ఆరంభంలో ఆమె మత ఛాందసవాదుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంది. ఒక ముస్లిం అమ్మాయి పొట్టి దుస్తులేసుకుని ఆటలు ఆడటమేంటని అభ్యంతరాలు, హెచ్చరికలు కూడా అందుకుంది. పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌తో ప్రేమలో పడి, పెళ్లికి సిద్ధమైనప్పుడు ఎందరి నుంచో ఇబ్బందికర ప్రశ్నలు ఎదుర్కొంది. ఏమాత్రం తొణకలేదు. కోరుకున్న వాడిని పెళ్లాడింది.


మనం లక్ష్యం వైపు అడుగులేస్తున్న సమయంలో వెనక్కి లాగేవాళ్లు, రాళ్లేసేవాళ్లు చాలామందే ఉంటారు. వాళ్లందరినీ పట్టించుకోకుండా ఎలా ముందుకు సాగిపోవాలో సానియా చూపించింది


ముగింపులోనూ ఆమె మార్కు

2018లో బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో సానియా కథకు శుభం కార్డు వేసేశారు చాలామంది. అధికారికంగా రిటైర్మెంట్‌ ప్రకటించలేదన్న మాటే కానీ.. ఇక మళ్లీ ఆమె మైదానంలో అడుగు పెడుతుందని ఎవరూ అనుకోలేదు. ఒక బిడ్డకు జన్మనిచ్చాక శారీరకంగా, మానసికంగా మహిళల్లో వచ్చే మార్పుల తర్వాత అత్యున్నత ఫిట్‌నెస్‌ అవసరమైన టెన్నిస్‌లోకి తిరిగి అడుగు పెట్టి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో తలపడటం అంటే మాటలు కాదు. ఎందరో స్టార్‌ క్రీడాకారిణులు ఇక తమ వల్ల కాదని రాకెట్‌ను పక్కన పెట్టేసినవారే. కానీ అలా చేస్తే సానియా ప్రత్యేకత ఏముంది? అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ బిడ్డను కన్న ఏడాదికే ఆమె తిరిగి సాధన మొదలుపెట్టింది. కొన్ని నెలల తర్వాత ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లోకీ అడుగు పెట్టింది. టైటిళ్లూ గెలిచింది. ఎంత పట్టుదల ఉంటే ఇలాంటి పునరాగమనం సాధ్యం? కొత్త ఏడాదిలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడి ఫైనల్‌ చేరింది. తర్వాత తనకిష్టమైన దుబాయ్‌ నగరంలో డబ్ల్యూటీఏ టోర్నీతో అభిమానుల మధ్యే ఆటకు టాటా చెప్పింది.

పెళ్లి, పిల్లలు, ఆంక్షలు.. మహిళల కెరీర్‌కు అడ్డంకిగా నిలిచే కారణాలు చాలానే ఉంటాయి. ఆ కారణాలను చూపించి, ఇంకేం చేయలేం అని మనకు మనమే రాజీ పడిపోవాల్సిన పని లేదు. సంకల్ప బలం ఉంటే దేన్నయినా అధిగమించి ముందుకు సాగొచ్చనడానికి, జీవితంలో మన ఇష్టప్రకారమే ఏమైనా చేయొచ్చనడానికి సానియా జీవితమే ఉదాహరణ.

అన్నింటికీ మించి మన జీవితం మన చేతుల్లో ఉండాలంటే.. రాజీ లేకుండా బతకాలంటే.. ఎంచుకున్న రంగంలో హద్దులేమీ పెట్టుకోకుండా అత్యున్నత విజయాలు సాధించాలి. అదే సానియా నుంచి నేర్చుకోదగ్గ అతి పెద్ద పాఠం.

- చంద్రశేఖర్‌రెడ్డి తిమ్మాపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్